సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ క్ష్మ ఎన్నికలు జరిగి ఏడాదిన్నర గడిచినా ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహక నజరానా అందడం లేదు. 2013 జూలైలో జరిగిన నాలుగో సాధారణ ఎన్నికల్లో జిల్లాలో 13,564 గ్రామ పంచాయతీలకు గాను 108మంది సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 13,464 వార్డులకు గాను 1,794 వార్డుల్లో కూడా ఎన్నిక ఏకగ్రీవమైంది. కుల,మతాలు, వర్గాలు, పార్టీలకు అతీతంగా ఏకగ్రీవ ఎన్నిక జరిగిన గ్రామ పంచాయతీలకు ఎన్నికల సంఘం సూచన మేరకు ప్రభుత్వం ప్రోత్సాహం ప్రకటించింది.
15వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న పంచాయతీలకు రూ.20 లక్షలు, అంతకంటే తక్కువ జనాభా ఉన్న పంచాయతీలకు రూ.7లక్షల చొప్పున ప్రోత్సాహకం ఇవ్వాల్సి ఉంది. ఈ లెక్కన జిల్లాలో ఏకగ్రీవ పంచాయతీలకు రూ.7.56కోట్ల మేర ప్రోత్సాహక నజ రానా విడుదల కావాల్సి ఉంది. ఎన్నికలు ముగిసిన వెంటనే జిల్లా పంచాయతీ కార్యాలయం ద్వారా ప్రోత్సాహకం విడుదల చేయాలంటూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. అయితే, రాష్ట్ర విభజన, నూతన ప్రభుత్వం ఏర్పాటు నేపథ్యంలో ఆ ప్రతిపాదనలు మూలన పడ్డాయి. నూతన ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు కావస్తున్నా నిధుల విడుదలకు మోక్షం కలగడం లేదు. మూడో సాధారణ ఎన్నికల్లో 15వేల కంటే తక్కువ జనాభా ఉన్న ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు రూ.5లక్షల చొప్పున ప్రోత్సాహకం అందజేశారు. నాలుగో సాధారణ ఎన్నికల్లో ఈ మొత్తాన్ని రూ.7లక్షలకు పెంచడంతో ఈ నిధులతో చేపట్టే అభివృద్ధి పనులపై ఏకగ్రీవ పంచాయతీలు భారీ ఆశలు పెట్టుకున్నాయి.
మౌలిక సౌకర్యాలు మెరుగు
నిబంధనల మేరకు ప్రోత్సాహక నజరానాను పంచాయతీల్లో మౌలిక సౌకర్యాలు మెరుగు పరిచేందుకు వినియోగించాల్సి ఉంటుంది. వివిధ పద్దుల కింద పంచాయతీలకు నిధులు అందుతున్నా మౌలిక సౌకర్యాలు మెరుగు పరచలేక పోతున్నామని సర్పంచ్‌లు అభిప్రాయపడుతున్నారు. డ్రైనేజీలు, తాగునీటి పైపులైన్లు వంటి పనులు చేపట్టేందుకు ప్రోత్సాహకం విడుదల చేయాలని కోరుతున్నారు. గతంలో పంపిన ప్రతిపాదనలపై ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు ‘సాక్షి’కి వెల్లడించారు.
కలెక్టర్‌కు విన్నవించాం
ప్రోత్సాహక నజరానా విడుదల కోసం కలెక్టర్‌కు పలుమార్లు విజ్ఞాపన సమర్పించాం. ఇటీవలే సీఎం కేసీఆర్‌తో పాటు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిసి విజ్ఞప్తి చేశాం. ముఖ్యమంత్రి నుంచి సానుకూల స్పందన లభించింది. ప్రోత్సాహకం విడుదల చేస్తే పంచాయతీల్లో త్వరితగతిన అభివృద్ధి జరుగుతుంది. భవిష్యత్తులో మరిన్ని పంచాయతీలు ఏకగ్రీవ ఎన్నికకు ముందుకు వచ్చే అవకాశముంటుంది.
- పురుషోత్తం రెడ్డి, అధ్యక్షుడు, జిల్లా సర్పంచ్‌ల ఫోరం
పైసా ఇవ్వడం లేదు
ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహకం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినా ఆచరణకు నోచుకోలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఏకగ్రీవ పంచాయతీల్లో అభివృద్ధిపై ఉత్సాహం సన్నగిల్లుతోంది. నిధులు విడుదల చేస్తే త్వరితగతిన గ్రామాభివృద్ధి జరుగుతుంది.
- పురుషోత్తం నాయుడు, సర్పంచ్, పెంచికలపాడు, పెబ్బేరు మండలం
ప్రోత్సాహంపై నీళ్లు..!
Published Sun, Feb 22 2015 2:59 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement