అవినీతిపరుడు యడ్యూరప్ప
- మోడీ అధికారంలోకి వస్తే యడ్యూరప్ప టెలికాం మంత్రి
- కాంగ్రెస్, బీజేపీలపై నిప్పులు చెరిగిన అరవింద్ కేజ్రీవాల్
సాక్షి, బెంగళూరు/దొడ్డబళ్లాపురం, న్యూస్‌లైన్/ చిక్కబళ్లాపురం, న్యూస్‌లైన్: కర్ణాటకలోని రాజకీయ నాయకుల్లో అత్యంత అవినీతి పరుడైన నాయకుడు మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పేనని ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకులు అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. యడ్యూరప్ప తరువాతి స్థానంలో హరతాళు హాలప్ప, ఆనంద్‌సింగ్, జనార్దన్ రెడ్డి, డి.కె.శివకుమార్‌లు అవినీతిపరుల జాబితాలో స్థానం సంపాదించారని అన్నారు.
కర్ణాటకలో రెండు రోజుల పర్యటన నిమిత్తం నగరానికి వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం చిక్కబళ్లాపుర, దొడ్డబళ్లాపుర, యలహంక ప్రాంతాల్లో రోడ్ షో నిర్వహించారు. అనంతరం బెంగళూరులోని ఫ్రీడం పార్కులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేజ్రీవాల్ ప్రసంగించారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఫ్రీడం పార్కులో తన ప్రసంగాన్ని ప్రారంభించిన కేజ్రీవాల్ మొదటగా రాష్ట్రంలోని కన్నడిగులందరికి నా శుభాకాంక్షలు అంటూ కన్నడలో తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
అవినీతి పరుడని యడ్యూరప్పను ముఖ్యమంత్రి స్థానం నుంచి తొలగించిన బీజేపీ నుంచి బయటికి వెళ్లిన యడ్యూరప్పను మళ్లీ పార్టీలోకి ఎందుకు చేర్చుకుందో అర్థం కావడం లేదని అన్నారు. నరేంద్రమోడీ ప్రధానమంత్రి అయితే యడ్యూరప్పకు టెలికాం మంత్రిగా, శ్రీరాములుకు మైనింగ్ శాఖ మంత్రిగా పదవులు అప్పగిస్తారని పేర్కొన్నారు.
ఇక బీజేపీ అవినీతితో ప్రజలు విసిగిపోయిన సమయంలో అవినీతి నిర్మూలన మంత్రంతో రాష్ట్రంలో అధికారంలోకి వ చ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా అవినీతిని ప్రోత్సహిస్తూనే ఉందని అన్నారు. అవినీతి పరులైన డి.కె.శివకుమార్, రోషన్‌బేగ్‌లకు తన మంత్రి వర్గంలో ఎందుకు చోటు కల్పించాల్సి వచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
దేశాన్ని కూడా అప్పగించేస్తారా...
గుజరాత్‌ను ఎంతో అభివృద్ధి చేశానని నరేంద్రమోడీ చెప్పుకుంటున్నారని అయితే గుజరాత్‌లోని దాదాపు 60 వేల చిన్నతరహా పరిశ్రమలు ఆయన హయాంలోనే మూతపడ్డాయని కేజ్రీవాల్ పేర్కొన్నారు. చిన్న చిన్న పరిశ్రమలన్నింటిని మూతపడేలా చేసి పారిశ్రామిక రంగాన్నంతా అంబానీ, టాటా వంటి నాలుగు కుటుంబాలకే అప్పగించాలనేది మోడీ ఉద్దేశమని అన్నారు.
ఇక మోడీ ప్రధాని అయితే దేశాన్ని కూడా ఆ నాలుగు వ్యాపార కుటుంబాలకే అప్పగించేస్తారా అని ప్రశ్నించారు. ప్రస్తుతం కర్ణాటకతో పాటు దేశంలోని ప్రజలందరికీ ప్రత్యామ్నాయంగా ఆప్ కనిపిస్తోందని, దేశ రాజకీయాల్లో మార్పు తీసుకురాగల సామర్ధ్యం ఒక్క ఆప్‌కే ఉందని అన్నారు. కాగా శనివారం సాయంత్రం కేజ్రీవాల్‌తో విందు కార్యక్రమం ద్వారా రూ.50 లక్షల విరాళాలను సేకరించినట్లు ఆప్ ప్రకటించింది. ఆప్‌కు విరాళాలు అందించిన వారందరి వివరాలను వెబ్‌సైట్‌లో ప్రకటిస్తామని ఆప్ వెల్లడించింది.
దొడ్డబళ్లాపురలో...
అడవి దొంగ వీరప్పన్ కంటే కేంద్రమంత్రి వీరప్పమొయిలీ ఎక్కువగానే సంపాదించుకున్నారని, రిలయన్స్‌కు అడ్డగోలుగా గ్యాస్ కేటాయింపులు చేయడం ద్వారా కోట్లాది రూపాయలు వెనకేసుకున్నారని అరవింద్‌క్రేజీవాల్ విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చిక్కబళ్లాపురం లోక్‌సభ స్థానం నుంచి తమ పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తున్న అర్కేశ్ తరఫున ప్రచారం చేసిన ఆయన ఇక్కడి పాత బస్టాండులో రోడ్‌షోలో పాల్గొని ప్రసంగించారు. ప్రసంగం ఆద్యంతం ఆయన వీరప్పమొయిలీ, నరేంద్ర మోడీలపై నిప్పులు చెరిగారు. అభివృద్ధిని విస్మరించిన మొయిలీని ఈసారి ఎన్నికల్లో ఇంటికి పంపించాలని పిలుపునిచ్చారు.
చిక్కబళ్లాపురలో....
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలను ఓడించి ఆప్ అభ్యర్థికి మద్దతునివ్వాలని కేజ్రీవాల్ కోరారు. చిక్కబళ్లాపురలోని టౌన్‌హాల్ మీదుగా ఆదివారం కేజ్రీవాల్ రోడ్ షో నిర్వహించారు. గతంలో చిక్కబళ్లాపుర పార్లమెంటు స్థానం నుంచి వీరప్పమొయిలీని గెలిపించి పంపిస్తే ఆయన ఇక్కడి ప్రజలకు ఏ ప్రయోజనం చేకూర్చలేక పోయారని విమర్శించారు. చిక్కబళ్లాపురలో అభివృద్ధి జరగాలంటే ఈ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.