సాక్షి, బెంగళూరు : గుజరాత్‌లో నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధి ఏమిటనే విషయంపై ప్రజలకు నిజాలను తెలియజేయగల ధైర్యం మీడియాకు ఉందా అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకులు అరవింద్ కేజ్రీవాల్ మరోసారి మీడియాపై మండిపడ్డారు. దేశంలోని కొన్ని మీడియా సంస్థలు కావాలనే మోడీని ఆకాశానికెత్తేస్తున్నాయంటూ విరుచుకుపడ్డారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం కర్ణాటకకు వచ్చిన ఆప్ నేత కేజ్రీవాల్ శనివారం బెంగళూరు నగరంలో రోడ్ షో నిర్వహించారు.
శనివారం ఉదయం 9.30 గంటలకు హెబ్బాళ ఫ్లై ఓవర్ నుండి కేజ్రీవాల్ రోడ్ షో ప్రారంభమైంది. అక్కడి నుంచి గంగానగర, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సర్కిల్, లాల్‌బాగ్, జయనగర 4వబ్లాక్, గాంధీ బజార్, రాజాజీనగరల గుండా ఆయన రోడ్ షో సాగింది. రోడ్ షో సమయంలో మధ్య మధ్యలో జనసమూహం వద్ద కేజ్రీవాల్ ఆగుతూ తన ప్రసంగాన్ని కొనసాగించారు.
ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ... మోడీ హయాంలో గుజరాత్‌లో దాదాపు 60 వేల చిన్న తరహా పరిశ్రమలు మూతపడడం నిజం కాదా అని ప్రశ్నించారు. అంతేకాక మోడీ హయాంలో గుజరాత్‌లో అవినీతి పెరగిపోవడం, 800 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడడం ఇవన్నీ నిజం కాదేమో మోడీ సమాధానం చెప్పాలని అన్నారు. అయితే వీటన్నింటిని పక్కకు పెట్టి కొన్ని మీడియా సంస్థలు మోడీ హయాంలో అంతా అభివృద్ధే అంటూ ఎందుకు చెప్పుకొస్తున్నాయో తెలియడం లేదని అన్నారు.
అలాంటి మీడియా సంస్థల గురించే తాను మాట్లాడాను తప్ప అన్ని మీడియా సంస్థలను విమర్శించలేదని వివరించారు. ఇక జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు రెండూ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయాయని కేజ్రీవాల్ విమర్శించారు. ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా రాష్ట్రంలో తమ పార్టీ అభ్యర్థులు ఎన్నికల బరిలోకి దిగుతున్నారని పేర్కొన్నారు. రాజకీయాల్లో పూర్తి పారదర్శకత తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్న తమ పార్టీకి, పార్టీ అభ్యర్థులకు మద్దతివ్వాలని ఆయన నగర ప్రజలను కోరారు.
ట్రాఫిక్ అస్తవ్యస్తం...
కేజ్రీవాల్ నగర పర్యటనతో నగరంలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది. కేజ్రీవాల్ రోడ్ షో ప్రారంభించిన హెబ్బాళతో పాటు గంగానగర, జయనగర ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలగడంతో వాహనదారులు చాలాసేపు ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఇక ఆప్‌లో దళితులు, పేదలకు స్థానం కల్పించలేదంటూ కర్ణాటక లేబర్ యూనియన్ కార్యకర్తలు కేజ్రీవాల్ రోడ్ షోకు అడ్డుతగిలారు. కేజ్రీవాల్ రోడ్ షో రాజాజీనగరకు చేరుకోగానే అక్కడ గుమికూడిన కర్ణాటక లేబర్ యూనియన్ కార్యకర్తలు కేజ్రీవాల్‌కు నల్లజెండాలను చూపుతూ నిరసన వ్యక్తం చేశారు. తనతో కలిసి భోజనం చేయాలంటే రూ.20 వేలు చెల్లించాలనే వ్యక్తి దేశంలో అవినీతిని ఎలా నిర్మూలిస్తారంటూ వారు కేజ్రీవాల్‌ను ప్రశ్నించారు.
నేడు చిక్కబళ్లాపురతో పాటు నగరంలోనూ ర్యాలీ....
చిక్కబళ్లాపుర పార్లమెంటు పరిధిలో కేజ్రీవాల్ ఆదివారం పర్యటించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి దాదాపు రెండు గంటల వరకు చిక్కబళ్లాపుర పార్లమెంటు పరిధిలోని ప్రాంతాల్లో కేజ్రీవాల్ రోడ్ షో నిర్వహించనున్నారు. ఈ సమయంలో కేంద్ర మంత్రి వీరప్పమొయిలీని ముఖ్యంగా కేజ్రీవాల్ టార్గెట్ చేసుకోనున్నారని తెలుస్తోంది. ఇక చిక్కబళ్లాపురలో రోడ్ షో ముగిసిన అనంతరం సాయంత్రం మూడు గంటలకు తిరిగి కేజ్రీవాల్ నగరానికి చేరుకోనున్నారు. నగరంలోని ఫ్రీడం పార్క్ నుంచి సాగే ర్యాలీలో కేజ్రీవాల్ పాల్గొననున్నారని పార్టీ వర్గాల సమాచారం.
300 మందితో విందు....
ఇక పార్టీ కోసం విరాళాల సేకరణలో భాగంగా నగరంలోని ఓ హోటల్‌లో ఏర్పాటుచేసిన విందు కార్యక్రమంలో కేజ్రీవాల్ పాల్గొన్నారు. ఈ విందులో పాల్గొనడానికి రూ.20 వేలు చెల్లించి పేర్లను నమోదు చేయించుకోవాల్సిందిగా ఆప్ కోరిన విషయం తెలిసిందే. నగరంలోని 300 మందికి ఈ విందులో పాల్గొనేందుకు ఆప్ అవకాశం కల్పించింది.
మోడీ నిజస్వరూపాన్ని చూపించే
Published Sun, Mar 16 2014 2:06 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
Advertisement