బీజేపీతో ఉగ్రవాదానికి ఊతం
ప్రతిపక్షంపై ధ్వజమెత్తిన సోనియా
కొంతమంది దేశభక్తులమంటూ డప్పుకొట్టుకుంటున్నారు
అధికారంలో ఉన్నపుడు బీజేపీ ఏం చేసింది
పరిపాలన అంటే పిల్లలాట అని కేజ్రీవాల్ తలచారు
న్యూఢిల్లీ/లఖింపూర్ (అస్సాం): బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, ఆప్ అగ్రనేత అరవింద్ కేజ్రీవాల్‌లపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నిప్పులు చెరిగారు. లౌకిక విలువలపై నమ్మకం లేనివారు దేశభక్తి స్ఫూర్తిని అర్థం చేసుకోలేరన్నారు. అలాంటి వాళ్ల చేతికి అధికారం వస్తే దేశాన్ని విధ్వంసంవైపు నడిపిస్తారని మండిపడ్డారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత ఆదివారం తొలిసారి ఢిల్లీలో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె పాల్గొన్నారు. ‘‘కొంతమంది తామే దేశభక్తులమంటూ డప్పు కొట్టుకుంటున్నారు.
మీరు చెప్పండి లౌకిక విలువలపై నమ్మకం లేనివాళ్లు దేశభక్తి స్ఫూర్తిని అర్థం చేసుకోగలరా? లేదు. మిమ్మల్ని తప్పుదోవ పట్టించడం ద్వారా వాళ్లు అధికారం చేజిక్కించుకోడానికి ప్రయత్నిస్తున్నారు’’ అని సభను ఉద్దేశించి చెప్పారు. బీజేపీ భావజాలంతో ఉగ్రవాదం వ్యాప్తి చెందుతుందన్నారు.
ప్రతిపక్షానిది అన్నదమ్ముల్ని, సమాజాన్ని విభజించే భావజాలమని విమర్శించారు. ఈ ఎన్నికలు రెండు భావజాలాల మధ్య పోటీ అని చెప్పారు. ఉగ్రవాద, విభజనవాద భావజాలంగల బీజేపీని ఓడించాలని ప్రజలను కోరారు. ఇదే సందర్భంలో ఆప్ అగ్రనేత అరవింద్ కేజ్రీవాల్‌పై కూడా విమర్శలు చేశారు. కొంతమంది ముఖ్యమంత్రి పదవి అంటే చిన్నపిల్లలాట అనుకున్నారని, పదవిని వదలి పారిపోయారని ధ్వజమెత్తారు. ఢిల్లీలో తమ పార్టీ ఓటమికి కేజ్రీవాలే కారణమన్నారు. దళితుల, ముస్లింల అభివృద్ధి తమతోనే సాధ్యమని పునరుద్ఘాటించారు.
ప్రలోభాలకు లొంగవద్దు..
బీజేపీ విద్వేష పూరిత రాజకీయాలు చేస్తోందని ఆదివారం లఖింపూర్‌లో జరిగిన సభలో ధ్వజమెత్తారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ, తప్పుడు హామీలిచ్చే అలాంటి పార్టీల ప్రలోభాలకు లొంగవద్దని ప్రజలను హెచ్చరించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నపుడు ఏం పనులు చేశారంటూ ప్రశ్నించారు. మాటలకు చేతలకు మధ్య చాలా వ్యత్యాసం ఉంటుందని అన్నారు. తమతోనే దేశంలో ఐక్యత సాధ్యమని, ‘గంగ-యమున’ సంప్రదాయాన్ని కాంగ్రెస్ పటిష్టపరిచిందని చెప్పారు. గతంలో తామిచ్చిన హామీలన్నీ నెరవేర్చామని తెలిపారు.