పవనిజం ఇదేనా?
బీజేపీ-టీడీపీ పొత్తుపై ఆగ్రహావేశాలు
అన్నదమ్ములు.. తమ ఆశలను అడియాసలు చేశారని అభిమానుల మండిపాటు
కర్ణాటకలో పవన్ కళ్యాణ్ ప్రచారానికి మద్దతు ఇవ్వకూడదని నిర్ణయం
విభజన పాపంలో బీజేపీ భాగస్వామి అని ప్రవాసాంధ్రుల ఆగ్రహం
బెంగళూరు, న్యూస్‌లైన్ : తెలుగు సినీ పరిశ్రమలో గత రెండున్నర దశాబ్దాలుగా గుంభనంగా ఉన్న శత్రుత్వాన్ని మరిచి ప్రత్యర్థులకు ఎలా ఓటు వేయగలమని అభిమానులు పవన్ కల్యాణ్‌ను నేరుగా ప్రశ్నిస్తున్నారు. జనసేన పార్టీని స్థాపించిన పవన్, ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి ఓటు వేయాలని అభిమానులకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. రాజకీయ పార్టీని స్థాపించి ఎన్నికల్లో పోటీ చేయకుండా, ఇవేం మాటలని మొదట్లో అభిమానులు పవన్ వైఖరిపై ఆశ్చర్యం వ్యక్తం చేసినా, మోడీని సమర్థించమన్నారు కదా అని సర్దుకున్నారు.
అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం బీజేపీతో టీడీపీ పొత్తు కుదిరిన నేపథ్యంలో అభిమానుల ఆలోచనల్లో శర వేగంగా మార్పులు వస్తున్నాయి. రెండున్నర శతాబ్దాలుగా చిరంజీవి, బాలకృష్ణ అభిమానుల మధ్య తీవ్రమైన పోటీ ఉన్న విషయం జగద్విదితమే. తమ హీరోల సినిమాలు విడుదల సందర్భంగా అభిమాన ులు పోటా పోటీగా భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయడం ఆనవాయితీ. ఏ థియేటర్‌లో ఏ షోకు ఎంత కలెక్షన్.. అని రోజూ లెక్కలు వేసే వారు. బాలకృష్ణ సహజంగానే ఆయన తండ్రి స్థాపించిన తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు.
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించడంతో ఉభయుల మధ్య సినీ రంగంలో ఉన్న శత్రుత్వం రాజకీయాలకూ వ్యాపించింది. గత అసెం బ్లీ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ 18 మంది ఎమ్మెల్యేలను గెలుచుకోవడం, కాల క్రమంలో ఆ పార్టీని చిరంజీవి కాంగ్రెస్‌లో కలిపేయడం లాంటి పరిణామాలు అభిమానులకు మింగుడు పడలేదు. ఎక్కువ మంది అభిమానులు అప్పటి నుంచే రాజకీయాలకు దూరమయ్యారు.
ఈ నేపథ్యంలో పవన్ కొత్త పార్టీని స్థాపించడంతో ప్రవాసాంధ్ర అభిమానుల్లో ఆనందం వెల్లి విరిసింది. తమకూ ఓ రాజకీయ పార్టీ ఏర్పడిందని వారంతా సంతోషం వ్యక్తం చేశారు. రోజులు గడవక ముందే ఆయన కూడా అన్నబాట పట్టి ఏకంగా బీజేపీకి మద్దతు పలికారు. అసలే అన్న వైఖరితో రాజకీయ వైరాగ్యంతో ఉన్న అభిమానులను పవన్ నిర్ణయం మరింతగా బాధిం చింది. ఎలాగో సర్దుకున్నా, ఇప్పుడు ఆ పార్టీకి టీడీపీతో కుదిరిన పొత్తు వారిని మళ్లీ నైరాశ్యంలోకి నెట్టింది. అన్నదమ్ములు...తమ ఆశలను అడియాసలు చేశారని ఆగ్రహంతో ఊగిపోతున్న అభిమానులు, పవన్ కర్ణాటకలో ప్రచారానికి వచ్చినా మద్దతు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు.
ఆయన చెప్పే పార్టీకి ఓటు వేయకూడదని నిర్ణయించుకున్నామని అభిమాన సంఘం నేత ఒకరు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ విభజన పాపంలో కాంగ్రెస్‌తో పాటు బీజేపీకీ సమాన వాటా ఉందని ప్రవాసాంధ్రులు మండిపోతున్నారు. కనుక కాంగ్రెస్ లేదా బీజేపీ కాకుండా వేరే ఏ పార్టీకైనా ఓటు వేయాలని ప్రవాసాంధ్ర అభిమానులు నిర్ణయించారు.