చీపురు.. సూపర్! | elections betting | Sakshi
Sakshi News home page

చీపురు.. సూపర్!

Published Wed, Mar 26 2014 11:15 PM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM

చీపురు.. సూపర్! - Sakshi

చీపురు.. సూపర్!

న్యూఢిల్లీ:అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా విజయం సాధించిన ఆమ్‌ఆద్మీ పార్టీ ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లోనూ దేశవ్యాప్తంగా గౌరవప్రదమైన స్థానాలు దక్కించుకుంటుందని దేశ రాజధానిలో బుకీలు భావిస్తున్నారు. ఇప్పటివరకు వారు ఎటువంటి బెట్టింగ్‌లను ప్రారంభించకపోయినప్పటికీ, అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలో ఆప్ సామర్థ్యంపై వారు ఆతృతగా ఉన్నారు.
 
ఇప్పటివరకు ఒకేఒక్క ఎన్నికల్లో నిలబడి అందరి దృష్టినాకర్షించిన ఆప్, వచ్చే నెల 7 నుంచి మే 12వ తేదీవరకు జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లోనూ తన సత్తా చూపనుందని వారు అంచనాలు వేస్తున్నారు.దేశవ్యాప్తంగా ఆప్ అభ్యర్థులు నిలబడే స్థానాలపై బెట్టింగ్ కాయడానికి వారు ఎదురుచూస్తున్నారు. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ పోటీచేస్తున్న వారణాసి, కాంగ్రెస్‌కు చెందిన పవన్‌కుమార్ బన్సల్‌కు ఇద్దరు బాలీవుడ్ నటులు గట్టిపోటీ నివ్వనున్న చండీగఢ్, అజయ్ మాకెన్ సహా పలువురు ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న న్యూఢిల్లీ నియోజకవర్గం తదితర స్థానాలపై బుకీలు ప్రధానంగా దృష్టిపెట్టారు.
 
పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక బుకీ మాట్లాడుతూ.. ఆప్ నిలుచున్న స్థానాలపై బెట్టింగ్‌లు మొదలుపెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపాడు. ఆప్ ఫలితాలపై తాము చాలా ఆసక్తిగా ఉన్నామని ఆయన వివరించాడు. మరో బుకీ మాట్లాడుతూ..‘బీజేపీ అధికార ఆశలపై ఆప్ నీళ్లు చల్లే అవకాశముంది. చాలా ప్రాంతాల్లో బీజేపీకి ఆప్ గట్టి పోటీనివ్వనున్నట్లు సర్వేలు చెబుతున్నాయి.
 
 ఒక్కసారి మేం బెట్టింగ్‌లు ప్రారంభిస్తే చాలామంది ‘ఆప్’పైనే బెట్ కట్టేందుకు క్యూ కట్టనున్నారు. ఎందుకంటే ఆ పార్టీమీద కాస్తేనే తమకు భారీగా డబ్బు వాపసు వస్తుందని ఆశ..’ అని అన్నారు.ఇటీవల జరిగిన దేశ రాజధాని అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఊహించని రీతిలో 28 స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఆ పార్టీ 49 రోజులపాటు పరిపాలన సాగించింది.అయితే అసెంబ్లీలో జన్‌లోక్‌పాల్ బిల్లును ప్రవేశపెట్టే ముందు చేపట్టిన విశ్వాస పరీక్షలో ఆ పార్టీ బలాన్ని నిరూపించుకోలేకపోవడంతో అధికారాన్ని వదులుకుంది.

కాగా, ఆ ఎన్నికల సమయంలో బుకీలెవరూ ఆప్‌పై ఎక్కువ దృష్టి పెట్టలేదు. బీజేపీపై 2.25 పైసలు,కాంగ్రెస్‌పై 2.40 పైసలు బెట్టింగ్ పెట్టారు. ఆప్ గెలుపుపై ఎటువంటి అంచనాలు లేకపోవడందో ఆ పార్టీపై కేవలం 3.40 పైసలు బెట్టింగ్ నడిచింది. బెట్టింగ్‌లో ఏ పార్టీపై తక్కువ లాభాలు చూపించారో ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశమున్నట్లు లెక్క.

దీనివల్ల ఎక్కువ మంది పందెంరాయుళ్లను ఆకర్షించేందుకు గెలుపు గుర్రాలపై తక్కువ మొత్తాన్ని బెట్ పెడతారు. వివరంగా అంటే.. పందెంరాయుడు బీజేపీపై రూ.లక్ష పందెం కాస్తే, పార్టీ విజయం సాధిస్తే సదరు పందెంరాయుడికి రు.2.25 లక్షలు వస్తాయి. అదే కాంగ్రెస్‌పై అయితే రూ.2.40 లక్షలు, ఆప్‌పై బెట్‌కాసి ఉంటే రూ.3.40 లక్షల భారీమొత్తం గెలుచుకుంటారు.  
 
కాగా, అప్పటి ఎన్నికల్లో బుకీలు బీజేపీకి మొదటి, కాంగ్రెస్ రెండో ప్రాధాన్యమిచ్చారు. అయితే అనూహ్యంగాా ఆప్ విజయం సాధించడంతో బుకీలు సైతం షాక్ తిన్నారు.ఇదిలా ఉండగా, ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి, చండీఘడ్, అమేథీ, న్యూఢిల్లీ, చాందినీ చౌక్, ఘజియాబాద్ వంటి ప్రతిష్టాత్మక కేంద్రాలపై ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక ధరలు నిర్ణయిం చినట్లు కొందరు బుకీలు చెబుతున్నారు.
 
పోలింగ్ రోజు దగ్గరపడుతున్న కొద్దీ మారుతున్న రాజకీయ సమీకరణాలను బట్టి ఆయా బెట్టింగ్ ధరల్లో మార్పులుచేర్పులు జరుగుతుంటాయని వారు వివరించారు. కాగా, బెట్టింగ్ అనేది చట్టవిరుద్ధం. బుకింగ్ వ్యవహారాలపై పోలీసులు నజర్ వేసి ఉన్నారు. ఎవరైనా బెట్టింగ్ నడుపుతూ పట్టుబడితే వారికి నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద అరెస్టు చేస్తారు. ఈ కేసులో దోషులకు ఏడు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాల కారాగార శిక్ష పడే అవకాశముంది.. తస్మాస్.. జాగ్రత్త!

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement