'ప్లీజ్.. అంటే సోనియా వింటుందా?'
న్యూఢిల్లీ: 'ప్లీజ్ సోనియా గాంధీ గారు.. హెలికాప్టర్ల స్కామ్ లో ఎంత డబ్బు తీసుకున్నారో చెప్పండి ప్లీజ్..! అని అడిగితే ఆవిడ నిజం చెబుతుందా? కచ్చితంగా చెప్పదు. అందుకే సోనియా గాంధీని అరెస్ట్ చెయ్యాలి. లాకప్ లో ఉంచి రెండంటే రెండు రోజులు విచారిస్తే నిజానిజాలు వాటంతట అవే తన్నుకొస్తాయి. కానీ సోనియాను జైల్లో పెట్టాల్సింది ఎవరు? అంత దమ్ము 56 ఇంచుల ఛాతీ ఉందని చెప్పుకునే నరేంద్ర మోదీకి ఉందా?' అంటూ ఒకేసారి అటు అధికార , ఇటు విపక్ష పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. అగస్టా వెస్ట్ లాండ్ హెలికాప్టర్ల స్కాంలో నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం జంతర్ మంతర్ వద్ద ఆప్ నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్న కేజ్రీవాల్ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై నిప్పులు చెరిగారు.
'అగస్టా కుంభకోణంపై ఇటలీ కోర్టు ఇచ్చిన నివేదికలో సోనియా గాంధీతోపాటు ఆమె రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ పేర్లు స్పష్టంగా ఉన్నాయి. ఇవి వెలుగులోకి వచ్చి నాలుగేళ్లు దాటింది. భారత్ ను అవినీతి రహిత దేశంగా మార్చుతామని, అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి నరేంద్ర మోదీ రెండేళ్ల కిందట ఎన్నికల్లో గెలిచారు. మరి అగస్టా విషయంలో ఆయన ఇంతకాలం ఎందుకు సైలెట్ గా ఉన్నారు? ఆధారాలున్నా చర్యలు తీసుకోలేదెందుకు? అలాంటప్పడు సీబీఐ, ఈడీ, ఇతర దర్యాప్తు సంస్థలు ఉండి లాభం ఏమిటి? వాటిని వెంటనే మూసేయండి' అని కేజ్రీవాల్ ఉద్వేగభరితంగా మాట్లాడారు.
భార్యాభర్తలు కీచులాడుకోరా?
'చిన్నచిన్న కేసులకే ఆమ్ ఆద్మీకి చెందిన ఎమ్మెల్యేలను జైళ్లలో పెట్టించిన మోదీ.. ఇంత పెద్ద స్కాం విషయంలో మౌనంగా ఉండటం ఆయన చేతగాని తనానికి నిదర్శనం. ఎమ్మెల్యే సోమ్ నాథ్ భారతి, భార్యతో తగువులాడాడని ఐదురోజులు కటకటాల్లోకి నెట్టారు. ఏం.. భార్యా భర్తలు కీచులాడుకోరా? రేప్ ఘటనపై ఆందోళన చేసిన మరో ఎమ్మెల్యేని నాలుగు రోజులు బొక్కలో వేశారు. లంచంపై పోరాడిన ఓ ఆర్మీ ఆఫీసర్ ను రెండు రోజులు స్టేషన్ లో ఉంచారు. అయ్యా మోదీ గారు.. మీ ప్రతాపం చిన్నవాళ్లపైనేనా? పెద్దవాళ్ల జోలికి వెళ్లరా? లేక కాంగ్రెస్ వాళ్లతో పెట్టుకుంటే మీ కూసాలు కూడా కదలిపోతాయని భయమా?' అంటూ అగస్టా స్కాంలో సోనియాపై చర్యలకు వెనకాడుతున్న ప్రభుత్వం తీరును కేజ్రీవాల్ ఎండగట్టారు. హరియాణా, రాజస్థాన్ లలో సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రా పెద్ద ఎత్తున భూములు కొన్నారని ఆరోపణలున్నాయని, ఆ రెండు రాష్ట్రాల్లో ఇప్పుడు బీజేపీనే అధికారంలో ఉందని, అలాంటప్పుడు వాద్రాపై ఎంక్వైరీ ఎందుకు వేయడంలేదని అరవింద్ ప్రశ్నించారు.