మీ టేప్ రికార్డ్ కాదు.. ట్రాక్ రికార్డ్ కావాలి
- కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన మోడీ
- కన్నడలో ఉగాది శుభాకాంక్షలు చెబుతూ ప్రసంగం ప్రారంభం
- కాంగ్రెస్‌కు ఓటు బ్యాంకు గురించే తప్ప ప్రజా సంక్షేమం పట్టదంటూ విమర్శ
సాక్షి, బెంగళూరు : అరవై ఏళ్లుగా ఇచ్చిన హామీలనే మళ్లీ మళ్లీ టేప్ రికార్డులా కాంగ్రెస్ పార్టీ వినిపిస్తూ మోసం చేస్తోందని గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ విమర్శించారు. ప్రస్తుతం ప్రజలకు కావాల్సింది ఆ టేప్ రికార్డ్ కాదని, కాంగ్రెస్ పార్టీ ట్రాక్ రికార్డ్ అని విరుచుకుపడ్డారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బిజాపుర, బెల్గాంలో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు.
ఈ రెండు సభల్లోనూ ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ ‘ఉగాది హబ్బద శుభాశయగలు’(ఉగాది పండుగ శుభాకాంక్షలు) అంటూ కన్నడలో మాట్లాడిన అనంతరం తన ప్రసంగాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు కేవలం హామీలివ్వడానికే పరిమితమైందని విమర్శించారు. ఓటు బ్యాంకు రాజకీయాల గురించే తప్ప.. ప్రజా సంక్షేమం గురించి ఆలోచించే సమయం కాంగ్రెస్ నేతలకు లేదని మండిపడ్డారు. దేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న యువతకు ఉద్యోగాలు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు.
ప్రపంచ దేశాలన్నీ యువతలో నైపుణ్యాలు పెంపొందించేందుకు ప్రాధాన్యం ఇస్తుంటే యూపీఏ ప్రభుత్వం మాత్రం నైపుణ్యాల పెంపు అంశంలో చిట్టచివరి స్థానంలో నిలబడి ఉందని ధ్వజమెత్తారు. ‘దేశంలోని యువత మిమ్మల్నేమీ మెర్సిడిస్ కావాలని, బంగ్లాలు కట్టించి ఇవ్వండనీ అడగడం లేదు. కడుపు నింపుకునేందుకు ఒక పని ఇవ్వమని అడుగుతున్నారు. మా చెమట చిందించి నవ భారతాన్ని నిర్మించేందుకు ఒక అవకాశం ఇవ్వమని అడుగుతున్నారు’ అని మోడీ పేర్కొన్నారు.
అవినీతి నిర్మూలన అసాధ్యం అని చాలా మంది అంటున్నారని, అయితే తనకో అవకాశం ఇస్తే అవినీతిని ఎలా నిర్మూలించవచ్చో చేసి చూపుతానని మోడీ పేర్కొన్నారు. అవినీతిని నిర్మూలించడంలో భాగంగానే గుజరాత్‌లో అధ్యాపకుల నియామకాలను పూర్తిగా ఆన్‌లైన్‌లో నిర్వహించామని వెల్లడించారు.
ఉద్యోగాల కల్పనలో ‘హ్యూమన్ ఇంటర్‌ఫియరెన్స్’ను లేకుండా చేయగలిగితే దేశంలో అవినీతిని దాదాపుగా నిరోధించవచ్చని మోడీ అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని 3-డీ(డెమోగ్రాఫిక్ డివెడెన్సీ, డెమోక్రసీ, డిమాండ్) ఒక్క భారత్‌లోనే ఉన్నాయని తెలిపారు. యూపీఏ విధానాల కారణంగా రైతులంతా కష్టాల్లో కూరుకుపోతున్నారని, పంటకు మద్దతు ధరలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎండవేడిమికి సభికుల ఇబ్బంది ...
నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం బిజాపురలో మోడీ బహిరంగ సభ మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే సభా ప్రాంగణానికి మోడీ గంటన్నర ఆలస్యంగా చేరుకున్నారు. ఇక బిజాపురలో శనివారం 38.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. సభకు వచ్చిన ప్రజలు కూర్చునేందుకు కుర్చీలు వేసిన పార్టీ వర్గాలు.. ఎండవే డిమిని తట్టుకునేందుకు పరదాలను ఏర్పాటు చేయలేదు. దీంతో ఎండ వేడిమిని తట్టుకోలేక సభకు వచ్చిన ప్రజలు, సెక్యూరిటీగా వచ్చిన పోలీసు సిబ్బంది ఇబ్బందులు పడ్డారు.