నోట్లు రాలుతున్నాయి - కానీ ఓట్లు రాలతాయా?
బెంగుళూరులో ఆమ్ ఆద్మీ నేత అరవింద్ కేజరీవాల్ అద్భుత విందు అంతంత మాత్రంగా సాగింది. విందుకు తక్కువ మందే హాజరయ్యారు. అయితే వచ్చినవారంతా పెద్ద మొత్తాలు చెల్లించడంతో దాదాపు నలభై లక్షలరూపాయలు వసూలయ్యాయి. వోట్లెన్ని రాలతాయో తెలియదు కానీ నోట్లు మాత్రం బాగానే రాలాయి.
విందుకు హాజరైన వాళ్లు కూడా అరవింద్ కేజరీవాల్ ను ఢిల్లీ సీఎం పదవి ఎందుకు వదిలారో వివరించమని ప్రశ్నించారు. ఆయన వేరే విషయాలు చెప్పడానికి ప్రయత్నించినా విందుకు హాజరైనవారు ఈ ప్రశ్ననే పదే పదే అడిగారు. ఆయన జనలోక్ పాల్ కోసం పదవి వదులుకున్నానని చెప్పగా, సభికులు మాత్రం యుద్ధభూమి నుంచి పారిపోయిన సైనికుడిలా మిగిలే కన్నా అయిదేళ్లూ ఢీల్లీ సీఎంగా పనిచేసి చూపించి ఉండాల్సిందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
హాజరైనవారిలో చాలా మంది ఆయన బెంగుళూరుకు ఏం చేస్తారని ప్రశ్నించారు. ఆయన ఇచ్చిన జవాబులతో కొందరు నిరాశ చెందారు. 'కేజరీవాల్ దృష్టి అంతా ఢిల్లీ మీదే ఉంది. ఆయన ఆలోచనలన్నీ ఢిల్లీ వరకే వర్తిస్తాయి. బెంగుళూరుకు ఆయన మందులు పనిచేస్తాయో లేదో తెలియడం లేదు' అని విందుకు హాజరైన ఒక ప్రముఖుడు అన్నారు. ఇంకొందరు నరేంద్ర మోదీపై వారాణాసి లో ఎంపీ సీటుకు పోటీచేస్తారా అని ప్రశ్నించారు. మోదీ ఎక్కడ పోటీచేసినా, ఆయనపై తాను పోటీ చేస్తానని ఇదివరకే కేజరీవాల్ ప్రకటించారు. మోదీ వారణాసి నుంచి పోటీ చేయడం ఖాయమైపోయింది కాబట్టి కేజరీవాల్ సంగతేమిటని చాలా మంది అడిగారు. కేజరీవాల్ మాత్రం తక్షణం ఎలాంటి జవాబూ ఇవ్వలేదు. పార్టీలో చర్చించి చెబుతామని ఆయన జవాబిచ్చారు.
వచ్చిన వారిలో చాలా మంది ఇన్ఫోసిస్ మాజీ ఉన్నతోద్యోగి వి బాలకృష్ణన్ సన్నిహితులే. ఆయనకు ఐటీ రంగంలో ఉన్న పలుకుబడి వల్ల వారంతా హాజరయ్యారు.
హాజరైన వారందరికీ ఆమ్ ఆద్మీ పార్టీ వెజ్, నాన్ వెజ్ మెనూను అందించింది. మామూలుగా రాజకీయ పార్టీల బహిరంగ కార్యక్రమాల్లో వెజ్ భోజనమే ఎక్కువగా ఉంటుంది. కానీ ఆప్ మాత్రం నాన్ వెజ్ ను నిస్సంకోచంగా వడ్డించింది.
అంతకు ముందు కేజరీవాల్ బెంగుళూరులో రోడ్ షో నిర్వహించారు. కేజరీవాల్ ను చూసేందుకు పలు చోట్ల ప్రజలు గుమికూడారు. అయితే ముంబాయిలో లాగా తొక్కిసలాటలు జరగకపోవడం విశేషం.