= ఉనికి చాటుకునేందుకు వ్యూహాలు
= అదనపు భద్రతకు పోలీసుల చర్యలు
సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలో తమ ఉనికిని చాటుకునేందుకు మావోయిస్ట్‌లు తహతహలాడుతున్నారు. ఇందుకోసం రానున్న లోక్‌సభ ఎన్నికలను వినియోగించుకోవడానికి వ్యూహాలు సిద్ధం చేసుకున్నట్లు రాష్ట్ర హోంశాఖకు సమాచారం అందింది. దీంతో మావోల వ్యూహాలకు చెక్‌పెట్టేందుకు అనుసరించాల్సిన విధివిధానాల తయారీలో పోలీసు ఉన్నతాధికారులు తలములకలై ఉన్నారు.
రాష్ట్రంలో చాలా కాలంగా మావోయిస్టుల కార్యాకలాపాలు స్తబ్దుగా ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో సముద్రతీర, అటవీప్రాంతం ఎక్కువగా ఉన్న మలెనాడు, కరావళి ప్రాంతాల్లో అడపాదడపా మావోయిస్టు కార్యకలాపాలు బయటికి వస్తున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో మావోయిస్టుల కార్యకాలాపాలు దాదాపుగా లేవనే చెప్పవచ్చు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే తమ ఉనికిని కోల్పోవలసి వస్తుందని మావోయిస్టు నాయకులు భావిస్తున్నారు.
దీంతో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా రాష్ట్రానికి చెందిన అగ్రనాయకులు నిర్వహించే ప్రచార సభలు, ర్యాలీలపై మెరుపు దాడులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థ నుంచి రాష్ట్ర హోం శాఖకు సమాచారం అందింది. ముఖ్యంగా మైసూరు, ఉడిపి-చిక్కమగళూరు, దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ, శివమొగ్గ జిల్లాల్లో జరిగే రాజకీయ ప్రచార కార్యక్రమలపై దాడులు నిర్వహించాలనేది మావోయిస్టుల వ్యూహంగా కనిపిస్తోంది. ఇక వీరి హిట్‌లిస్ట్‌లో మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పతోపాటు బీజేపీ నాయకులు సీటీ రవి, నలిన్‌కుమార్ కటిల్, జీవరాజ్, ప్రస్తుత ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్వీ దేశ్‌పాండే తదితర నాయకులు ఉన్నట్లు సమాచారం.
భద్రత రెట్టింపు
మావోయిస్టుల దాడులను సమర్థంగా ఎదుర్కొనేందుకు హిట్‌లిస్ట్‌లో ఉన్న నాయకులందరికీ కల్పించే భద్రతను కట్టుదిట్టం చేయాలని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం కల్పిస్తున్న వ్యక్తిగత భద్రత సిబ్బందిని రెట్టింపు చేయడమే కాకుండా ప్రతి ఒక్కరికి ఏకే- 47 సమర్చే ఆలోచనలో పోలీసుబాసులు ఉన్నారు. తద్వారా మావోయిస్టులు దాడికి పాల్పడితే వారిని సమర్థంగా ఎదుర్కొనడానికి వీలవుతుందనేది హోంశాఖ భావన. అయితే ఇందుకు కేంద్రం నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది.
ప్రస్తుతం రాష్ట్రానికి చెందిన చాలా మంది రాజకీయనాయకుల వ్యక్తిగత భద్రతా సిబ్బంది పిస్టల్, కార్బైన్, ఎస్.ఎల్.ఆర్ తదితర ఆయుధాలను వినియోగిస్తున్నారు. అంతేకాకుండా మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న చోట నిర్వహించే ఏ ఎన్నికల ప్రచారానికైనా రెండు నుంచి మూడు రోజుల ముందు డీజీపీ కార్యాలయం అనుమతి తీసుకోవడమే కాకుండా ప్రచారానికి సంబంధించిన రూట్‌మ్యాప్‌ను పోలీసులకు అందించేలా ఆదేశాలు జారీ చేసే ఆలోచనలో పోలీసులు ఉన్నట్లు విశ్వసనీయ వ ర్గాల సమాచారం.
మావోల హిట్ లిస్ట్‌లో యడ్డి
Published Fri, Mar 14 2014 3:23 AM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM
Advertisement