మావోయిస్టులపై ఉక్కుపాదం
- గంజాయి రవాణా నిరోధంపై దృష్టి
- రోడ్డు ప్రమాదాల నివారణకు కార్యాచరణ
- కొత్త ఎస్పీ డాక్టర్ కోయ ప్రవీణ్
విశాఖపట్నం: జిల్లాలో మావోయిస్టు కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరిస్తామని కొత్త ఎస్పీ డాక్టర్ కోయ ప్రవీణ్ హెచ్చరించారు. జిల్లా కొత్త ఎస్పీగా ఆయన సోమవారం ఆయన ప్రస్తుత ఎస్పీ విక్రమ్ జిత్ దుగ్గల్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు దుగ్గల్ పుష్పగుచ్ఛం అందజేసి అభినందించారు. అనంతరం కొత్త ఎస్పీ ప్రవీణ్ మాట్లాడుతూ గత ఎస్పీ దుగ్గల్ జిల్లాలో శాంతి భద్రతల్ని పరిరక్షించి, మావోయిస్టుల కార్యక్రమాలపై పట్టు సాధించారని ప్రశంసించారు.
తాను కూడా అవే విధానాలను కొనసాగిస్తానని తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం మావోయిస్టులు స్తబ్దుగా ఉన్నారని చెప్పారు. వారు చేసే విధ్వంసాలను అడ్డుకునేందుకు జిల్లా పోలీసులు సన్నద్ధంగా ఉన్నారన్నారు. గంజాయి రవాణా నిరోధానికి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రయివేటు భాగస్వామ్యంతో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తామన్నారు.
ఈ సందర్భంగా జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) డి.ఎన్.కిషోర్, జిల్లా అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) ఎ.ఆర్.దామోదర్, నర్సీపట్నం ఏఎస్పీ విశాల్ గున్ని, పాడేరు ఏఎస్పీ ఎ.బాబూజి, చింతపల్లి సబ్ డివిజన్ ఆఫీసర్ ఇ.జి.అశోక్‌కుమార్. అనకాపల్లి సబ్ డివిజన్ ఆఫీసర్ వి.ఎస్.ఆర్.మూర్తి, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ ఎస్.కిరణ్‌కుమార్ ఎస్పీని కలసి అభినందనలు తెలిపారు.