జీవితంలో సేవ భాగం కావాలి
►జీవితంలో సేవ భాగం కావాలి
గోదావరిఖని(రామగుండం): సేవచేయడం, సేవాదృక్పథాన్ని అలవర్చుకోవడం మనిషి జీవితంలో భాగం కావాలని రామగుండం పోలీస్ కమిషనర్ విక్రమ్‌జిత్ దుగ్గల్ ఆకాంక్షించారు. గోదావరిఖని విద్యానగర్–2లోని ఆదరణ నిస్సహాయ పిల్లల ఆశ్రమంలో దీనబంధు స్వచ్ఛంద సేవాసంస్థ ఆధ్వర్యంలో ఐదునుంచి 10ఏళ్ల లోపు వయస్సున్న 12మంది ఆడ పిల్లలకు గురువారం కర్ణవేదన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పోలీస్ కమిషనర్ విక్రమ్‌జిత్ దుగ్గల్ పాల్గొని.. మేనమామ స్థానంలో కూర్చుని ఈ కార్యక్రమం జరిపించారు. అనంతరం మాట్లాడుతూ నిస్సహాయ ఆడ పిల్లలకు చెవులు కుట్టించేందుకు దీనబంధు స్వచ్ఛంద సేవా సంస్థ ముందుకు వచ్చి కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు.
సేవాగుణంతో వచ్చే మార్పు సామాజిక ప్రగతికి దోహదపడుతుందని పేర్కొన్నారు. ఆపదలో ఉన్న వారికి చేయూతనివ్వాలని, పేదవారికి అండగా నిలవాలని సూచించారు. ఆదుకునే చేతులుంటే ఆదరణ కోల్పోయే పిల్లలుండరని, నిస్సహాయ పిల్లలకు సాయం చేసి ఆదుకోవాలని కోరారు. రామగుండం కమిషనరేట్ పరిధిలోని అనాథలు, వికలాంగులు, ఇతర నిస్సహాయ పిల్లలకు సాయం చేసేందుకు ‘పునరావాసం’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దీనిద్వారా కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్స్టేషన్లలో పనిచేసే హోంగార్డు నుంచి కమిషనర్ వరకు వారి వేతనాల నుంచి ప్రతీనెల కొంత డబ్బు రికవరీ చేసి పిల్లల కనీస అవసరాలకు, విద్యుత్ బిల్లులు, వాటర్ బిల్లు, ఫ్యాన్, కూలర్లు, నోట్‌పుస్తకాలు, స్కూల్ బ్యాగ్‌లు ఇలా వారికి ఉపయోగపడేలా ఖర్చు చేస్తున్నామని చెప్పారు.
ఇందులో భాగంగా ఆదరణ నిస్సహాయ ఆశ్రమంలో సేదతీరుతున్న పిల్లల కోసం రూ.10వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు.పిల్లలు చెడు అలవాట్లకు లోనుకాకుండా మంచి ప్రవర్తన కలిగేలా తీర్చిదిద్దాలని, భవిష్యత్తులో ఉన్నత స్థానాలను అధిరోహించి ఆదర్శంగా నిలవాలని సూచించారు. దీనబంధు స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు ఎండీ.రహ్మత్పాష, కార్యదర్శి మద్దెల దినేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి, సీఐలు జి.కృష్ణ, సీహెచ్. వెంకటేశ్వర్లు, కార్పొరేటర్లు జాలి రాజమణి, మహంకాలి స్వామి, చందుయాదవ్, వివేక్, నాయకులు పెద్దంపేట శంకర్, గోపు అయిలయ్యయాదవ్, అందె సదానందం, అబ్బోజు రాంబాబు, కనకరాజు, తాండ్ర సదానందం, గోసిక మోహన్, ఆశ్రమ నిర్వాహకులు లక్ష్మి, శ్రీనివాస్, ఆర్చన, కృష్ణ పాల్గొన్నారు