బెంగళూరు : లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ శనివారం ఢిల్లీలో విడుదల చేసింది. 20 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మరో ఎనిమిది స్థానాలకు ప్రకటించాల్సి ఉంది.
తొలి జాబితాలో మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప (శివమొగ్గ)కు చోటు లభించింది. ప్రస్తుత ఎంపీలు డీబీ. చంద్రే గౌడ (బెంగళూరు ఉత్తర), సన్న ఫకీరప్ప (రాయచూరు), శివరామే గౌడ (కొప్పళ)లకు తిరిగి అభ్యర్థిత్వాలను నిరాకరించింది. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర శాఖ సిఫార్సు చేసిన 20 మందికీ ఆమోదం లభించింది.
పార్టీ సీనియర్ నాయకులు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు, అనంత కుమార్, పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప, జగదీశ్ శెట్టర్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తావర్‌చంద్ గెహ్లాట్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.