- శివమొగ్గ నుంచి యడ్డి పోటీ
- మద్దతుదారుల ఒత్తిడితో అంగీకారం
- అయినా.. పార్టీ నిర్ణయమే అంతిమమని వెల్లడి
- జేడీఎస్ అభ్యర్థిగా బరిలో గీత శివరాజ్ కుమార్
- బంగారప్పపై సానుభూతితో విజయం సాధిస్తుందని ధీమా
- ‘రాజ్ కుమార్’ అభిమానుల ఓట్లకూ గాలం వేసేలా ఎత్తు
శివమొగ్గ, న్యూస్‌లైన్ : వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో శివమొగ్గ నియోజక వర్గం నుంచి పోటీ చేయాలని మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప నిర్ణయించారు. ఇటీవలే కేజేపీ నుంచి బీజేపీలో తిరిగి చేరిన ఆయన లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని తొలుత అనుకున్నారు. కానీ పార్టీతో పాటు మద్దతుదారుల నుంచి ఒత్తిడి పెరగడంతో పోటీ చేయాలని నిర్ణయించారు. స్థానిక వినోభా నగర లేఔట్‌లోని తన నివాసంలో మంగళవారం రాత్రి ఆయన తనకు ఆప్తులైన మద్దతుదారులతో సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో ఆయన కుమారుడు, ఎంపీ రాఘవేంద్రతో పాటు పార్టీ నాయకులు, మహా నగర పాలికె సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో పోటీ చేసే విషయమై ఆయన వారి అభిప్రాయాలను సేకరించారు. సమావేశంలో పాల్గొన్న వారంతా పోటీ చేయాల్సిందిగా ఒత్తిడి తెచ్చారు. తాను వద్దనుకున్నట్లయితే రాఘవేంద్రను నిలపాలని, లేనట్లయితే బీజేపీ గెలుపు అసాధ్యమని వారు తేల్చి చెప్పారు. దీంతో యడ్యూరప్ప పోటీ చేయడానికి సుముఖత వ్యక్తం చేస్తూ, వెంటనే ఇంటింటికీ వెళ్లి ప్రచారం ప్రారంభించాల్సిందిగా సూచించారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ప్రధానిని చేయడానికి అందరూ సమైక్యంగా ముందుకు సాగాలని కోరారు. ఏదేమైనా తన అభ్యర్థిత్వం విషయంలో పార్టీ నిర్ణయమే అంతిమమని చెప్పారు. రాఘవేంద్ర కూడా తన తండ్రి నిర్ణయానికి మద్దతు పలికారు.
జేడీఎస్ అభ్యర్థి గీత శివరాజ్‌కుమార్
శివమొగ్గ నియోజక వర్గం నుంచి తమ పార్టీ అభ్యర్థిగా సినీ నటుడు శివ రాజ్ కుమార్ సతీమణి గీతను పోటీ చేయించాలని జేడీఎస్ నిర్ణయించింది. బీజేపీ అభ్యర్థి యడ్యూరప్పను ఎదుర్కోవడానికి దివంగత మాజీ ముఖ్యమంత్రి బంగారప్ప కుమార్తె అయిన గీత సరైన అభ్యర్థి అని పార్టీ భావించింది. కన్నడ నట దిగ్గజం దివంగత రాజ్ కుమార్ కుటుంబం నుంచి ఇప్పటి వరకు ఎవరూ రాజకీయాల్లోకి రాలేదు. గత శాసన సభ ఎన్నికల్లో గీత సోదరుడైన మధు బంగారప్ప సొరబ నుంచి విజయం సాధించారు. దీనికి తోడు భద్రావతి, శివమొగ్గ గ్రామీణ నియోజక వర్గాల్లో జేడీఎస్ అభ్యర్థులు గెలుపొందారు. యడ్యూరప్పపై గెలవాలంటే బలమైన అభ్యర్థి అవసరమని జేడీఎస్ గీత అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు తెలిసింది. జిల్లాలో బంగారప్పపై ఉన్న సానుభూతి తమకు కలసి వస్తుందని ఆ పార్టీ భావిస్తోంది.