
సాక్షి, హైదరాబాద్: ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి దెబ్బతిన్న రాష్ట్ర బీజేపీ ఈసారి సర్వశక్తుల్ని ఒడ్డి లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతోంది. అందులో భాగంగా ఫిబ్రవరి నుంచి వరుస కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. పార్టీ జాతీయ నాయకులు, కేంద్రమంత్రులు రాష్ట్రంలో పర్యటించి పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపేలా కార్యక్రమాలను ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని శక్తి కేంద్రాల ఇన్‌చార్జ్ లు, ఆపై స్థాయి నేతలతో ఫిబ్రవరి 2న సమావేశాలు నిర్వహించనుంది. ఈ సమావేశాల్లో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పాల్గొని సమీక్షించనున్నారు.
నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని శక్తి కేంద్రాల ఇన్‌చార్జ్‌లు, ఆ పైస్థాయి నేతలతో ఫిబ్రవరి 5న నిజామాబాద్‌లో నిర్వహించే సమావేశాలకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ పాల్గొననున్నారు. ఫిబ్రవరి 7న మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, చేవెళ్ల నియోజకవర్గాల సమావేశాలను మహబూబ్‌నగర్‌లో నిర్వహించనుండగా..ఆ సమావేశాలకు కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమర్ హాజరుకానున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. వచ్చేనెల 10న హైదరాబాద్‌లో జాతీయ మహిళా సదస్సును, మార్చి 2న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలను నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. మరోవైపు ఫిబ్రవరిలోనే కేంద్ర ప్రభుత్వ లబ్ధిదారుల ఇంటి ముందు దీపం వెలిగించే ‘కమల్ జ్యోతి’ కార్యక్రమంతో పాటుగా ‘అప్నా పరివార్..బీజేపీ పరివార్’నినాదంతో ప్రతి బీజేపీ కార్యకర్త, పార్టీ సానుభూతిపరుల ఇళ్లపై పార్టీ జెండా ఎగురవేసే కార్యక్రమాలను కూడా చేపట్టనున్నారు.