పొద్దుటో పార్టీ.. సాయంత్రానికి మరో గూటికి..  | Party Changes in Politics Special Story Lok Sabha Election | Sakshi
Sakshi News home page

రాజకీయ రంగుల కేళీ..

Published Wed, Mar 20 2019 8:46 AM | Last Updated on Fri, Mar 22 2019 6:16 PM

Party Changes in Politics Special Story Lok Sabha Election - Sakshi

పొద్దున్న ఒక పార్టీ.. పొద్దుగూకే వేళకి మరో పార్టీ.. గాలి ఏ పార్టీ వైపు వీస్తే అటువైపే వీరి చూపు.. ఏ పార్టీకా గొడుగు.. టికెట్‌ రాలేదా.. వెంటనే గోడ దూకుడే.. అక్కడా ఇక్కడా అని కాదు.. దేశంలో ఎక్కడ చూసినా రాజకీయ నాయకుల నయా ట్రెండ్‌ ఇదే! ఈ రోజుల్లో ఫలానా పార్టీ నాయకుడు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారంటే చటుక్కున జవాబు చెప్పడం చాలా కష్టంగా మారింది.పార్టీలు మారే సంస్కృతి ఎప్పుడు మొదలైంది?

ఆయారాం గయారాం అంటే తెలుసు కదా. హిందీలోని ఈ పదానికి తెలుగు అర్థం చెప్పాలంటే ఆయనొచ్చారు. ఆయన వెళ్లిపోయారు. ఈ పదం ఈ నాటిది కాదు. 1967లో హర్యానాకు చెందిన గయా లాల్‌ ఒకే రోజు మూడు పార్టీలు మారడంతో ఈ పదం బాగా జనం నోళ్లలో నానింది. గయాలాల్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి యునైటెడ్‌ ఫ్రంట్‌కు వెళ్లారు. మళ్లీ గోడకు కొట్టిన బంతిలా తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. మళ్లీ ఆయన మనసు మారిపోయింది. తిరిగి సాయంత్రానికల్లా యునైటెడ్‌ ఫ్రంట్‌లో చేరారు. అప్పట్నుంచి ఇలా పార్టీలు మారే వారిని ఆయారాం గయారాం అని పిలవడం మొదలైంది.

రాజకీయం ఫక్తు వ్యాపారం
ఎన్నికలకు ముందే ఏ పార్టీ గెలుస్తోందన్న అంచనాలు వేసుకొని పార్టీలు మారేవారు ఒక రకమైతే, ఒక పార్టీ గుర్తుతో గెలిచి అధికార పార్టీకి జంప్‌ చేసే వాళ్లు మరో రకం. జాతీయ పార్టీల ప్రాభవం తగ్గి, ప్రాంతీయ పార్టీలు పుట్టుకురావడం మొదలై, సంకీర్ణ ప్రభుత్వాల యుగం ప్రారంభమయ్యాక  ఫిరాయింపుల సంస్కృతి మరింత ఊపందుకుంది.

కింగ్‌ మేకర్లదే రాజ్యం
ఇవాళ రేపు రాజకీయాల్లో ఎవరూ కింగ్‌లు కానక్కర్లేదు. కింగ్‌ మేకర్లయినా చాలు చక్రం తిప్పేయొచ్చు. గత ఏడాది జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 104 స్థానాలతో అత్యధిక సీట్లు సాధించిన పార్టీగా అవతరించింది. మేజిక్‌ ఫిగర్‌కు ఏడు స్థానాల దూరంలో ఉండిపోయింది. బీఎస్‌ యడ్యూరప్ప సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను లాగడానికి చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. చివరికి అసెంబ్లీలో బలనిరూపణకు ముందే రాజీనామా చేశారు. కేవలం 37 స్థానాల్లో గెలిచిన జేడీ(ఎస్‌) అధ్యక్షుడు కుమారస్వామి కాంగ్రెస్‌ మద్దతుతో సీఎంగా కొనసాగడమంటే ఇదెక్కడి ప్రజాస్వామ్యం అన్న విమర్శలు వెల్లువెత్తాయి. అదే విధంగా గోవా, మణిపూర్‌ రాష్ట్రాల్లో అతి తక్కువ సీట్లు వచ్చిన బీజేపీ వేసిన గాలానికి ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యేలు చిక్కడంతో ఆ పార్టీ అధికారంలో కొనసాగుతోంది.

ఫిరాయింపుల నిరోధక చట్టం ఏం చెబుతోంది?
అన్ని పార్టీలూ ఫిరాయింపులతో లాభపడ్డవే. అందుకే ఫిరాయింపుల్ని రద్దు చేయాలంటే ఏ పార్టీ ముందుకు రాలేదు. చివరికి అన్నివైపుల నుంచి ఒత్తిళ్లుపెరగడంతో  1985లో అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ హయాంలో ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకువచ్చారు. 52వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ చట్టాన్ని 10వ షెడ్యూల్‌లో చేర్చారు. ఫిరాయింపుల నిరోధక చట్టం కూడా మొక్కుబడి కార్యక్రమంగా మారింది. ఫిరాయుంపులను అడ్డుకోలేకపోయింది.

చట్టం ఉన్నా లేనట్టే...
ఒంటిపై కండువా మార్చినంత వేగంగా పార్టీ కండువాలు మార్చేయడానికి చట్టంలో ఉన్న లొసుగులే కారణం. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేపై, ఎంపీపై అనర్హత వేటు నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకరే. స్పీకర్‌ నిర్దిష్ట కాలపరిమితిలోనే ఫిరాయింపుదార్లపై నిర్ణయం తీసుకోవాలన్న నిబంధనలు కూడా లేవు. సర్వసాధారణంగా స్పీకర్‌ అధికార పార్టీకి చెందినవాడే కావడంతో వాళ్లు ఆడింది ఆట పాడింది పాట. ప్రజాప్రతినిధులపై అనర్హత వేటు విషయంలో కావాలనే కాలయాపన జరుగుతుంటుంది. అలా అయిదేళ్లు నెగ్గుకొస్తే  పుణ్యకాలం కాస్తా గడిచిపోతుంది. ఇలా ప్రతిపక్షం నుంచి అధికారపక్షంలో చేరి దర్జాగా మంత్రి పదవులు అనుభవించిన వారూ లేకపోలేదు. దీనిపై సుప్రీంకోర్టు కేవలం స్పీకర్‌ నిర్ణయాన్ని సమీక్షించగలదే తప్ప, దానికి వ్యతిరేకంగా ఏమీ చేయలేదు కాబట్టి ఈ చట్టం ఉన్నా లేనట్టేనన్న అభిప్రాయానికి బలం చేకూరుతోంది.  

ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఎన్నికైన ప్రజాప్రతినిధిపై అనర్హత వేటు ఎప్పుడు వేయవచ్చు?
1. ఒక ప్రజాప్రతినిధి తాను గెలిచిన పార్టీకి రాజీనామా చేసినప్పుడు.
2. స్వతంత్ర అభ్యర్థి మరో పార్టీకి మారినప్పుడు.
3. చట్ట సభల్లో ఏదైనా అంశంపై పార్టీ విప్‌ను ధిక్కరించి వ్యతిరేకంగా ఓటు వేసినా, లేదంటే ముందస్తు అనుమతి లేకుండా ఓటింగ్‌కి దూరంగా ఉన్నా.
ఏదైనా పార్టీకి చెందిన మూడింట రెండు వంతుల మంది ఎమ్మెల్యేలు ఒకేసారి మరో పార్టీలోకి ఫిరాయిస్తే దానికి చట్టబద్ధత ఉంటుంది. అప్పుడు అది విలీనం అవుతుంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే లేదా ఎంపీపై అనర్హత వేటు వేసే అధికారం స్పీకర్‌కి వుంటుంది.

బీజేపీ గాలి వీస్తోందని..
కేరళ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, సోనియాగాంధీకి వీరవిధేయుడు, 20 ఏళ్లుగా కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న టామ్‌ వడక్కన్‌ రాత్రికి రాత్రి కమలం కండువా కప్పుకున్నారు. కారణమేమిటని ప్రశ్నిస్తే బాలాకోట్‌ దాడుల విషయంలో కాంగ్రెస్‌ స్పందన బాగాలేదన్నాడట.
ఆ మర్నాడే కాంగ్రెస్‌లో కీలక నేత శశిథరూర్‌ చిన్నమ్మ శోభన, ఆమె భర్త శశికుమార్‌ అదే బాట పట్టారు.
పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అర్జున్‌ సింగ్‌కు ఎంపీ టికెట్‌ ఇవ్వడానికి దీదీ నిరాకరించడంతో తెగతెంపులు చేసుకున్నారు. బీజేపీలో చేరిపోయారు.
ఇక ఒడిశాలో బీజేడీ సిట్టింగ్‌ ఎంపీ నవరంగపూర్‌ బలభద్రి మాఝీ పార్టీ తనను నిర్లక్ష్యం చేస్తోందన్న ఆరోపణలతో పార్టీ ఫిరాయించి, బీజేపీ కండువా కప్పేసుకున్నారు. మరో బీజేడీ ఎమ్మెల్యే సుకాంత నాయక్‌ కూడా పార్టీకి రాజీనామా చేశారు. త్వరలో బీజేపీలో చేరనున్నారు.
యూపీలో ఎస్పీ, బీఎస్పీ మధ్య పొత్తు పొడిచి ఎస్పీ 37, బీఎస్పీ 38 స్థానాల్లో పోటీ చేస్తుండటంతో చాలామంది ఆశావహులకు టికెట్‌ దక్కే పరిస్థితి లేదు. దీంతో వారంతా కమలం గూటికి క్యూ కట్టేస్తున్నారు. గత నెల రోజుల్లోనే ఏకంగా 28 మంది నేతలు బీజేపీలో చేరారు. బాలాకోట్‌ దాడుల తర్వాత బీజేపీ గాలి వీస్తోందని అంచనాలు పెరిగిపోవడంతో కమలం గూట్లో చేరడానికి నేతలు ఆరాటపడుతున్నారు. గత ఎన్నికల్లో నరేంద్ర మోదీపై బీఎస్పీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన విజయ్‌ ప్రకాశ్‌ జైస్వాల్‌ ఇప్పుడు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. గత ఎన్నికల సభల్లో మోదీని తీవ్రంగా విమర్శించిన ఆయన ఇప్పుడు మోదీ విధానాలు నచ్చే పార్టీలో చేరానని చెప్పుకుంటున్నారు.
గుజరాత్‌లో కూడా అదే సీన్‌. కాంగ్రెస్‌ నుంచి గత ఏడాదిలో అయిదుగురు ఎమ్మెల్యేలు బీజేపీ గూటికి చేరారు. వీరిలో  ధర్మేంద్రసింగ్‌ జడేజా, జవహర్‌ చావ్దా కేబినెట్‌లో మంత్రి పదవులు దక్కించుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement