సాక్షి, రాజమండ్రి : కాంగ్రెస్ శ్రేణులను నిరాశానిస్పృహలు అలముకున్నా యి. ‘పండగపూటా.. ముగ్గుకు నోచని వాకిలి’లా.. ఎన్నికల వేళా వారిలో స్తబ్దత తాండవిస్తోంది. పేరుకు జాతీయ పార్టీ అయినా.. ఏ వాడకు వెళ్లినా పన్నెత్తి పలకరించే వారే కరువయ్యారు. రాష్ట్ర విభజనకు ఒడిగట్టిన కాంగ్రెస్ అధిష్టానంపై జనంలో రగులుతున్న ఆగ్రహం ఆ పార్టీ స్థానిక నేతలను రోహిణీ కార్తెలో ఎండలా దహిస్తోంది.
‘ఇలాంటి పరిస్థితి పగవారికి సైతం వద్దురా బాబూ!’ అనుకునేంతగా ఆ పార్టీ శ్రేణులు నిర్వేదం చెందుతున్నారు. గత ఎన్నికలప్పుడు ఇదే నెలలో ప్రతి కార్యకర్తలో రెట్టించిన ఉత్తేజం, దివంగత నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి నాయకత్వంలో ఇనుమడించిన సమరోత్సాహం గుర్తుకు వచ్చి ‘ఇంతలోనే ఎంత మార్పు! నాడు పెళ్లింట్లోలా కోలాహలం.. నేడు పాడె లేచిన కొంపలోలా కమ్ముకున్న వైరాగ్యం!’ అంటూ బరువెక్కిన గుండెలతో నిట్టూరుస్తున్నారు. అనేకులు అసలు ఉందో, లేదోనన్న సందేహం కలిగే స్థితిలో ఉన్న పార్టీకి ఇంకా అంటి పెట్టుకుని ఉండాలా, విడిచిపెట్టి వెళ్లాలా? అన్న మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నారు.
ఏ పార్టీకైనా కార్యకర్తలే ఆయువుపట్టు. పునాదిప్రాయం. విభజన నిర్ణయంతో కాంగ్రెస్ ఆయువుపట్టు కదిలిపోయింది. పునాది కుదుపునకు లోనైంది. తాము చెమటోడ్చి, కష్టిస్తే పదవులను అధిష్టించిన నేతలు జనానికి కల్లబొల్లి కబుర్లు చెప్పి రాష్ట్రాన్ని ముక్కలు చేసి పారేశారని, ఈ పరిణామం అనంతరం ఇక జనంలోకి ఏ ముఖం పెట్టుకుని వెళ్లగలమని కాంగ్రెస్ కార్యకర్తలు తల పట్టుకుంటున్నారు.
జిల్లాలో పలువురు ముఖ్యనేతలు పార్టీని వదిలి, తలో పార్టీ దిక్కుకూ పయనించడం కార్యకర్తలకు జీర్ణం కావడం లేదు. ‘రాష్ట్రాన్ని తుంచింది మీరు. మమ్మల్ని నట్టేట ముంచింది మీరు. పార్టీని మనుగడ కోల్పోయేలా చేసి మీరు మాత్రం మీ రాజకీయ భవిష్యత్తుకు కొత్త ఆలంబనం వెతుక్కుంటున్నారా?’ అంటూ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.
తలోదారీ పడుతున్న ఎమ్మెల్యేలు
జిల్లాలో ఇప్పటికే పదిమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తలోదారి వెతుక్కున్నారు. ఇక అనపర్తి, ముమ్మిడివరం, రాజోలు, రంపచోడవరం, తుని ఎమ్మెల్యేలు నల్లమిల్లి శేషారెడ్డి, పొన్నాడ సతీష్, పాముల రాజేశ్వరీదేవి, కోసూరి కాశీ విశ్వనాథ్, రాజా అశోక్‌బాబుల్లో ఒకరిద్దరు తప్ప మిగిలినవారు కొత్త గూళ్ల కోసం అన్వేషిస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్‌లో మిగిలిన ద్వితీయశ్రేణి నాయకుల పరిస్థితీ అగమ్యగోచరంగా ఉంది. మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నాయకత్వంలోని ‘జై సమైక్యాంధ్ర’ పార్టీ నుంచి ఆహ్వానం అందుతున్నా వెళ్లేందుకు సాహసం చేయలేకపోతున్నారు. అలా చేస్తే తమ ‘చెప్పు’తో తాము కొట్టుకోవడమే అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
రథాలున్నా.. సారథులు లేరు
మరోవైపు.. జై సమైక్యాంధ్ర పార్టీ వాలకం చూస్తే ‘గేదె ను కొనకుండా పలుపుతాడు సిద్ధం చేసిన’ చందంగా ఉంది. ‘ఓటి కుండకు చప్పుడె క్కువ’ అన్నట్టు..ఆ పార్టీ ముందుగానే ప్రచార రథాలు సిద్ధం చేసుకుంది. అయితే ఆ రథాలకు సారథులు లేక ఏం చేయాలో తోచని స్థితిలో చిక్కుకుంది. ఒకరిద్దరు మాత్రమే ఉన్న ఆ పార్టీ నేతలు కాంగ్రెస్ కార్యకర్తలకు, ద్వితీయశ్రేణి నేతలకు గాలం వేసి ‘చెప్పు’ల్లో కాళ్లు దూర్చమని బతిమాలుతున్నారు. కానీ ఎవరూ ముందుకు రాకపోవడంతో రాజమండ్రి జాంపేటలోని జై సమైక్యాంధ్ర పార్టీ కార్యాలయం ముందు ఆ రథాలు సారథుల కోసం ఎదురు చూస్తున్నాయి.