
బీజేపీ మానిఫెస్టోను విడుదల చేస్తున్న బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యురప్ప
బెంగుళూరు : ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో కర్ణాటకలో ప్రధాన పార్టీలు తమ దూకుడు పెంచాయి. ఓటర్లలో ప్రధాన వర్గమైన పేద, మధ్యతరగతి వర్గాల మహిళలను ఆకర్షించడానికి అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. వీరిని ఆకర్షించడమే ధ్యేయంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీజేపీ తన మ్యానిఫెస్టోను విడుదల చేసింది. ఉచితంగా స్మార్ట్‌ఫోన్‌లు, కేవలం 1శాతం వడ్డీతోనే రుణాల మంజూరు, మహిళల భద్రత కోసం ఫ్లయింగ్ స్క్వాడ్ ఏర్పాటు వంటి హమీలతో మహిళా ఓటర్లను ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తున్నది.
తాము అధికారంలోకి వస్తే మహిళల భద్రత కోసం ‘కిట్టూరు రాణి చెన్నమ్మ’ పేరిట ఫ్లయింగ్ స్క్వాడ్‌ను ఏర్పాటు చేస్తామని బీజేపీ తన మ్యానిఫెస్టోలో తెలిపింది. అంతేకాక మహిళల సమస్యలను పరిష్కరించడానికి మహిళా పోలీసు అధికారి అధ్వర్యంలో ‘స్పెషల్ ఇన్వెస్టిగేషన్ సెల్’ను ప్రారంభించి, 1000 మంది మహిళా పోలీసు అధికారులను నియమిస్తామని తెలిపింది. ‘స్త్రీ సువిధ పథకం’ కింద బీపీఎల్ కుంటుంబాల మహిళలకు, ఆడ పిల్లలకు ఉచితంగా, మిగితా స్త్రీలకు కేవలం ఒక్క రూపాయకే సానిటరీ నాప్‌కిన్‌లను అందజేస్తామని ప్రకటించింది. అంతేకాక ‘ముఖ్యమంత్రి స్మార్ట్‌ఫోన్ యోజన’ కింద బీపీఎల్ కుటుంబాలకు చెందిన మహిళలకు ఉచితంగా స్మార్ట్‌ఫోన్లను ఇస్తామని తెలిపింది.
అలానే 10 వేల కోట్ల రూపాయలతో ‘స్త్రీ ఉన్నతి ఫండ్’ను, ‘స్త్రీ ఉన్నతి స్టోర్’లను ఏర్పాటు చేయడమే కాక పొదుపు సంఘాల మహిళలకు 1 శాతం వడ్డీకే 2 లక్షల రూపాయల రుణం ఇస్తామని ప్రకటించింది. మహిళలను మాత్రమే కాక రైతులను ఆకట్టుకోవడం కోసం 15 వేల కోట్ల రూపాయలతో వివిధ సాగునీటి పథకాలను ప్రారంభిస్తామని బీజేపి ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యురప్ప తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment