బెంగళూరు: కర్ణాటక మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారయింది. కేబినెట్‌ను ఈనెల 6వ తేదీన విస్తరించనున్నట్లు ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రకటించారు. ‘ఈ నెల 6న ఉదయం 10.30 గంటలకు రాజ్‌భవన్‌లో 13 మంది ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేస్తారు’అని ఆదివారం సీఎం వెల్లడించారు. వీరిలో కాంగ్రెస్, జేడీఎస్ తదితర పార్టీల నుంచి బీజేపీలో చేరిన 10 మంది ఉన్నారని తెలిపారు. అన్ని ప్రాంతాలకు, కులాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించనున్నట్లు సీఎం తెలిపారు. ప్రస్తుతం లింగాయత్‌లు 8 మంది, వొక్కలిగలు ముగ్గురు, ఎస్సీలు ముగ్గురు, ఇద్దరు ఓబీసీలు, బ్రాహ్మణ, ఎస్టీల నుంచి ఒక్కరు చొప్పున కేబినెట్‌లో ప్రాతినిధ్యం ఉంది. మంత్రివర్గం పరిమితి 34 మంది కాగా, ముఖ్యమంత్రి సహా ప్రస్తుతం రాష్ట్ర కేబినెట్‌లో 18 మంది మంత్రులున్నారు. ఆరు నెలల క్రితం అధికారపగ్గాలు చేపట్టిన యడియూరప్ప కేబినెట్ విస్తరణపై రెండు నెలలుగా కసరత్తు చేస్తున్నారు. ఎట్టకేలకు జనవరి 31వ తేదీన బీజేపీ అధిష్టానం ముఖ్యమంత్రి ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపింది.
Comments
Please login to add a commentAdd a comment