
కర్ణాటక ముఖ్యమంత్రిగా మూడు రోజులు కూడా కొనసాగకుండానే శాసనసభలో బలపరీక్షకు ముందే రాజీనామా చేసిన బీఎస్ యడ్యూరప్ప మాదిరిగానే దేశంలో పదవి నుంచి వైదొలిగిన ప్రధానులు ఉన్నారు. లోక్‌సభలో అతి పెద్ద పార్టీ నేతగా ప్రధాని పదవి చేపట్టిన అటల్ బిహారీ వాజ్‌పేయి 1996 మే చివరి వారంలో విశ్వాసం తీర్మానంపై ఓటింగ్ జరగడానికి ముందే రాజీనామా చేశారు. మెజారిటీ నిరూపణకు అప్పటి రాష్ట్రపతి రెండు వారాలు గడువిచ్చినా అవసరమైన 272 మంది సభ్యుల మద్దతు కూడగట్టలేకపోయారు. విశ్వాసతీర్మానంపై చర్చ పూర్తయ్యాక వాజ్‌పేయి ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. బీజేపీకి తగినన్ని సీట్లు రాలేదంటే మాతృభూమికి తక్కువ సేవ చేసినట్లు కాదని అన్నారు. ప్రసంగం చివరిలో పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
మొరార్జీ దేశాయి అలాగే..
1977 మార్చి 24న జనతాపార్టీ తరఫున తొలి కాంగ్రెసేతర ప్రధానిగా ప్రమాణం చేసిన మొరార్జీ దేశాయి రెండేళ్లు గడిచాక పార్టీలో చీలిక కారణంగా పదవి కోల్పోయారు. ఆ పార్టీ నుంచి ఎంపీలు భారీ సంఖ్యలో రాజీనామా చేసి చరణ్‌సింగ్ నాయకత్వాన ఏర్పడిన జనతాపార్టీ–ఎస్‌లో చేరిపోయారు. ఫలితంగా మెజారిటీ నిరూపించుకోవడం అసాధ్యమని భావించిన మొరార్జీ దేశాయ్ అవిశ్వాస తీర్మానంపై చర్చ పూర్తికాకుండానే 1979 జులై 12న రాజీనామా చేశారు.