అప్పుడు పార్లమెంటులో, ఇప్పుడు కర్ణాటక అసెంబ్లీలో... అవే సన్నివేశాలు. అదే ఉద్వేగభరిత వాతావరణం..13 రోజుల పాటు ప్రధాని పదవిలో ఉండి విశ్వాస పరీక్షకుముందే భావోద్వేగ ప్రసంగం చేసి మరీ వాజపేయి రాజీనామా చేస్తే, ఇప్పుడు సరిగ్గా వాజపేయి బాటలోనే యడ్యూరప్ప నడిచే ప్రయత్నం చేశారు. ముచ్చటగా మూడురోజుల్లోనే బలపరీక్ష ఎదుర్కోకుండానే రాజీనామా చేయడమే కాదు అసెంబ్లీలో కంటతడి పెట్టుకున్నారు. నేను రాజీనామా చేస్తున్నానంటూ ప్రకటించి సభ నుంచి బయటకువెళ్లిపోతూ వెళ్లిపోతూ విజిటర్స్ గ్యాలరీలో ఉన్న కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్‌తో కరచాలనం చేసి మరీ వెళ్లిపోయారు.
ఉద్వేగ భరితం వాజపేయి ప్రసంగం
సరిగ్గా ఇరవై రెండేళ్ల క్రితం 1996 సంవత్సరంలో లోక్‌సభలో తీవ్ర భావోద్వేగానికి లోనైన నాటి ప్రధానమంత్రి అటల్ బిహారి వాజపేయి విశ్వాస పరీక్ష ఎదుర్కోకుండానే పదవికిరాజీనామా చేశారు. సహజంగానే మంచి వక్త అయిన వాజపేయి అధికారానికి దూరమైనప్పటికీ తన ఉద్వేగ పూరితమైన ప్రసంగంతో అందరినీ ఆకట్టుకున్నారు. కేవలం 13రోజుల పాటు ప్రధాని పదవిలో కొనసాగిన వాజపేయి గద్దె దిగిపోతూ చేసిన ప్రసంగం భారత పార్లమెంటరీ చరిత్రలోనే ఒక కీలక ఘట్టం. నాటి ప్రసంగాన్ని దూరదర్శన్ లైవ్‌టెలికాస్ట్ చేయడంతో వాజపేయి ప్రసంగం ఇప్పటికీ ఎందరినో వెంటాడుతోంది. ఇలా చట్టసభల సమావేశాలను లైవ్ ఇవ్వడం కూడా అదే తొలిసారి. దీంతో వాజపేయి సభవిశ్వాసాన్ని పొందలేకపోయినప్పటికీ తన ప్రసంగం ద్వారా ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నారు. నాటి ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించినప్పటికీ, ఇతర పార్టీలమద్దతు కూడగట్టడంలో విఫలమైంది. దీంతో అప్పటి రాజకీయ పరిస్థితులపై వాజపేయి సుదీర్ఘంగా ప్రసంగించారు. ‘నా మీద అందరూ వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు.పదవి కోసం పాకులాడుతున్నానని అంటున్నారు. ప్రజలు మా పార్టీకి అత్యధిక సంఖ్యలో సీట్లు కట్టబెడితే నేను అధికారానికి ఎందుకు దూరంగా ఉండాలి. ప్రభుత్వం ఏర్పాటుచేస్తామని అడిగే హక్కు మాకు ఉండదా ? ప్రజలు మాపై ఎంతో విశ్వాసంతో సింగిల్ లార్జెస్ట్ పార్టీని చేస్తే, వారిని మోసగించాలా? ఈ యుద్ధభూమి నుంచి పారిపోవాలా ?‘అనిప్రశ్నించారు.
‘మీకు ఎంత శాతం ఓట్లు వచ్చాయని నన్ను అందరూ అడుగుతున్నారు. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓట్లు ముఖ్యమా ? సీట్లు ముఖ్యమా ? మన పార్లమెంటరీవ్యవస్థలో నెగిటివ్ ఓట్లను ఎవరూ లెక్కపెట్టరు. అలాంటప్పుడు ప్రజలు మమ్మల్ని తిరస్కరించారని మీరెలా అంటారు‘ అంటూ వాజపేయి విపక్షాలకు చురకలు అంటించారు.యడ్యూరప్ప కూడా సరిగ్గా వాజపేయి ప్రసంగాన్ని తలపించేలా ‘ప్రజలు మాకు 104 సీట్లు వరంగా ఇచ్చారు. ప్రజా తీర్పు మాకు అనుకూలంగా ఉంది. అధికారం లేకపోయినానా జీవితం ప్రజలకు అంకితం. నేను యోధుడ్ని.. చివరి శ్వాస ఉన్నంతవరకు పోరాటం చేస్తూనే ఉంటాను‘ అని అన్నారు. ఇక వాజపేయి తన ప్రసంగం చివర్లో ‘నన్ను ఫాసిస్ట్ అని అంటున్నారు. కానీ నేను ప్రజాస్వామ్య యుతంగానే పోరాడుతున్నాను. ఎన్నికల్లో గెలుస్తున్నాను. అధికారం లేకపోయినా మాకున్న మార్గాల్లో మేము దేశ సేవ చేస్తూనే ఉంటాం. ఇప్పుడు మాకు మెజార్టీ లేనంత మాత్రానా, మేము మా మాతృభూమికి చేసిన సేవ ఏ మాత్రం తగ్గదు‘ అంటూ ఉద్వేగంగా ప్రసంగించి ఎందరినో కదిలించారు. ఇక యడ్యూరప్ప తన ప్రసంగంలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 28 లోక్‌సభ స్థానాలు గెలుచుకొని తామేమిటో చూపిస్తానంటూ ప్రతిజ్ఞ చేశారు. అచ్చంగా వాజపేయిని తలపించేలా యడ్యూరప్ప పదవి నుంచి వైదొలిగినప్పటికీ, వాజపేయి ఆ నాడు ప్రజలపై వేసిన ముద్ర అంతా ఇంతా కాదు. వాజపేయి భావోగ్వేదానికి అప్పట్లో జాతి యావత్తు కదిలిపోయింది. ఆనాటి వాజపేయి ప్రసంగం చిరస్మరణీయం.
(సాక్షి నాలెడ్జ్ సెంటర్)
Comments
Please login to add a commentAdd a comment