సాక్షి, బెంగళూరు: ‘ప్రజలు ఎన్నికల్లో తిరస్కరించినా కాంగ్రెస్–జేడీఎస్ పార్టీలు అధికారం కోసం ప్రజాతీర్పును అవమాన పరుస్తూ అనైతిక మైత్రి చేసుకున్నాయి. అందుకే ప్రమాణ స్వీకారం చేసిన మూడు రోజులకే నేను రాజీనామా చేయాల్సి వస్తోంది’ అని ముఖ్యమంత్రి యడ్యూరప్ప అన్నారు. ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించి గురువారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన యడ్యూరప్ప శనివారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. విధానసభలో బల నిరూపణకు ముందే ఆయన పదవిని వీడారు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు.. విధానసభ ప్రారంభమైన కొద్దిసేపటికి ఎమ్మేల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం యడ్యూరప్ప భావోద్వేగంతో ప్రసంగించారు. ఏ పార్టీ ప్రకటించని విధంగా ఎన్నికలకు మూడేళ్ల ముందే తనపై నమ్మకంతో బీజేపీ అధిష్టానం తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిందన్నారు. అప్పటి నుంచి ఎన్నికల ప్రచారాలు ముగిసే వరకు రాష్ట్రవ్యాప్తంగా నిరంతరం పర్యటనలు చేసి రైతుల, ప్రజల కష్టనష్టాలను తెలుసుకున్నామన్నారు. ఎన్నికల్లో 104 స్థానాల్లో విజయాన్ని అందించారు. గత ఎన్నికల్లో 40 మంది ఎమ్మెల్యేల సంఖ్యా బలం నుంచి నేడు అతిపెద్ద పార్టీగా నిలబెట్టారని అన్నారు.
‘ఇంతటి విజయాన్ని అందించిన ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయాలనే ఉద్దేశంతో అధికారాన్ని చేపట్టాం. ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రెండు గంటల్లోనే రైతుల రుణమాఫీ నిర్ణయం తీసుకున్నాం. అయితే ప్రజలు ఎన్నికల్లో తిరస్కరించినా కాంగ్రెస్–జేడీఎస్ అధికారం కోసం ప్రజల తీర్పును అవమానపరుస్తూ అపవిత్ర సంధి చేసుకున్నాయి. దాని ఫలితమే నా రాజీనామా’ అంటూ కంటతడి పెట్టుకున్నారు. ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతులకు, కష్టాల్లో మరింత కుంగిపోతున్న రైతులు, పేదలను ఆదుకోవడానికి ఎన్నో పథకాలు రూపొందించుకున్నామని, అయితే కాంగ్రెస్ కుటిల బుద్ధి, అధికారం దాహంతో అవన్నీ ధ్వంసమైనట్లు మండిపడ్డారు.
రాజీనామా సమర్పణ
రాజీనామా చేసి అధికారం కోల్పోయినంత మాత్రానే తాము ఊరికే కూర్చోబోమని రైతులు, పేదలు, ప్రజా సమస్యలపై తమ పోరాటాలు, ఉద్యమాలు కొనసాగిస్తామని యడ్డి స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి 150 సీట్లలో మెజారిటీని అప్పగించడం ద్వారా అనైతిక కాంగ్రెస్–జేడీఎస్‌లకు ప్రజలు తగినరీతిలో బుద్ధి చెబుతారన్నారు. అనంతరం ఆయన నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ వజూభాయ్‌వాలాకు రాజీనామాపత్రం సమర్పించారు. ఆయన వెంట కేంద్రమంత్రులు అనంత్‌కుమార్, సదానందగౌడ, బీజేపీ సీనియర్లు ఉన్నారు.
పదవిలో 55 గంటలే
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మూడు రోజులు కూడా పూర్తవ్వక ముందే యడ్యురప్ప రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయన ముఖ్యమంత్రి పదవి మూడు రోజుల ముచ్చటగా మారింది. 17వ తేదీ గురువారం ఉదయం 9 గంటలకు రాజ్‌భవన్‌లో యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే మూడు రోజులు తిరగక ముందే శనివారం సాయంత్రం 5 గంటలకు రాజీనామా చేసేశారు. యడ్యురప్ప ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రి కాగా, ఒక్కసారి కూడా పూర్తికాలం పదవిలో కూర్చోలేని నేతగా పేరు పొందారు. ప్రభుత్వం రద్దవడమో, లేక రాజకీయ కారణాల వల్ల మూడుసార్లూ అర్ధాంతరంగా పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. యడ్డి సభ నుంచి నిష్క్రమించడంతో కాంగ్రెస్– జేడీఎస్ ఎమ్మెల్యేల్లో ఉత్సాహం పెల్లుబికింది. జేడీఎస్ పక్ష నేత కుమారస్వామి, కాంగ్రెస్ నేత డీకే శికుమార్‌లు చేయిచేయి కలిపి సంబరాలు చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment