- ఆరు నెలల్లో సీఎం కుర్చీ దిగుతారు
- ఆ గనులను ఎందుకు వేలం వేయలేదో సీఎం స్పష్టం చేయాలి
- రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్ప
సాక్షి, బళ్లారి : కర్ణాటకలోనూ కాంగ్రెస్ పార్టీని ఇంటికి సాగనంపి బీజేపీని అధికారంలోకి తేవడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కే.ఎస్.ఈశ్వరప్ప సీఎం సిద్ధరామయ్యపై తీవ్ర విమర్శలు చేశారు. బళ్లారి ఎంపీ శ్రీరాములును అత్యధిక మెజార్టీతో గెలిపించిన కార్యకర్తలకు అభినందనలు తెలిపేందుకు నగరంలోని బసవభవన్‌లో గురువారం సాయంత్రం బీజేపీ శాఖ ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన ప్రసంగించారు.
అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ నుంచి యడ్యూరప్ప, శ్రీరాములు విడిపోవడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. తిరిగి వారిద్దరి కృషితో పాటు మోడీ హవా కారణంగా రాష్ర్టంలో తమ పార్టీకి 17 లోక్‌సభ స్థానాలు దక్క డం సంతోషంగా ఉందన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీకి 9 సీట్లు మాత్రమే రావడం ఆపార్టీలో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలు తేటతెల్లం చేస్తున్నాయన్నారు.
రాష్ట్రంలో అధికారం చేపట్టిన సిద్ధరామయ్య ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్డడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో అక్రమ ఖనిజ తవ్వకాలు సాగించిన 51 కంపెనీలను వేలం వేయాలని సుప్రీం కోర్టు ఆదేశించినా.. సీఎం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదన్నారు. గనుల అక్రమార్కులనుంచి సీఎం మామూళ్లు తీసుకుంటున్నందుకే వాటిని వేలం వేయలేదని ఆరోపించారు.
గనుల అక్రమాలపై బెంగళూరు నుంచి బళ్లారికి డ్యాన్స్‌లు చేస్తూ పాదయాత్ర చేపట్టిన సిద్దరామయ్య ప్రస్తుతం ఎందుకు మౌనంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. మోడీని సిద్ధరామయ్య నరహంతకుడుగా విమర్శించారని, ఇప్పుడు మోడీ ప్రధాని అయ్యారని, దీనికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. మోడీ తన ప్రమాణస్వీకారానికి సార్క్ దేశాధినేతలను ఆహ్వానించడం ఆయన స్నేహ హస్తానికి నిదర్శనమన్నారు. త్వరలో సీఎం సిద్ధరామయ్య తన కుర్చీ దిగడం ఖాయమన్నారు.
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు కూడా త్వరలో రానున్నట్లు జోస్యం చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అధికారం మాత్రమే బీజేపీకి దక్కుతుందన్నారు. దేశాన్ని ఏకతాటిపై తీసుకుని వచ్చిన మోడీని ప్రపంచ దేశాలు పొగడ్తలతో ముంచెత్తుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. కర్ణాటక సమగ్రాభివృద్ధికి తామంతా కృతనిశ్చయంతో ఉన్నామని, జాబితా తయారు చేసి ప్రధానమంత్రి వద్దకు వెళ్దామని సీఎం కు సూచించారు.
కార్యక్రమంలో బళ్లారి లోక్‌సభ సభ్యుడు బీ.శ్రీరాములు, కేఎంఎఫ్ అధ్యక్షుడు గాలి సోమశేఖరరెడ్డి, మాజీ ఎంపీలు శాంత, సన్న పక్కీరప్ప, విధాన పరిషత్ సభ్యులు మృ త్యుంజయ జినగ, శశీల్ నమోషీ, జిల్లా బీజేపీ అధ్యక్షుడు నేమిరాజ్ నాయక్, మాజీ ఎమ్మెల్యే సోమలింగప్ప, బీజేపీ నాయకులు మహిపాల్, కే.ఎస్.దివాకర్, ఎ.ఎం.సంజయ్, సుధీర్, సుధాకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.