- నేడు ప్రమాణ స్వీకారం !
- ఆరుగురికి అధికారిక ఆహ్వానం
- నేడు జగన్నాథ భవన్‌లో వేడుకలు
- ఢిల్లీకి రాష్ర్ట నాయకులు
సాక్షి, బెంగళూరు : తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికల సహా బెంగళూరు దక్షిణ పార్లమెంటు స్థానం నుంచి ఆరు పర్యాయాలు ఎంపీగా ఎన్నికైన అనంతకుమార్‌కు కేంద్ర మంత్రి మండలిలో స్థానం దక్కడం దాదాపు ఖాయమైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో ఆయన భార్య తేజస్వినీతో కలిసి ఢిల్లీలో మకాం వేసినట్లు తెలుస్తోంది.
సోమవారం నరేంద్రమోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వేదికపై అనంతకుమార్ కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఒకవేళ రాష్ట్రానికి రెండు కేంద్ర మంత్రి పదవులు కేటాయించాలని మోడీ భావిస్తే మరో పదవి మాజీ సీఎం డీ.వీ సదానంద దక్కనుందని ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు.
కేంద్ర మంత్రి పదవుల కోసం తాజా ఎంపీలు యడ్యూరప్ప, రమేష్ జిగజిణగిలు చివరి వరకూ పోరాడినా ఫలితం లేకపోయింది. ‘సాధ్యమైనంత తక్కువ సంఖ్యలో మంత్రి మండలి, ఎన్‌డీఏలోని మిత్రపక్షాలకూ మంత్రిమండలిలో స్థానం’ ఇవ్వాలని కాబోయే ప్రధాని నరేంద్రమోడీ భావిస్తుండటంతో ప్రస్తుతానికి కర్ణాటకకు ఒకటి లేదా రెండు మంత్రి పదవులు మాత్రమే దక్కాయని కర్ణాటక కమలనాథులు చెప్పుకొస్తున్నారు.
ఇదిలా ఉండగా మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర శాఖకు చెందిన ఆరుగురికి అధికారిక ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. వీరిలో మాజీ ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్, మాజీ ఉపముఖ్యమంత్రి కే.ఎస్, మాజీ మంత్రులు అరవింద లింబావళి, సీ.టీ రవి, గోవిందకారజోళ, సంతోష్‌లు ఉన్నారు. వీరు కాక నూతనంగా ఎన్నికైన 17 మంది పార్లమెంటు సభ్యులు, రాజ్యసభ సభ్యులు కూడా ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొననున్నారు.
మరోవైపు మోడీ ప్రమాణ స్వీకారం చేసే సమయంలో రాష్ట్రంలోని వివిధ నగరాల్లో వేడుకలు నిర్వహించాలని బీజేపీ రాష్ట్రశాఖ నిర్ణయించింది. బెంగళూరులోని పార్టీ ప్రధాన కార్యాలయం జగన్నాథ భవన్‌తోపాటు మైసూరు సర్కిల్ వద్ద వేడుకలు నిర్వహించి కమలనాథులు ప్రజలకు మిఠాయిలు పంచనున్నారు. అయితే బీజేపీలోని అనంతకుమార్ వ్యతిరేక వర్గీయులు మాత్రం తద్విరుద్ధంగా చెబుతున్నారు.
అద్వానీ శిష్యుడిగా ముద్రపడ్డ అనంతకుమార్‌కు ఇప్పట్లో కేంద్రమంత్రి పదవి ఇచ్చే ఆలోచన మోడీకి లేదని చెబుతున్నారు. అందువల్లే ఆయన ఢిల్లీలో ఉంటూ ఆర్‌ఎస్‌ఎస్ నేతనలను ప్రసన్నం చేసుకుని అమాత్య పదవిని పొందాలని వ్యూహ రచన చేస్తున్నారని వారు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా మరో కొన్ని గం టల్లో రాష్ట్రానికి చెందిన ఎంతమందికి కేంద్ర మం త్రి మండలిలో స్థానం దక్కనుందో తేలిపోనుంది.