
వాడీవేడి చర్చ అనంతరం సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
అనుకూలం 288, వ్యతిరేకం 232
బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్, ఎస్పీ, డీఎంకే తదితర విపక్షాలు
బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసిన వైఎస్సార్‌సీపీ ప్రతిని చించేసిన ఒవైసీ..
నేడు రాజ్యసభ ముందుకు బిల్లు
మోదీ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వక్ఫ్ (సవరణ) బిల్లు–2025ను లోక్‌సభ బుధవారం ఆమోదించింది. బిల్లుకు అనుకూలంగా 288, వ్యతిరేకంగా 232 ఓట్లు పడ్డాయి. అంతకుముందు బిల్లుపై 12 గంటల పాటు సుదీర్ఘంగా చర్చ జరిగింది. బిల్లు రాజ్యాంగ విరుద్ధమని విపక్ష ఇండియా కూటమి ఆరోపించగా పారదర్శకత కోసమేనని ప్రభుత్వం సమర్థించుకుంది.
న్యూఢిల్లీ: మోదీ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వక్ఫ్ (సవరణ) బిల్లు–2025ను లోక్‌సభ బుధవారం ఆమోదించింది. బిల్లుకు అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 232 ఓట్లు పడ్డాయి. అంతకుముందు మధ్యాహ్నం 12 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల దాకా వాడీవేడీగా చర్చ కొనసాగింది. ముస్లింల ప్రయోజనాలను దెబ్బతీయడానికి మోదీ ప్రభుత్వం కుట్ర పన్నిందని విపక్షాలు మండిపడ్డాయి.
బిల్లును అంగీకరించబోనంటూ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సభలోనే బిల్లు ప్రతిని చించేశారు. అధికార ఎన్డీయే కూటమి ఎంపీలు బిల్లును సమర్థించారు. విపక్షాలవి ఓటు బ్యాంకు రాజకీయాలని ధ్వజమెత్తారు. వక్ఫ్ సవరణ బిల్లు గురువారం రాజ్యసభ ముందుకు రానుంది. ఎగువ సభలో చర్చకు 8 గంటల సమయం కేటాయించారు. అనంతరం బిల్లుపై ఓటింగ్ జరగనుంది. రాజ్యసభలోనూ అధికార ఎన్డీయేకు తగిన మెజార్టీ ఉండడంతో బిల్లు సులువుగా ఆమోదం పొందడం ఖాయంగా కనిపిస్తోంది.
యూపీఏ పాపమే: రిజిజు
వక్ఫ్ (సవరణ) బిల్లు–2025ను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు బుధవారం మధ్యాహ్నం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అనంతరం దానిపై సుదీర్ఘ చర్చ జరిగింది. బిల్లుకు అనుకూలంగా బీజేపీ సారథ్యంలోని అధికార ఎన్డీఏ, వ్యతిరేకంగా కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటముల మధ్య సంవాదం సభను వేడెక్కించింది. ముస్లింల ప్రయోజనాల పరిరక్షణే ప్రభుత్వ లక్ష్యమని ఎన్డీఏ పక్షాలు పేర్కొనగా, బిల్లు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమంటూ విపక్షాలు తీవ్రంగా ఆక్షేపించాయి.
వక్ఫ్ బిల్లు పేరును ఉమ్మీద్ (యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్‌మెంట్ ఎంపవర్‌మెంట్, ఎఫీషియన్సీ అండ్ డెవలప్‌మెంట్–యూఎంఈఈడీ)గా మారుస్తున్నట్టు రిజిజు ప్రకటించారు. అనంతరం చర్చను ప్రారంభించారు. వక్ఫ్ బిల్లుకు తాము ప్రతిపాదిస్తున్న సవరణలే లేకపోతే పార్లమెంటు భూమిని కూడా వక్ఫ్ ఆస్తే అంటారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు భవనం, దాని పరిసర ప్రాంతాలు వక్ఫ్ ఆస్తుల్లో భాగమేనని ఆలిండియా ముస్లిం డెమొక్రటిక్ ఫ్రంట్ (ఏఐయూడీఎఫ్) చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ గతంలో వ్యాఖ్యలు చేశారు.
వాటినుద్దేశించే మంత్రి ఇలా మాట్లాడినట్టు చెబుతున్నారు. ఈ బిల్లు కేవలం వక్ఫ్ ఆస్తుల నిర్వహణకు సంబంధించిన విషయమే తప్ప ముస్లింల మత విశ్వాసాల్లో ఎలాంటి జోక్యమూ చేసుకోబోదని ఆయన స్పష్టం చేశారు. ‘‘వక్ఫ్ బిల్లుపై సంయుక్త పార్లమెంటరీ సంఘం వేసి అత్యంత సుదీర్ఘంగా చర్చలు, సంప్రదింపులు జరిపాం. జేపీసీ సూచించిన పలు సవరణలకు అంగీకరించాం.
అయినా విపక్షాలు అవాస్తవాలతో ప్రజలను తప్పుదోవ పట్టించజూస్తున్నాయి. వక్ఫ్ చట్టానికి యూపీఏ హయాంలో చేసిన మార్పుల వల్ల దానికి విపరీతమైన అధికారాలు దఖలు పడ్డాయి. వక్ఫ్ చట్టాన్ని ఇతర చట్టాలకు అతీతంగా మార్చేశాయి. అందుకే ఈ సవరణలు తప్పనిసరయ్యాయి’’ అని రిజిజు అన్నారు. ఏ మత సంస్థల వ్యవహారాల్లోనూ తమ ప్రభుత్వం వేలుపెట్టబోవడం లేదని చెప్పారు. ‘‘ప్రపంచంలోకెల్లా అత్యధిక సంఖ్యలో వక్ఫ్ ఆస్తులున్నది భారత్‌లోనే. వాటిని పేద ముస్లింల సంక్షేమానికి మాత్రమే వినియోగించాలి.
అలా జరిగేలా చూడటమే బిల్లు లక్ష్యం. దీనికి మద్దతిస్తున్నదెవరో, వ్యతిరేకిస్తున్నదెవరో దేశం ఎన్నటికీ గుర్తుంచుకుంటుంది’’ అని చెప్పారు. కాంగ్రెస్ తరఫున గౌరవ్ గొగొయ్ మాట్లాడుతూ రిజిజు వాదనను తీవ్రంగా ఖండించారు. బిల్లును రాజ్యాంగ మౌలిక స్వరూపంపైనే దాడిగా అభివర్ణించారు. రిజుజు చర్చకు బదులిచ్చారు. మైనారిటీలకు భారత్‌ను మించిన సురక్షితమైన దేశం ప్రపంచంలోనే లేదన్నారు. అత్యల్ప సంఖ్యాకులైన పార్సీలు కూడా సగర్వంగా నివసిస్తున్నట్టు చెప్పారు.

అంతా అంగీకరించాల్సిందే: అమిత్ షా
వక్ఫ్ బిల్లు విషయమై దేశంలో అయోమయం సృష్టించేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. ముస్లింలను భయపెట్టడం ద్వారా వారిని ఓటుబ్యాంకుగా మార్చుకున్నాయంటూ దుయ్యబట్టారు. ఈ బిల్లు ముస్లింల మత సంబంధిత అంశాల్లో వేలు పెడుతుందన్న ఆరోపణలను మంత్రి తోసిపుచ్చారు. ‘‘ఈ సవరణలను మైనారిటీలు ఒప్పుకోరని కొందరంటున్నారు. భారత ప్రభుత్వం, పార్లమెంటు చేస్తున్న చట్టమిది. దీన్ని ప్రతి ఒక్కరూ అంగీకరించి తీరాల్సిందే’’ అని కుండబద్దలు కొట్టారు.
‘‘2014 లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నాటి కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ సర్కారు వక్ఫ్ చట్టానికి హడావుడిగా రాత్రికి రాత్రి అడ్డగోలు సవరణలు చేసింది. తద్వారా దాన్ని చట్టాలకు అతీతంగా మార్చింది. కాంగ్రెస్ పార్టీ ముస్లిం సంతుïÙ్టకరణ రాజకీయాలకు ఇది పరాకాష్ట. లేదంటే ఈ సవరణ బిల్లు అవసరముండేదే కాదు’’ అని అమిత్ షా అన్నారు.
‘‘యూపీఏ నిర్ణయం వల్ల ఢిల్లీలోని ల్యూటెన్స్ జోన్‌లో ఏకంగా 123 ఆస్తులు కేవలం 25 రోజుల వ్యవధిలో వక్ఫ్ ఆస్తులుగా మారిపోయాయి. ఇలాంటి దారుణమైన అవకతవకలను సరిదిద్దడం, వక్ఫ్ భూములు, ఆస్తుల నిర్వహణ పూర్తిగా ప్రజాస్వామికంగా, పారదర్శకంగా జరిగేలా చూడటమే తాజా బిల్లు ఉద్దేశం. అంతేతప్ప ఓటుబ్యాంకు కోసం చట్టాలు చేయడం మోదీ సర్కారుకు అలవాటు లేదు’’ ని స్పష్టం చేశారు.
పౌరుల వ్యక్తిగత, ప్రభుత్వ ఆస్తులన్నింటినీ ఎట్టి పరిస్థితుల్లోనూ పరిరక్షించి తీరతామని చెప్పారు. ‘‘కేవలం వక్ఫ్ ఆస్తి అని ప్రకటించినంత మాత్రాన ఎవరి భూమీ వక్ఫ్ భూమిగా మారకుండా తగిన రక్షణలను ఈ బిల్లు కల్పిస్తుంది’’ అని వివరించారు. అనంతరం బీజేపీతో పాటు విపక్షాల నుంచి పలువురు సభ్యులు బిల్లుపై అర్ధరాత్రి దాకా సుదీర్ఘంగా మాట్లాడారు. అనంతరం ఓటింగ్ ద్వారా బిల్లు ఆమోదం పొందింది. తర్వాత దానికి విపక్షాలు పలు సవరణలు ప్రతిపాదించగా అవన్నీ ఒక్కొక్కటిగా వీగిపోయాయి.
చర్చకు రాహుల్ గైర్హాజరు
సోదరి, వయనాడ్ ఎంపీ ప్రియాంక కూడా
కీలకమైన వక్ఫ్ (సవరణ) బిల్లుపై లోక్‌సభలో జరిగిన చర్చకు, ఓటింగ్‌కు విపక్ష నేత రాహుల్‌గాంధీ గైర్హాజరయ్యారు. ఆయన సోదరి, వయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీ కూడా బుధవారం సభకు హాజరు కాలేదు. బిల్లుపై అనుసరించాల్సిన వ్యూహంపై ఉదయం సభలో ఆయన పార్టీ ఎంపీలతో చర్చించారు. దాంతో బిల్లుపై కాంగ్రెస్ తరఫున చర్చకు రాహులే సారథ్యం వహిస్తారని భావించారు. కానీ చర్చలో పాల్గొనరాదని రాహుల్ నిర్ణయించుకున్నారు. పార్లమెంటు ప్రాంగణం నుంచి నిష్క్రమించారు. ప్రియాంక కూడా చర్చలో పాల్గొనకపోవడం విశేషం. కాంగ్రెస్‌కు కేటాయించిన గంటా 40 నిమిషాల సమయంలో గౌరవ్ గొగొయ్ తదితర పార్టీలే ఎంపీలే మాట్లాడారు.
బీజేపీ నయా మత రాజకీయం
లౌకిక ఇమేజ్ కు పెద్ద దెబ్బ: అఖిలేశ్
వక్ఫ్ బిల్లు ప్రపంచ దేశాలకు తప్పుడు సంకేతాలు పంపుతుందని, భారత లౌకిక ఇమేజ్ కు పెద్ద దెబ్బ అని సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ తీవ్రంగా విమర్శించారు. బీజేపీ నయా మత రాజకీయం అని ధ్వజమెత్తారు. లోక్ సభ ఎన్నికల్లో ఎదురుదెబ్బల నేపథ్యంలో.. ఓట్ల పోలరైజేషన్ కు, తమకు దూరమైన కొన్ని వర్గాలను దగ్గర చేసుకునేందుకు కాషాయ పార్టీ ఈ ఎత్తుగడ వేసిందన్నారు. అధికార కూటమిలోకి కొన్ని పార్టీలు వక్ఫ్ బిల్లుకు మద్దతిస్తున్నప్పటికీ వాటికీ మనస్ఫూర్తిగా ఇష్టం లేదని తెలిపారు.