న్యూఢిల్లీ : కర్ణాటకలో ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతోంది. కేవలం బహిరంగ ప్రచారాల్లోనే కాక, సోషల్ మీడియా వేదికగా కూడా బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య వార్ కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో, ఎలాగైనా ఈ సారి కర్ణాటక పీఠాన్ని దక్కించుకోవాలని బీజేపీ తీవ్రంగా కృషిచేస్తోంది. ఈ నేపథ్యంలో కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, బీజేపి రాష్ట్ర అద్యక్షుడు యడ్యూరప్ప వరుస ట్వీట్లతో ఒకరిపై ఒకరు విమర్శల అస్త్రాలను సంధించుకుంటున్నారు.
ఇటీవల కర్ణాటకలో జరిగిన ఓ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం మిషన్ డ్రైవ్ కంటే కమీషన్ డ్రైవ్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టిందని విమర్శించారు. దీనిపై సిద్ధరామయ్య స్పందిస్తూ... ''మైసూరు వాసులను ఎవరూ మోసం చేయలేరు. తెల్లవారితో పోరాడిన పులిబిడ్డలు పుట్టిన ప్రాంతం ఇది. భూ సంస్కరణలు తీసుకువచ్చిన ఆధునిక రాష్ట్రం కర్ణాటక. కొంతమంది చౌకబారు విమర్శలను కర్ణాటక ప్రజలు ఆహ్వానించరు'' అని ట్వీట్ చేశారు. సిద్ధరామయ్య చేసిన ఈ ట్వీట్‌పై సోషల్ మీడియా వేదికగా యడ్యూరప్ప విరుచుపడ్డారు. ఇలా వరుస ట్వీట్లతో రెండు పార్టీల మధ్య పొలిటికల్ వార్ జోరుగాసాగుతోంది.
వరుస ట్వీట్ల రహస్యం ఇదే
ఎన్నికల ప్రచారం అంటే పాదయాత్రలు, ఇంటింటికి తిరగడం, బహిరంగ సభలు, ర్యాలీలు తీయడం సహజం. దీంతో పాటు ఇటీవల కాలంలో సోషల్ మీడియా కూడా ఎన్నికల ప్రచారంలో ప్రముఖ పాత్ర వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే రాజకీయా పార్టీలు తమ ప్రచారానికి సోషల్ మీడియాను ఎక్కువగా వాడుతున్నారు. విద్యావంతులైన ప్రజలు ఇంటర్‌నెట్‌ను పూర్తి స్థాయిలో ఉపయోగిస్తున్నారు. అంతేకాక యువతపై సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇటు ప్రజలను, అటు యువతను ఆకట్టుకోవడానికి ఈ మాధ్యమాన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచార అస్త్రంగా ఎంచుకుంటున్నారు. సోషల్ ప్రచారానికి ఏకంగా టీమ్‌లనే ఏర్పాటు చేసుకుంటున్నారు.
యడ్యూరప్ప ఉత్తర బెంగళూరులో ఒక అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకునిసోషల్ మీడియా టీంను ఏర్పాటు చేశారు. సోషల్ మీడియా నిపుణుడు రాజ్‌నీతి సారథ్యంలో తమ ప్రచారం నిర్వహిస్తున్నారు. 25 మందితో కూడిన ఈ టీమ్, మూడు నెలల క్రితమే బెంగుళూరులో యడ్యూరప్పను కలిశారు. తాజా సంఘటనల ఆధారంగా ఈ టీమ్ యడ్యూరప్పకు అనుకూలంగా ప్రచారం సాగిస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ సైతం సామాజిక మీడియా నిపుణులచే సొంత టీమ్‌ను ఏర్పాటు చేసుకుంది. దీనికి సిద్ధరామయ్య తనయుడు సారథ్యం వహిస్తున్నాడు. ఓ ఇంగ్లీష్ ఛానల్‌తో ఆయన మాట్లాడుతూ..''మాకు గత సంవత్సరం సెప్టెంబర్ వరకు సోషల్ మీడియా టీమ్ లేదు. ఇప్పుడు ఏర్పాటు చేసుకున్నాం. ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్‌ల ద్వారా కాంగ్రెస్ కార్యక్రమాలను ప్రచారం చేస్తున్నాం'' అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment