సోషల్ మీడియాపై కాంగ్రెస్ దృష్టి..
సాక్షి, గాంధీనగర్: గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు సమీపిస్తుండడంతో పాలకపక్ష బీజేపీని దీటుగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ కూడా తన సైబర్ సైన్యాన్ని సిద్ధం చేసింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంలో సైబర్ సైన్యం సోషల్ మీడియాలో నిర్వహించిన పాత్ర అంతా ఇంత కాదనే విషయం తెల్సిందే. ఈ విషయంలో మొదటినుంచి వెనకబడిపోయిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కనువిప్పు కలిగినట్లుంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాస్త ముందుంది.
‘కాంగ్రెస్ వికాస్ గాథ, వై ఓన్లీ కాంగ్రెస్ రన్ ఇండియా, బ్లఫ్ మాస్టర్ మోదీ, ఫేకు మేన్, కెన్ బీజేపీ రన్ ఇండియా, వ్యాపారి విరోధి మోదీ, పాటిదార్ విరోధి మోదీ’ అన్న శీర్షికలతో ఫేస్‌బుక్‌లో ఒకేసారి 20 పేజీలను కాంగ్రెస్ పార్టీ ఐటీ సెల్ పోస్ట్ చేసింది. ఈసారి తాము సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తామని, తాము చేపట్టిన ‘జనతా కా రిపోర్టర్’ సిరీస్‌కు ఎంతో ఆదరణ లభించిందని గుజరాత్ పార్టీ ఐటీ సెల్ చీఫ్ రోహన్ గుప్తా మీడియాకు తెలిపారు. బీజేపీ రాష్ట్రంలో పెద్ద పెద్ద హామీలు ఇచ్చి విఫలమైందని, గ్రామీణ స్థాయి నుంచి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ పార్టీ కార్యకర్తల నుంచి తమకు ఎప్పటికప్పుడు వీడియోలు, ఆడియోలు అందుతున్నాయని ఆయన చెప్పారు.
ప్రతి నియోజక వర్గంలో దాదాపు 50వేల మొబైల్ ఫోన్లు ఉంటాయని అంచనా వేశామని, ఆ నెంబర్లన్నింటినీ సేకరిస్తున్నామని, వాటి ద్వారా కూడా తాము క్రియాశీలకంగా ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తామని గుప్తా వివరించారు. ఆ నెంబర్లలో కనీసం సగం నెంబర్లను తాము పట్టుకోకలిగినా మంచి ప్రభావం చూపించవచ్చని చెప్పారు. ప్రతి 15 రోజులకోసారి పార్టీ కార్యకర్తలకు, ఎమ్మెల్యేలకు తగిన శిక్షణా కార్యక్రమాలను చేపడుతున్నామని కూడా చెప్పారు.