
అమిత్‌షా, యడ్యూరప్ప మాస్క్‌లతో ధర్నా నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు
శివాజీనగర/యశ్వంతపుర: గతంలో రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చి పాలనను అస్థిర పరిచిన ఘనత ఆ పార్టీదేనని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. సీఎం సిద్ధరామయ్యపై ఆరోపణలు చేస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీ.ఎస్.యడ్యూరప్పలకు వ్యతిరేకంగా రాజాజీనగర అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు ఆదివారం నగరంలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు.
కర్ణాటక విద్యుత్ మండలి అధ్యక్షుడు ఎస్.మనోహర్ మాట్లాడుతూ అక్రమ గనుల తవ్వకాలు, ప్రేరణ ట్రస్ట్ డీ నోటిఫిషన్ విషయంలో అప్పటి సీఎం యడ్యూరప్ప, అప్పటి మంత్రులు జైలుకు వెళ్లి వచ్చిన విషయం ప్రజలకు తెలుసన్నారు. రాష్ట్రంలో అవినీతికి చోటు లేకుండా ఉత్తమ పాలన కొనసాగిస్తున్న సిద్దరామయ్యను రాష్ట్ర ప్రజలు మెచ్చుకుంటున్నారన్నారు. దీన్ని ఓర్చలేని బీజేపీ నేతలు సిద్ధరామయ్యపై నిరాధారణమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. బెంగళూరు నగర జిల్లా కాంగ్రెస్ ప్రచార సమితి అధ్యక్షుడు జి.జనార్ధన్, నాయకులు సలీం, ఆనంద్, రామకృష్ణ, బాబు, హేమరాజ్, ఆదిత్య, ఆశా, రచనా తదితరులు పాల్గొన్నారు.