కమలోత్సాహం | Narendra Modi won full mejarti | Sakshi
Sakshi News home page

కమలోత్సాహం

Published Sat, May 17 2014 2:43 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

కమలోత్సాహం - Sakshi

కమలోత్సాహం

  •  మోడీ ప్రభంజనం
  •   28 స్థానాల్లో 17 కైవసం
  •   9 స్థానాల్లో కాంగ్రెస్ విజయం
  •   జేడీఎస్‌కు రెండు స్థానాలు
  •   ఓడిన ‘ఆధార్’ నందన్ నిలేకని
  •   డబుల్ హ్యాట్రిక్ సాధించిన అనంత
  •   ‘కోస్తా’పై మళ్లీ పట్టుసాధించిన కమలం
  • అనుకున్నట్లే జరిగింది. ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యాయి. రాష్ర్టంలో మోడీ హవా..  పార్టీలోకి యడ్డి, శ్రీరాములు రాకతో బీజేపీ విజయం సులభమైంది. అధికారంలో ఉన్నా కాంగ్రెస్ కేవలం తొమ్మిది సీట్లకే పరిమితమైంది. అయితే కేంద్ర మంత్రులు గట్టునపడ్డారు.    ఆధార్ ప్రాజెక్టు మాజీ చైర్మన్ నందన్ నిలేకనిపై  అనంత కుమార్ విజయం సాధించారు. రాష్ర్టంలో ఆప్ హవా కన్పించలేదు.
     
    సాక్షి ప్రతినిధి, బెంగళూరు : బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రభంజనం ముందు రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవి చూడాల్సి వచ్చింది. మొత్తం 28కు గాను 17 స్థానాల్లో బీజేపీ విజయ బావుటాను ఎగురవేసింది. అధికార కాంగ్రెస్ తొమ్మిది స్థానాలతో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. జేడీఎస్ రెండు స్థానాలకు పరిమితమైంది. బెంగళూరులోని మూడు స్థానాలనూ బీజేపీ నిలబెట్టుకుంది. గత నెల 16న పోలింగ్ జరుగగా, శుక్రవారం ఓట్ల లెక్కింపును చేపట్టారు.

    2009లో 19 స్థానాలను గెలుచుకున్న బీజేపీ, రెండు సీట్లను కోల్పోవాల్సి వచ్చింది. గత ఏడాది మే నెలలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన బీజేపీ, ఈ ఎన్నికల్లో విజయంతో కాంగ్రెస్‌పై ప్రతీకారాన్ని తీర్చుకున్నట్లయింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీలో పునఃప్రవేశించిన మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప శివమొగ్గ నుంచి 3,62,780 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు.

    మరో మాజీ ముఖ్యమంత్రి డీవీ. సదానంద గౌడ బెంగళూరు ఉత్తర నియోజక వర్గం నుంచి గెలుపొందారు. కేంద్ర మంత్రులు మల్లిఖార్జున ఖర్గే, కేహెచ్. మునియప్ప, వీరప్ప మొయిలీలు గెలుపు బాట పట్టారు. బళ్లారి నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగిన మాజీ మంత్రి బీ. శ్రీరాములు భారీ తేడాతో విజయం సాధించారు. హాసనలో మాజీ ప్రధాని హెచ్‌డీ. దేవెగౌడ తన ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి ఏ. మంజుపై లక్ష ఓట్లకు పైగా మెజారిటీతో గెలుపొందారు.
     
    పని చేయని ఐటీ మంత్రం

    బెంగళూరు దక్షిణ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన ఆధార్ ప్రాజెక్టు మాజీ చైర్మన్ నందన్ నిలేకని ఓటమి పాలయ్యారు. ఆయనపై బీజేపీ అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి అనంత కుమార్ ఘన విజయం సాధించారు. వరుసగా ఆయన ఆరో సారి గెలుపును సొంతం చేసుకున్నారు. ఈ నియోజక వర్గంలో పెద్ద సంఖ్యలో ఐటీ కంపెనీలున్నందున, ఆ ఉద్యోగుల ఓట్లన్నీ నిలేకనికి గంప గుత్తగా పడిపోతాయని ఆశించిన కాంగ్రెస్‌కు భంగపాటు ఎదురైంది. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు మినహా నిలేకనికి కాంగ్రెస్ నాయకుల నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందలేదు. ఆయన కార్పొరేట్ సంసృతి సాధారణ ఓటరుకు అంతగా నచ్చినట్లు లేదు. పైగా ఈ నియోజక వర్గం ఆది నుంచీ పెట్టని కోటలా ఉండడం, మోడీ మంత్రం పని చేయడంతో బీజేపీకి విజయం సునాయాసమైంది.


    కోస్తాపై మళ్లీ పట్టు : గత ఏడాది జరిగిన శాసన సభ ఎన్నికల్లో కోస్తా జిల్లాల్లో ఓటమి చవి చూసిన బీజేపీ ఈ ఎన్నికల్లో తిరిగి పట్టు సాధించింది. ఉత్తర, దక్షిణ కన్నడలతో పాటు ఉడిపి-చిక్కమగళూరు నియోజక వర్గంలో విజయ కేతనం ఎగురు వేసింది. మాజీ మంత్రి శోభా కరంద్లాజె ఉడిపి-చిక్కమగళూరు స్థానంలో తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ సిట్టింగ్ అభ్యర్థి జయప్రకాశ్ హెగ్డేపై లక్షా 81 వేల పైచిలుకు ఓట్లతో ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జనార్దన పూజారి దక్షిణ కన్నడ నియోజక వర్గంలో ఓటమి పాలయ్యారు. ఉత్తర కన్నడ స్థానంలో రాష్ర్ట ఉన్నత విద్యా శాఖ మంత్రి ఆర్‌వీ. దేశ్‌పాండే తనయుడు ప్రశాంత దేశ్‌పాండే ఓడిపోయారు.
     
    వరుస విజేతలు  :  లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు పీసీ. మోహన్ (బెంగళూరు సెంట్రల్), గద్దిగౌడర్ (బాగలకోటె), ప్రహ్లాద జోషి (ధార్వాడ) హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్నారు. కోలారు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కేంద్ర మంత్రి కేహెచ్. మునియప్ప వరుసగా ఏడో సారి గెలుపొందారు. బెంగళూరు దక్షిణ నియోజక వర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన అనంత కుమార్ వరుసగా ఆరో సారి విజయాన్ని సొంతం చేసుకున్నారు. దావణగెరె నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన జీఎం. సిద్ధేశ్వర్ వరుసగా నాలుగో సారి గెలుపు సాధించారు. బిజాపుర నుంచి అదే పార్టీ అభ్యర్థిగా గెలుపొందిన రమేశ్ జిగజిణగి వరుసగా ఐదో సారి ఎన్నికయ్యారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement