నేడు ప్రధాని రాక
- రాష్ర్టంలో మోడీ రెండు రోజుల పర్యటన
- ఘన స్వాగతానికి బీజేపీ ఏర్పాట్లు
- ప్రారంభానికి సిద్ధమైన ‘తుమకూరు ఫుడ్ పార్కు’
- మోడీ సభలో సిద్ధూకు వ్యతిరేకంగా నినాదాలు చేయొద్దని కార్యకర్తలకు బీజేపీ హెచ్చరిక
- మహారాష్ర్టలో చేదు అనుభవం దృష్ట్యా ఈ నిర్ణయం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్టంలో రెండు రోజుల పర్యటన కోసం ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం సాయంత్రం నగరానికి రానున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలకడానికి బీజేపీ నాయకులు సిద్ధమవుతుండగా, భారీ బందోబస్తు విధుల్లో పోలీసు శాఖ నిమగ్నమైంది. ప్రధాని సాయంత్రం ఆరు గంటలకు ఇక్కడి హెచ్‌ఏఎల్ విమానాశ్రయంలో దిగుతారు. ప్రధాని పదవిని చేపట్టిన తర్వాత రాష్ట్రానికి తొలిసారిగా వస్తున్నందున ఆయనకు ఘన స్వాగతం పలకడంతో పాటు భారీ ఎత్తున సన్మానించడానికి బీజేపీ ఏర్పాట్లు చేసుకుంటోంది.
20 వేల మందితో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ నాయకులు తొలుత నిర్ణయించినా, అంత మంది వస్తే బందోబస్తు కష్టమని ఎస్‌పీజీ వారించడంతో పది వేల మందికి పరిమితం చేశారు. కేంద్రంలో తొలి సారిగా బీజేపీ సొంతంగా అధికారంలోకి రావడం, దీనికి కారణం మోడీయేననే భావన సర్వత్రా వ్యాపించిన నేపథ్యంలో పార్టీ నాయకులతో పాటు కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలకాలని ఉత్సాహంతో ఉన్నారు.
సంప్రదాయ పద్ధతిలో ఆయనను మైసూరు పేట, శాలువలతో సత్కరిస్తున్నట్లు హెచ్‌ఏఎల్ విమానాశ్రయం వద్ద స్వాగత ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న మాజీ ఉప ముఖ్యమంత్రి ఆర్ అశోక్ తెలిపారు. ప్రధాని భద్రత దృష్ట్యా మూడు వేల మందికి ప్రత్యేక పాసులు ఇచ్చినట్లు చెప్పారు. విమానం నుంచి దిగిన వెంటనే ప్రధానికి స్వాగతం పలకడానికి 30 మందికి అవకాశం లభించిందని తెలిపారు. కేంద్ర మంత్రులు డీవీ సదానంద గౌడ, అనంత కుమార్, సిద్ధేశ్వర్, మాజీ ముఖ్యమంత్రులు యడ్యూరప్ప, జగదీశ్ శెట్టర్ ప్రభృతులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. ఇదే సందర్భంలో ప్రధాని 15 నుంచి 20 నిమిషాల పాటు కార్యకర్తలనుద్దేశించి ప్రసంగిస్తారని తెలిపారు. దీని కోసం వేదికను కూడా సిద్ధం చేశామన్నారు.
ఇస్రో సందర్శన
హెచ్‌ఏఎల్ విమానాశ్రయంలో కార్యక్రమం అనంతరం ప్రధాని నేరుగా రాజ్ భవన్‌కు వెళ్లి బస చేస్తారు. బుధవారం ఉదయం 6.45 గంటలకు పీణ్యాలోని ఇస్రో కేంద్రాన్ని సందర్శిస్తారు. అనంతరం తుమకూరుకు వెళ్లి అక్కడ నెలకొల్పిన ఫుడ్ పార్కును ప్రారంభిస్తారు. ఇక్కడ కూడా ప్రధానికి ఘన స్వాగతం పలకడానికి స్థానిక నాయకులు ఏర్పాట్లు చేశారు. సుమారు 20 వేల మంది కార్యకర్తలు పాల్గొనవచ్చని అంచనా.
కార్యకర్తలకు పార్టీ హెచ్చరిక
తుమకూరులో ప్రధాని సభలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా పాల్గొంటున్నందున, ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి నినాదాలు చేయవద్దని బీజేపీ రాష్ర్ట శాఖ కార్యకర్తలను హెచ్చరించింది. మహారాష్ర్టలో ఇలాంటి చేదు అనుభవం ఎదురైన నేపథ్యంలో అప్రమత్తమైన రాష్ట్ర శాఖ సీఎంకు ఇబ్బంది కలిగే విధంగా వ్యవహరించవద్దని సూచించింది. అలా చేస్తే పార్టీకి చెడ్డ పేరని హెచ్చరించింది. నిర్వాహకులు ముఖ్యమంత్రితో పాటు జిల్లా ఇన్‌చార్జి మంత్రి టీబీ జయచంద్రను ఆ కార్యక్రమానికి ఆహ్వానించారు. పార్టీ చిహ్నం, జెండాలను కూడా ప్రదర్శించవద్దని అశోక్ కార్యకర్తలకు సూచించారు.