- కావేరి నిర్వహణ మండలి ఏర్పాటుకు కేంద్రం కసరత్తు
- రాష్ట్ర బీజేపీ నేతల్లో కలవరం
- పాలక కాంగ్రెస్‌లో ఆందోళన
- మండలి ఏర్పాటుపై చర్చించేందుకు పీఎంతో భేటీకి సీఎం యత్నం
- రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని కర్ణాటకకు చెందిన కేంద్ర మంత్రులకు లేఖ
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో మళ్లీ కావేరి చిచ్చు రగులుతోంది. కావేరి నదీ జలాలను పరీవాహక రాష్ట్రాలు పంచుకునే విషయమై ట్రిబ్యునల్ వెలువరించిన తీర్పును అమలు చేయడానికి నిర్వహణా మండలిని ఏర్పాటు చేయాలని కేంద్రంలో కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించిందన్న వార్తలు రైతుల్లో కల్లోలాన్ని రేపుతున్నాయి.
ఈ పరిణామంతో రాష్ట్రంలో పాలక కాంగ్రెస్ ఆందోళన చెందుతుండగా, ఇటీవలే కేంద్రంలో తమ పార్టీకి పట్టం కట్టిన రాష్ట్ర ప్రజలకు ఇచ్చే కానుక ఇదేనా అని బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు సైతం కలవరం చెందుతున్నారు. మొత్తానికి నీటి నిర్వహణా మండలి ఏర్పాటు రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టు అని పార్టీలకతీతంగా అందరూ అంగీకరిస్తున్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మంగళవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని అభినందించిన సందర్భంగా కావేరి జల నిర్వహణా మండలి గురించి ప్రస్తావించారు. తదనంతరం చోటు చేసుకున్న పరిణామాల్లో దీనిపై ముసాయిదా కేబినెట్ నోట్ కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖకు వెళ్లినట్లు తెలియవచ్చింది. ఈ విషయం బయటకు పొక్కడంతో రాజకీయ పార్టీల్లో వణుకు ప్రారంభమైంది.
జల నిర్వహణ మండలి అంటే..
కావేరి జలాలను కర్ణాటకతో పాటు తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాలు పంచుకోవాల్సి ఉంది. ఒక్కో రాష్ట్ర వాటా ఎంతో తేలుస్తూ ఇదివరకే కావేరి ట్రిబ్యునల్ ఆదేశాలను వెలువరించింది. ఈ ఆదేశాలను కర్ణాటక పాటించడం లేదని తమిళనాడు ఆరోపిస్తోంది. తదనంతర పరిణామాల్లో సుప్రీం కోర్టు కావేరి జల నిర్వహణా మండలిని ఏర్పాటు చేయాలని సూచించింది. అయితే దీనిపై కర్ణాటక అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన వ్యాజ్యాలు సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి.
కావేరి జల నిర్వహణా మండలి ఏర్పాటైతే కావేరి నదితో పాటు ఉప నదులు, జలశయాలు మండలి ఆధీనంలోకి వెళ్లిపోతాయి. తదనంతరం రాష్ట్ర ప్రభుత్వం మాట కూడా చెల్లుబాటు కాదు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పుడు, జలాశయంలో నీటి నిల్వ తగ్గినప్పుడు ముందుగా ఆయకట్టు రైతుల ప్రయోజనాలను కాపాడాకే తమిళనాడుకు నీటిని వదులుతున్నారు. కొన్ని సందర్భాల్లో పరిమితంగానే తమిళనాడుకు నీరు వెళుతోంది. విపత్కర పరిస్థితుల్లో తమిళనాడు వాటాను ఎలా వదలగలమని కర్ణాటక ప్రశ్నిస్తోంది.
సర్వత్రా వ్యతిరేకత
కావేరి నిర్వహణా మండలిని ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలపై రాష్ట్ర ప్రభుత్వం
శుక్రవారం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కావేరి జల వివాదాల ట్రిబ్యునల్ తుది తీర్పుపై అనేక అప్పీళ్లు సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్నప్పుడు మండలిని ఎలా ఏర్పాటు చేస్తారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రశ్నించారు. మండలి ఏర్పాటుపై రాష్ట్రం విధానాన్ని తెలియజేయడానికి ఈ నెల 10న ప్రధాని అపాయింట్‌మెంట్‌ను కోరినట్లు శుక్రవారం ఇక్కడ విలేకరులకు తెలిపారు.
మండలి ఏర్పాటు విషయమై చర్చించడానికి సోమవారం శాసన సభా పక్షాల నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాష్ట్ర జల ప్రయోజనాలను కాపాడాల్సిందిగా రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు డీవీ. సదానంద గౌడ, అనంత కుమార్, వెంకయ్య నాయుడు, జీఎం. సిద్ధేశ్వర్‌లకు లేఖలు రాసినట్లు వెల్లడించారు.
కావేరి నీటి నిర్వహణా మండలిని ఏర్పాటు చేస్తే రాష్ట్ర ప్రయోజనాలు దారుణంగా దెబ్బ తింటాయని, బెంగళూరు నగరానికి కేఆర్‌ఎస్ నుంచి నీటి సరఫరా కష్టమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జల నిర్వహణా మండలిని ఏర్పాటు చేయాలని ఆదేశించాలంటూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీం కోర్టులో మధ్యంతర అర్జీని దాఖలు చేసిందని ఆయన తెలిపారు.