- కాంగ్రెస్‌కు 75 నుంచి 80 సీట్లకు మించి రావు
- ప్రధాని పదవిపై రాహుల్, సోనియా ఆశలు వదిలేసుకున్నారు
- శక్తివంతమైన భారత్ కోసం మోడీకి మద్దతివ్వండి
- మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప
దావణగెరె, న్యూస్‌లైన్ : కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో పరాజయం తప్పదనే భావనతోనే ప్రధాని మన్మోహన్ కొత్త ఇల్లు వెదుక్కునే పనిలో ఉన్నారని, ఇక ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా, రాహుల్ ప్రధాని పదవిపై ఆశ వదులుకున్నారని మాజీ సీఎం యడ్యూరప్ప ఎద్దేవా చేశారు. దేశభవిష్యత్తును నిర్ణయించే ఈ ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీకి పట్టం కట్టి శక్తివంతమైన భారత్ ఆవిష్కరణకు ఓటర్లు సహకరించాలని కోరారు.
దావణగెరె తాలూకా, ఆనగోడు గ్రామంలో బీజేపీ అభ్యర్థి జీఎం సిద్దేశ్వర్ తరఫున బుధవారం ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. సూర్యచంద్రులున్న మాట ఎంత వాస్తవమో ఈ ఎన్నికల తర్వాత నరేంద్ర మోడీ ప్రధాని కావడం కూడా అంతే సత్యమని జోష్యం పలికారు. కాంగ్రెస్ పార్టీ ఈసారి 75-80 కి మించి స్థానాల్లో గెలవలేదని అన్ని రకాల సర్వేలు చెబుతున్నాయన్నారు. మోడీ ప్రధాని అవుతారనే భావనతో యావత్ ప్రపంచం దృష్టి భారత్‌పైనే ఉందన్నారు.
మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం చెప్పినట్లుగా 2020 నాటికి భారతదేశం శక్తిమంతమైన దే శంగా ఎదగాలన్న కల నిజం కావాలంటే నరేంద్ర మోడీ ప్రధాని అయితేనే సాధ్యమన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఎస్‌ఏ రవీంద్రనాథ్, ప్రతిపక్ష ముఖ్య సచేతకులు డాక్టర్ ఏహెచ్ శివయోగిస్వామి, మాజీ ఎమ్మెల్యే బసవరాజ్ నాయక్, జిల్లా బీజేపీ అధ్యక్షుడు అణబేరు జీవనమూర్తి, ప్రొఫెసర్ ఎన్.లింగణ్ణ, జెడ్పీ సభ్యులు సహనా రవి, శారదా ఉమేష్ నాయక్, బీఎం సతీష్ తదితరులతో పా టు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
బీజేపీతోనే పేదల సంక్షేమం
సింధనూరు టౌన్: బీజేపీతోనే పేదల సంక్షేమం సాధ్యమని మాజీ ఎంపీ కే.విరుపాక్షప్ప పేర్కొన్నారు. తాలూకాలోని మాడసిరివార గ్రామంలో బుధవారం ఏర్పాటు చేసిన బీజేపీ ప్రచార కార్యక్రమంలో మాట్లాడారు. యూపీఏ పదేళ్లలో ఎలాంటి అభివృద్ధి చేపట్టలేదన్నారు. ఈ ఎన్నికల్లో నరేంద్ర మోడీకి పట్టం కట్టేందుకు కొప్పళ బీజేపీ అభ్యర్థి కరడి సంగణ్ణకు ఓట్లు వేసి గెలిపించాలని మనవి చేశారు. తాలూకా పంచాయతీ మాజీ సభ్యుడు హంసరాజ్, బీజేపీ వెనుకబడిన వర్గాల జిల్లా అధ్యక్షుడు ఎం.దొడ్డబసవరాజ్, జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.రంగనగౌడ గొరేబాళ, ఇంగళి శరణేగౌడ గొరేబాళ, ఫకీరప్ప హెడగినాళ, భీమప్ప, కరియప్ప హరేటనూరు, సిద్దప్ప మాడశిరివార తదితరులు పాల్గొన్నారు.