
అంబరీష్ ఆరోగ్యంగా ఉన్నారు : సుమలత
* రాష్ట్రవ్యాప్తంగా అంబి అభిమానుల పూజలు
*లండన్ నుంచి బయలుదేరిన కుమారుడు
* అంబిని పరామర్శించిన దేవెగౌడ, యడ్యూరప్ప, దర్శన్, మోహన్ బాబు
బెంగళూరు, న్యూస్‌లైన్ : శాండిల్‌వుడ్ రెబల్‌స్టార్, రాష్ట్ర మంత్రి అంబరీష్ ఆరోగ్యం కుదుటపడుతోందని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన సతీమణి, బహుభాష నటి సుమలత అన్నారు. ఆదివారం సుమలత విక్రమ్ ఆస్పత్రిలో వైద్యులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. అంబరీష్ ఆరోగ్యం విషమించిందని వస్తున్న వదంతులు నమ్మరాదని విజ్ఞప్తి చేశారు. శ్వాసకోశ సమస్యతో అంబరీష్ చికిత్స పొందుతున్నాడని, విక్రమ్ ఆస్పత్రి వైద్యులు సతీష్, రంగనాథ్, విజయ్, రఘు తదితరులు చికిత్స చేస్తున్నట్లు ఆమె తెలిపారు.
త్వరలో ఆయనను జనరల్ వార్డుకు మారుస్తామని వైద్యులు తెలిపారని సుమలత వివరించారు. అంబరీష్ ఐసీయులో వెంటిలేటర్‌తో ఉన్నందువల్ల మాట్లాడటానికి వీలు కావడం లేదని, ఆయన అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె తెలిపారు. మాజీ ప్రధాని హెచ్.డీ. దేవెగౌడ, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప, కన్నడ సినీనటుడు దర్శన్ తదితరులు ఆస్పత్రికి చేరుకుని అంబరీష్ ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఇదిలా ఉంటే అంబరీష్ ఆరోగ్యం కుదుటపడాలని బెంగళూరు నగరంతో సహ రాష్ట్ర వ్యాప్తంగా హోమాలు, పలు దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
లండన్ నుంచి బయలుదేరిన కుమారుడు
అంబరీష్, సుమలతల కుమారుడు అభిషేక్ లండన్‌లో ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్నాడు. తండ్రి అనారోగ్యం విషయం తెలుసుకున్న అతడు లండన్ నుంచి బెంగళూరు బయలుదేరాడు. సోమవారం అభిషేక్ బెంగళూరు చేరుకుంటారని అంబరీష్ సన్నిహితులు తెలిపారు.
అంబిని పరామర్శించిన మోహన్ బాబు
శ్వాసకోశ సంబంధ వ్యాధితో బాధపడుతూ విక్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అంబరీష్‌ను ప్రముఖ తెలుగు చలన చిత్ర నటుడు మోహన్‌బాబు, ఆయన కుమారుడు మంచు విష్ణు పరామర్శించారు. ఆదివారం నగరానికి చేరుకున్న వీరు నేరుగా ఆస్పత్రికి చేరుకుని అంబరీష్ ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అంబరీష్‌ను పరామర్శించిన వారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.