సాక్షి, బెంగళూరు : కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి, దివంగత నటుడు అంబరీష్ భార్య సుమలత పొలిటికల్ ఎంట్రీ గురించి కొన్ని రోజులుగా చర్చ నడుస్తోంది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే అంబరీష్ దూరమైన విషాదం నుంచి ఇంకా కోలుకోనప్పటికీ.. ప్రజల ఒత్తిడి మేరకు తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆమె పేర్కొన్నారు. ఈ క్రమంలో తన భర్త అంబరీష్ ప్రాతినిథ్యం వహించిన మాండ్య పార్లమెంట్ స్థానం నుంచే ఎన్నికల బరిలో దిగాలని ఆమె భావిస్తున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ తరపున టికెట్ ఆశిస్తున్నారు. అయితే కర్ణాటకలో జేడీఎస్- కాంగ్రెస్ కూటమి అధికారం పంచుకుంటోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సీట్ల సర్దుబాటు విషయమై మాండ్య స్థానాన్ని జేడీఎస్‌కు కేటాయించే అవకాశం ఉందని కాంగ్రెస్ కీలక నేత, మంత్రి డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని సుమలత పేర్కొన్నారు. ఈ క్రమంలో ‘మీకు పరోక్షంగా మద్దతు ఇస్తామ’ని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సుమలతకు ఫోన్ చేసి చెప్పినట్లు సమాచారం.(సర్జికల్ స్ట్రైక్స్‌పై మాట్లాడను.. ఆమెకు టికెట్ కష్టమే!)
కాగా సుమలత భర్త అంబరీష్ మాండ్య జిల్లాలోనే జన్మించారు. 1994లో రాజకీయాల్లో అడుగు పెట్టిన ఆయన సొంత నియోజకవర్గం నుంచే కాంగ్రెస్ తరపున ఎంపీగా గెలుపొందారు. 1998, 99, 2004లో మాండ్యకు ప్రాతినిథ్యం వహించారు. నటుడిగా, సమాజ సేవకుడిగా కీర్తి ప్రతిష్టలు సంపాదించిన అంబరీష్‌కు జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చరిష్మా ఉంది. ఈ నేపథ్యంలో మాండ్య నుంచి పోటీ చేస్తే సుమలత తప్పక గెలుస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే మాజీ ప్రధాని దేవెగౌడ మనుమడు, కర్ణాటక సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామి(కన్నడ నటుడు) రాజకీయ ప్రవేశం చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కూడా మాండ్య నుంచే పోటీచేయాలని భావిస్తున్నారు. ఒకవేళ నిఖిల్ బరిలో దిగితే సుమలతకు టికెట్ రాదనే విషయం సుస్పష్టమే. ఈ నేపథ్యంలో సుమలత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే మద్దతు ఇస్తామని బీజేపీ లీకులివ్వడంతో మాండ్యలో పోరు రసవత్తరంగా మారనుంది. (బరిలో మనవళ్లు.. ఢీ అంటే ఢీ?!)
Comments
Please login to add a commentAdd a comment