nikhil kumara swamy
-
ఓడినా ప్రజలకు అందుబాటులో ఉంటా
దొడ్డబళ్లాపురం:ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన తాను ఇంట్లో కూర్చునే రకం కాదని, ప్రజలకు అందుబాటులో ఉంటానని నిఖిల్ కుమారస్వామి అన్నారు. గురువారం చెన్నపట్టణలో మాట్లాడిన నిఖిల్ ఎన్నికలు అన్నాక ఎవరో ఒకరు గెలవాలన్నారు. ఈరోజు తాను ఓటమిపాలైనా ఏదో ఒకరోజు గెలిచితీరుతానని, అప్పటి వరకూ కార్యకర్తలకు అండగా ఉంటానన్నారు. అయినా చెన్నపట్టణలో కుమారస్వామిని గెలిపించడం సంతోషంగా ఉందన్నారు. రామనగరలో తనకు 76 వేల ఓట్లు వచ్చాయని, తాను టెక్నికల్‌గా ఓడిపోయినా అంతమంది జనం తనతో ఉన్నారన్నారు. కాంగ్రెస్ వాళ్లు రాత్రికి రాత్రి అమాయక ప్రజలకు కూపన్ ఓచర్లు పంపిణీ చేసి ఓటర్లను ప్రలోభపెట్టారన్నారు. తన కుటుంబం అధికారం ఉన్నా, లేకపోయినా ప్రజలకు సేవలందిస్తాం అన్నారు. -
నిఖిల్ పెళ్లిపై నివేదిక ఇవ్వండి
సాక్షి, బెంగళూరు: మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి తనయుడు నిఖిల్ వివాహ వేడుకపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కర్ణాటక హైకోర్టు ఆదేశించింది. లాక్డౌన్ సమయంలో నిఖిల్ వివాహం (ఏప్రిల్ 17) సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించినట్లు విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. దీనిపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు అయింది. పెళ్లి కోసం ఎన్ని వాహనాలకు పాస్‌లు ఇచ్చారు. ఎంతమంది అతిథులు పాల్గొన్నారు. భౌతిక దూరం పాటించారా లేదా అనేది తెలపాలంటూ గత నెల 21నాటికి నివేదిక ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చినా... ప్రభుత్వం ఇంతవరకూ సమాధానం ఇవ్వలేదు. పెళ్లికి ఇచ్చిన పాస్‌లను దుర్వినియోగం చేశారని పిటిషనర్ ఆరోపించడంతో... దీనిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో మే 5లోపు నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. (ఇదేం పెళ్లి తంతు.. ఇప్పుడు అవసరమా!) మరోవైపు లాక్డౌన్ నిబంధనలను గాలికి వదిలి మాజీ ఎమ్మెల్యే కొడుకు పెళ్లి వైభవంగా జరిగింది. చిత్రదుర్గ జిల్లా హొసదుర్గ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకుడు బీజీ గోవిందప్ప తనయుని వివాహం బేలూరులో జరిపారు. ఈ వేడుకకు పెద్దసంఖ్యలో అతిథులు రావడం, కనీస దూరం, మాస్కులు లేకుండా హాజరు అయ్యారు. దీంతో ప్రజలకు ఒక చట్టం, పెద్దలకు మరో చట్టమా? అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. (నిఖిల్ పెళ్లి సింపుల్‌గా జరిగింది: యడియూరప్ప) -
నిఖిల్ పెళ్లి సింపుల్‌గా జరిగింది: యడియూరప్ప
బెంగళూరు : మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు, శాండల్‌వుడ్ హీరో నిఖిల్ గౌడ వివాహంపై వెల్లువెత్తుతున్న విమర్శలపై ముఖ్యమంత్రి యడియూరప్ప మరోసారి స్పందించారు. కుమారస్వామి కుటుంబాన్ని వెనకేసుకొచ్చారు. శనివారం కరోనా వైరస్‌పై జరిగిన చర్చలో ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ‘‘పెళ్లి జరపటానికి కావాల్సిన అన్ని అనుమతులు వారు తీసుకున్నారు. పెళ్లిని కూడా చాలా సింపుల్‌గా జరిపించారు. దాని గురించి చర్చలు అనవసరం. వారి పరిధిలో వారు చాలా చక్కగా చేశారు, దానికి నేను శుభాకాంక్షలు తెలుపుతున్నా’నని అన్నారు. కాగా, నిఖిల్ కుమార స్వామి-రేవతిల పెళ్లి శుక్రవారం రామనగరకు సమీపంలోని కేతగానహళ్లిలోని ఫాంహౌస్‌లో జరిగిన సంగతి తెలిసిందే. ( ఇదేం పెళ్లి తంతు.. ఇప్పుడు అవసరమా! ) కరోనా లాక్డౌన్ కారణంగా ముఖ్యులైన కొద్దిమద్ది అతిధుల మధ్యే ఈ వివాహ వేడుక జరిగింది. అయితే ఈ పెళ్లి వేడుకకు హాజరైన అతిధుల్లో ఎవరూ కూడా మాస్క్‌లు ధరించకపోవటం, సామాజిక దూరాన్ని పాటించపోవటం చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియా వేదికగా రచ్చ జరుగుతున్న వేళ స్పందించిన ముఖ్యమంత్రి యడియూరప్ప ఈ సంఘటనపై విచారణ జరిపించాలని ఆదేశించారు. అయితే ఈ వివాహ వేడుకకు హాజరైన కొద్దిమంది ముఖ్యుల్లో సీఎం యడియూరప్ప కూడా ఉండటం గమనార్హం. -
నిఖిల్ పెళ్లిపై విచారణకు ప్రభుత్వం ఆదేశం
-
మే 3కల్లా కరోనా కేసులు తగ్గే అవకాశం..
-
నిఖిల్ పెళ్లిపై వివాదం: విచారణకు సీఎం ఆదేశం
సాక్షి, బెంగళూరు : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి కుమారుడు నిఖిల్ వివాహ వేడుకపై వివాదం నెలక్కొంది. కరోనా వైరస్ నేపథ్యంలో అందరూ సామాజిక దూరం పాటించాలన్న ప్రభుత్వ ఆదేశాలకు కనీసం పాటించకుండా వివాహం జరిపించారని అధికార బీజేపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో వివాహ వేడుకపై విచారణ జరిపించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఆదేశించారు. కాగా బెంగళూరు సమీపంలోని రాంనగర్‌లోని ఫాంహౌస్‌లో నిఖిల్ కుమార స్వామి-రేవతిల పెళ్లి శుక్రవారం ఉదయం జరిగిన విషయం తెలిసిందే. వధువరులతో పాటు ఎవరూ కూడా ముఖానికి మాస్క్‌లు ధరించినట్లు కనిపించట్లేదు. ఈ వివాహానికి వందలాది మంది అతిథులు వచ్చారని పలువురు సోషల్ మీడియా వేదికగా ఆరోపిస్తున్నారు. (నిరాడంబరంగా మాజీ సీఎం ఇంట పెళ్లి) ఇక దీనిపై కేంద్రహోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి కూడా విమర్శలు గుప్పించారు. వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో ఎలాంటి భద్రతలేకుండా వివాహం వేడుకలేంటని అసహనం వ్యక్తం చేశారు. ఆదర్శంగా ఉండాల్సిన మాజీ ప్రధాని దేవెగౌడ , మాజీ సీఎం కుమారస్వామి లాక్డౌన్ సమయంలో పెళ్లి చేయడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. కాగా పెళ్లి వేడుకకు ముఖ్యమంత్రి యడియూరప్ప కూడా హాజరుకావడం గమనార్హం. కుమారస్వామితో కరచాలనం చూస్తూ సీఎం ఫోటోలకు పోజులిచ్చారు. మరోవైపు రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పూర్తిగా అదుపులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 359గా నమోదైంది. శుక్రవారం తాజాగా 44 పాజిటివ్ కేసులు వెలుగుచూసినట్లు వైద్యశాఖ అధికారులు వెల్లడించారు. కరోనా కట్టడికి ప్రభుత్వ అధికారులు కఠిన చర్యలు అమలు చేస్తున్నారు. -
నిఖిల్ పెళ్లిపై స్పందించిన కిషన్ రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు సంఖ్య వచ్చే నెల 3వ తేదీకల్లా తగ్గే అవకాశం ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా కరోనా కేసులు కమ్యూనిటీ వ్యాప్తి జరగలేదని, నిజాముద్దీన్ తబ్లీగ్ జమాత్ కార్యక్రమం వల్లే 58శాతం కేసులు వచ్చాయన్నారు. లాక్డౌన్ కారణంగా నిలిచిపోయిన కూలీలు ఎక్కడివారు అక్కడే ఉండాలన్నారు. కూలీలకు ఆహారం, దుస్తుల కోసం కేంద్రం తగిన నిధులు పంపించిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు రూ.500 కోట్లు, తెలంగాణకు రూ.280 కోట్లు పంపించినట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. (లాక్డౌన్ వేళ దేవుడి రథోత్సవం!) అలాగే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమారస్వామి పెళ్లిలో లాక్డౌన్ నిబంధనలను తుంగలో తొక్కిన విషయం తెలిసిందే. వివాహ తంతుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందిస్తూ...ఆదర్శంగా ఉండాల్సిన మాజీ ప్రధాని దేవెగౌడ , మాజీ సీఎం కుమారస్వామి లాక్డౌన్ సమయంలో పెళ్లి చేయడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. ఈ విపత్కర సమయంలో పెళ్లిళ్లు వాయిదా వేసుకుంటే మంచిదన్నారు. కరోనాపై కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం 20మందిని మించి గుమికూడదన్న విషయాన్ని గుర్తు చేశారు. పదిమందికి ఆదర్శంగా ఉండాల్సిన వారే నిబంధనలు ఉల్లంఘించడం దురదృష్టకరమన్నారు. (ఇదేం పెళ్లి తంతు.. ఇప్పుడు అవసరమా! ) తన తల్లి సంవత్సరికం కార్యక్రమాన్ని కూడా ఆన్లైన్ ద్వారా తాను ఒక్కడినే నిర్వహించుకున్నానని, లాక్డౌన్ నిబంధలు ప్రజా ప్రతినిధులే ఉల్లంఘిస్తే ఎలా అంటూ ప్రశ్నించారు. కరోనాను అరికట్టేందుకు లాక్డౌన్ శరణ్యమని ప్రపంచమంతా చెబుతోందన్నారు. అయితే రాహుల్ గాంధీ మాత్రం విచిత్రంగా మాట్లాడుతున్నారంటూ విమర్శించారు. టెస్టుల ద్వారా కరోనా తగ్గుతుందని చెప్పడం హాస్యాస్పదమన్నారు. రాహుల్‌ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‌కు చైర్మన్‌గా చేస్తే బాగుంటుందని ఎద్దేవా చేశారు. (లాక్డౌన్ ఉల్లంఘించి.. ఎమ్మెల్యే బర్త్‌డే పార్టీ) ఇక రైతులు పండించిన కూరగాయలు, పండ్లు ఢిల్లీకి రవాణా చేసేందుకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు కిషన్ రెడ్డి చెప్పారు. దీని కోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేశామని, పండ్లు, కూరగాయల రవాణలో సమస్యలు ఉంటే సహాయం కోసం కాల్ సెంటర్ నెంబర్: 18001804200 & 14488 కు ఫోన్ చేయాలని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. (4 నిమిషాల్లో మూడుముళ్లు) -
కరోనా: నిఖిల్ పెళ్లిపై సీరియస్
-
ఇదేం పెళ్లి తంతు.. ఇప్పుడు అవసరమా!
సాక్షి, బెంగళూరు : మాజీ సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమార స్వామి-రేవతిల పెళ్లి సందర్భంగా లాక్డౌన్ నిబంధనలను తుంగలో తొక్కారు. కరోనా మహమ్మారి నివారణకు భౌతిక దూరం పాటించాలని ప్రధాని నుంచి క్రిందిస్థాయి అధికారుల వరకు మొత్తుకుంటున్నా దేవెగౌడ కుటుంబ పట్టించుకోలేదు. పెళ్లికి పెద్ద ఎత్తున బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు. వీరంతా ఏమాత్రం భౌతిక దూరం పాటించకుండా గుమిగూడి పెళ్లిని తిలకరించారు. వధువరులతో పాటు ఎవరూ కూడా ముఖానికి మాస్క్‌లు ధరించకపోవడం గమనార్హం. శానిటైజర్లు వాడారో, లేదో తెలియదు. లాక్డౌన్ నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ పెళ్లిపై కర్ణాటక ప్రభుత్వం స్పందించింది. విచారణకు ఆదేశించినట్టు ఉప ముఖ్యమంత్రి అశ్వత్నారాయణ తెలిపారు. రామనగర డిప్యూటీ నుంచి నివేదిక కోరినట్టు చెప్పారు. కలెక్టర్, ఎస్పీతో కూడా మాట్లాడానని చెప్పారు. వ్యవస్థను అపహాస్యం చేసేలా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకుంటామని, ఇందులో రెండో ఆలోచనకు తావులేదన్నారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన కుమారస్వామికి నిబంధనలు పాటించాలన్న విచక్షణ లేకపోవడం దారుణమని విమర్శించారు. నిఖిల్ కుమార స్వామి-రేవతిల పెళ్లిపై సోషల్ మీడియాలో నెటిజనులు మండిపడుతున్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఈ పెళ్లి తంతు అవసరమా అంటూ ప్రశ్నిస్తున్నారు. చదవండి: మాజీ సీఎం ఇంట పెళ్లి -
నిరాడంబరంగా మాజీ సీఎం ఇంట పెళ్లి
సాక్షి, బెంగళూరు : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమార స్వామి-రేవతిల పెళ్లి శుక్రవారం రామనగరకు సమీపంలోని కేతగానహళ్లిలోని ఫాంహౌస్‌లో జరిగింది. గురువారం నుంచే బెంగళూరులో వధువు, వరుడి నివాసంలో సందడి నెలకొంది. అంగరంగ వైభవంగా నిర్వహించాలని అనుకున్నా కరోనా లాక్డౌన్ అడ్డు వచ్చింది. పెళ్లికి తక్కువ సంఖ్యలో ఇరు కుటుంబాల పెద్దలు హాజరయ్యారు. -
వారసులొచ్చారు..
సాక్షి బెంగళూరు/చెన్నై: రాజకీయ పార్టీల్లో ఒకే కుటుంబం పెత్తనం తరాలపాటు కొనసాగుతుందనడానికి తాజా సాక్ష్యాలివి. కర్ణాటకలో మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్..తమిళనాట మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మనవడు, ప్రస్తుత డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ తనయుడు ఉదయనిధి తమ పార్టీల యువజన విభాగం బాధ్యతలు స్వీకరించారు. తద్వారా వీరు భవిష్యత్ పార్టీ అధినేతలు, ముఖ్యమంత్రుల జాబితాలో చేరిపోయారు. కర్ణాటకలో ప్రస్తుతం కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా జేడీఎస్ రాష్ట్ర కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎమ్మెల్యే హెచ్‌కే కుమారస్వామిని నియమించిన అధిష్టానం, యువజన విభాగం అధ్యక్ష బాధ్యతలను సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్‌ను అప్పగించింది. నిఖిల్ ఇటీవలి ఎన్నికల్లో మాండ్య లోక్‌సభ స్థానం నుంచి పోటీకి దిగి సినీనటి సుమలత చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ మేరకు జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడ ఒక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా దేవెగౌడ మాట్లాడుతూ.. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం మనుగడ కాంగ్రెస్‌పైనే ఆధారపడి ఉందన్నారు. కాంగ్రెస్ నేతలు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే ప్రభుత్వానికి ఎలాంటి ఢోకాలేదని తెలిపారు. తమిళనాడులో.. డీఎంకే చీఫ్ స్టాలిన్ తనయుడు, సినీ నటుడు ఉదయనిధి(42)ని పార్టీ యువజన విభాగం కార్యదర్శిగా నియమిస్తూ స్టాలిన్ ఒక ప్రకటన చేశారు. దాదాపు 35 ఏళ్లపాటు ఈ పదవిలో స్టాలిన్ పనిచేశారు. ప్రస్తుతం మురసోలి ట్రస్ట్‌కు ఉదయనిధి ఎండీగా వ్యవహరిస్తున్నారు. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలోనే కరుణానిధి స్థాపించిన మురసోలి పత్రిక నడుస్తోంది. ఉదయనిధి ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ తరఫున విస్తృతంగా ప్రచారం చేశారు. తాజా నియామకంతో కరుణకుటుంబంలోని నాల్గోవ్యక్తికి పార్టీలో కీలక పదవి దక్కినట్లయింది. -
కనుమరుగవుతున్న విపక్షాల కూటమి!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రతిపక్ష పార్టీల మధ్య లోక్‌సభ ఎన్నికలకు ముందున్న ఆ కాస్త ఐక్యత ఫలితాల అనంతరం క్రమంగా కనుమరుగవుతోంది. ఉత్తరప్రదేశ్ లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన ఎస్పీ, బీఎస్పీలు రానున్న 11 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో విడి విడిగా పోటీ చేస్తుండడం, ఈ విషయాన్ని బీఎస్పీ నాయకురాలు మాయావతి పత్రికా ముఖ్యంగా మరీ ప్రకటించడం తెల్సిందే. కలిసికట్టుగా పోటీ చేసినా అత్యధిక సీట్లను బీజేపీ తన్నుకుపోవడం నుంచి వచ్చిన నైరాశ్యంతో మాయావతి ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చు. తెలంగాణాలో మళ్లీ బలపడే అవకాశం ఉందన్న కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోతుండడం, 18 మంది ఆ పార్టీ ఎమ్మెల్యేలకుగాను 12 మంది తమ పక్షాన్ని టీఆర్ఎస్లో చేర్చుకోవాల్సిందిగా కోరడం ప్రతిపక్షాలకు బాధాకరమైన పరిణామమే. బీజేపీ అధికారంకి రాకుండా ఉంచేందుకు కర్ణాటకలో ఏకమై సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ, జనతాదళ్ (సెక్యులర్) పార్టీలకు ఇప్పటికీ కంటి మీద కునుకు లేకుండా పోయింది. తమ పక్షం నుంచి ఎప్పుడు ఎవరు జారుకుంటారో, ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుందో అన్న ఆందోళన ఆ పార్టీల నాయకులను పట్టి పీడిస్తోంది. సాధారణ కేబినెట్ విస్తరణ చేయడానికే వారు భయపడి పోవడం, అప్పుడే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాల్సిందిగా పార్టీ కార్యకర్తలను స్వయాన ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామి పిలుపునివ్వడం పరిస్థితిని తెలియజేస్తోంది. ప్రతిపక్షానికి సుదీర్ఘకాల వ్యూహం లేకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితులు దాపురిస్తున్నాయని అర్థం అవుతోంది. ఎన్నికల ముందు తాత్కాలికంగా ఒక్కటై పోటీ చేయడం వల్ల తాత్కాలిక ఫలితాలు ఉండొచ్చేమోగానీ ఆశించిన ఫలితాలు మాత్రం ఎప్పటికీ రావు. అవి రావాలంటే ముందు, ఆ తర్వాత బలమైన ఐక్యతనే ప్రదర్శించాలి. అందుకు బలమైన సాక్ష్యం కూడా మొన్నటి తమిళనాడు లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే అత్యధిక సీట్లను గెలుచుకోవడం. ఎన్నికల అనంతం కూడా డీఎంకే మిత్రపక్షాలు గట్టి ఐక్యతను చాటాయి. హిందీయేతర రాష్ట్రాలపై హిందీని రుద్దవద్దని గట్టిగా నినదించడంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ‘నేషనల్ ఎలిజబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్’ వల్ల తమ రాష్ట్రం విద్యార్థులకు అన్యాయం జరుగుతోందన్న విషయంలో కూడా వారు ఐక్యతా బలాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రతిపక్షాల ఐక్యతకు మొదట్లో కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ అప్పుడే కాడి పడేయకుండా బీజేపీకి ఎప్పటికప్పుడు చెక్ పెట్టడానికి ప్రతిపక్షాలను ఎల్లప్పుడు ఏకతాటిపైకి తీసుకురావాలి, అందుకు ఎప్పుడూ కృషి చేయాల్సిందే. లేకపోతే ఆ పార్టీకి మనుగడే ఉండదు. -
అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధంగా ఉండండి!
బెంగళూరు : లోక్‌సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కుమారస్వామి సంకీర్ణ ప్రభుత్వం మరోసారి ఇబ్బందుల్లో పడిన సంగతి తెలిసిందే. కర్ణాటకలో మొత్తం 28 లోక్‌సభ స్థానాలకు గానూ 25 సీట్లు గెలుచుకున్న బీజేపీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. అంతేకాదు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ దిగ్గజ నేతలు సహా జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ కూడా దారుణ ఓటమి చవిచూశారు. తన కుమారుడు నిఖిల్‌ను రంగంలోకి దింపిన సీఎం కుమారస్వామికి కూడా చేదు అనుభవమే ఎదురైంది. ఈ నేపథ్యంలో ఓటమి గల కారణాల విశ్లేషణలో భాగంగా జేడీఎస్-కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయన్న వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ క్రమంలో నిఖిల్ కుమారస్వామి జేడీఎస్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడినట్లుగా ఉన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఎన్నికలకు సిద్ధంగా ఉండండి.. ‘ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చు. సిద్ధంగా ఉండండి. వాటి కోసం ఇప్పటి నుంచే మనం కసరత్తు మొదలుపెట్టాలి. అలసత్వం పనికి రాదు. వచ్చే నెల నుంచి కార్యాచరణ ప్రారంభించాలి. ఏడాదిలోపే లేదా మరో రెండు, మూడేళ్ల తర్వాత ఎన్నికలు రావొచ్చు. జేడీఎస్ కార్యకర్తలంతా ఇందుకు సన్నద్ధంగా ఉండాలి’ అని నిఖిల్ కుమారస్వామి తమ పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రెండురోజుల క్రితం మండ్యలో కార్యకర్తలతో సమావేశమైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను సునీల్ గౌడ అనే కార్యకర్త వాట్సాప్‌లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియోలో ఉన్నది నిఖిల్ గొంతేనా లేదా అన్న విషయంపై మాత్రం స్పష్టత లేదు. ఇక జేడీఎస్ రాష్ట్ర చీఫ్‌గా ఉన్న ఏహెచ్ విశ్వనాథ్ రాజీనామ చేసిన అనంతరం నిఖిల్ ఈవిధంగా వ్యాఖ్యానించడం గమనార్హం. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాభవానికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకే నిఖిల్ వారితో సమావేశమైనట్లుగా తెలుస్తోంది. కాగా మండ్య నుంచి తొలిసారిగా ఎన్నికల బరిలో దిగిన నిఖిల్.. స్వతంత్ర అభ్యర్థి సుమలతా అంబరీష్ చేతిలో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. -
సుమలతను ఓడించేందుకు ఇన్నికుట్రలా?!
సాక్షి, బెంగళూరు : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు విమర్శలు- ప్రతివిమర్శలతో దూకుడు పెంచుతున్నాయి. ఎలాగైనా విజయం దక్కించుకోవాలనే కసితో వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కర్ణాటకలోని మండ్య పార్లమెంట్ స్థానంలో ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. ఎందుకంటే ఇక్కడి నుంచే సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ తొలిసారి పోటీ చేస్తుండగా.. దివంగత నటుడు, కేంద్ర మంత్రి అంబరీష్ భార్య సుమలత కూడా ఇక్కడి నుంచే బరిలో దిగుతున్నారు. అయితే కాంగ్రెస్-జేడీఎస్ కూటమి పొత్తులో భాగంగా సుమలతకు కాంగ్రెస్ అధిష్టానం మొండిచేయి చూపడంతో ఆమె స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమెకు మద్దతుగా నిలుస్తామంటూ బీజేపీ ముందుకొచ్చింది. దీంతో సుమలత- నిఖిల్ల మధ్య మాత్రమే ప్రధాన పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్- జేడీఎస్ నాయకుల మధ్య భేదాభిప్రాయాల కారణంగా నిఖిల్ గెలుపుపై అనుమానాలు నెలకొన్నాయి. దీంతో కుమారుడి కోసం రంగంలోకి దిగిన సీఎం కుమారస్వామి సుమలతను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ విమర్శలకు దిగుతున్నారు. భర్త చనిపోయిన బాధ ఆమె ముఖంలో ఏమాత్రం కనిపించడం లేదని.. ఏదో నాటకీయంగా సినిమా డైలాగ్‌లు చెబుతూ ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో విమర్శలకు సమాధానం చెబుతూనే సుమలత తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. అయితే ఆమెను ఓడించేందుకు అధికార పార్టీ మరో ఎత్తుగడకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. సుమలత పేరుతో మరో ముగ్గురు మహిళలు.. అది కూడా కుమారస్వామి సామాజిక వర్గానికి చెందిన వారు మండ్య స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయడం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. తద్వారా సుమలతకు పడే ఓట్లను చీల్చాలనేదే వీరి ప్రధాన ఉద్దేశంగా కనపడుతోంది.(చదవండి : సుమలతపై కుమారస్వామి ఘాటు విమర్శలు) ఇలా చేస్తారని ముందే తెలుసు.. సుమలత అంబరీష్ దాఖలు చేసిన అఫిడవిట్లో భాగంగా తాను ఎస్ఎస్ఎల్సీ పాసయ్యానని పేర్కొన్నారు. కాగా ఎం. సుమలత(భర్త పేరు- మంజె గౌడ) విద్యార్హత ఎనిమిదో తరగతిగా పేర్కొనగా, సుమలత(భర్త పేరు- సిద్దె గౌడ) ఏడో తరగతి వరకు చదివినట్లుగా పేర్కొన్నారు. వీరితో పాటుగా మరో సుమలత(భర్త పేరు- కె.దర్శన్) పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినట్లుగా అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇక సుమలతా అంబరీష్ తరఫున దర్శన్ అనే నటుడు ప్రచారం చేస్తుండటం గమనార్హం. ఈ విషయం గురించి సుమలతా అంబరీష్ మాట్లాడుతూ..‘ వాళ్లు ఇలాంటి గిమ్మిక్కులకు పాల్పడతారని ముందే తెలుసు. నన్ను ఓడించడానికి వారు వేసిన ఎత్తుగడ. నేను కూడా వారిలా చేయవచ్చు కానీ అది నాకు నచ్చదు. నేరుగా, న్యాయంగా ‘యుద్ధం’ చేసి గెలవాలనుకుంటున్నా. వాళ్లలా దొంగచాటు రాజకీయాలు నాకు చేతకావు అని వ్యాఖ్యానించారు. (చదవండి : నా భర్త ఆత్మకు శాంతి చేకూరాలంటే నిఖిల్‌కు ఓటు వేయాలా?!) కాగా 1994లో రాజకీయాల్లో అడుగు పెట్టిన అంబరీష్ సొంత నియోజకవర్గం మండ్య నుంచే కాంగ్రెస్ తరపున ఎంపీగా గెలుపొందారు. 1998, 99, 2004లో అక్కడి నుంచి ప్రాతినిథ్యం వహించారు. నటుడిగా, సమాజ సేవకుడిగా కీర్తి ప్రతిష్టలు సంపాదించిన అంబరీష్‌కు జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చరిష్మా ఉంది. అంబరీష్ మరణం తర్వాత సుమలత ఎన్నికల్లో పోటీ చేయాలంటూ అభిమానులు ఒత్తిడి చేయగా ఆమె ముందుకు వచ్చారు. అయితే కాంగ్రెస్ టికెట్ నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దీంతో కొడుకు గెలుపు కోసం కుమారస్వామి సహా ఆయన అనుచరవర్గం రంగంలోకి దిగడంతో.. ‘ఒక మహిళను ఓడించేందుకు ఏకంగా సీఎం స్థాయి వ్యక్తి, మంత్రులు ఆమెపై చవకబారు విమర్శలకు దిగుతున్నారు. వాళ్ల మాటలు వింటుంటే ఇప్పటికే సుమలత సగం విజయం సాధించినట్లుగా అన్పిస్తుంది’ అని విశ్లేషకులు భావిస్తున్నారు. -
సుమలత కీలక వ్యాఖ్యలు..!
సాక్షి, బెంగళూరు : కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి, దివంగత నటుడు అంబరీష్ భార్య సుమలత పొలిటికల్ ఎంట్రీ గురించి కొన్ని రోజులుగా చర్చ నడుస్తోంది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే అంబరీష్ దూరమైన విషాదం నుంచి ఇంకా కోలుకోనప్పటికీ.. ప్రజల ఒత్తిడి మేరకు తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆమె పేర్కొన్నారు. ఈ క్రమంలో తన భర్త అంబరీష్ ప్రాతినిథ్యం వహించిన మాండ్య పార్లమెంట్ స్థానం నుంచే ఎన్నికల బరిలో దిగాలని ఆమె భావిస్తున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ తరపున టికెట్ ఆశిస్తున్నారు. అయితే కర్ణాటకలో జేడీఎస్- కాంగ్రెస్ కూటమి అధికారం పంచుకుంటోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సీట్ల సర్దుబాటు విషయమై మాండ్య స్థానాన్ని జేడీఎస్‌కు కేటాయించే అవకాశం ఉందని కాంగ్రెస్ కీలక నేత, మంత్రి డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని సుమలత పేర్కొన్నారు. ఈ క్రమంలో ‘మీకు పరోక్షంగా మద్దతు ఇస్తామ’ని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సుమలతకు ఫోన్ చేసి చెప్పినట్లు సమాచారం.(సర్జికల్ స్ట్రైక్స్‌పై మాట్లాడను.. ఆమెకు టికెట్ కష్టమే!) కాగా సుమలత భర్త అంబరీష్ మాండ్య జిల్లాలోనే జన్మించారు. 1994లో రాజకీయాల్లో అడుగు పెట్టిన ఆయన సొంత నియోజకవర్గం నుంచే కాంగ్రెస్ తరపున ఎంపీగా గెలుపొందారు. 1998, 99, 2004లో మాండ్యకు ప్రాతినిథ్యం వహించారు. నటుడిగా, సమాజ సేవకుడిగా కీర్తి ప్రతిష్టలు సంపాదించిన అంబరీష్‌కు జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చరిష్మా ఉంది. ఈ నేపథ్యంలో మాండ్య నుంచి పోటీ చేస్తే సుమలత తప్పక గెలుస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే మాజీ ప్రధాని దేవెగౌడ మనుమడు, కర్ణాటక సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామి(కన్నడ నటుడు) రాజకీయ ప్రవేశం చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కూడా మాండ్య నుంచే పోటీచేయాలని భావిస్తున్నారు. ఒకవేళ నిఖిల్ బరిలో దిగితే సుమలతకు టికెట్ రాదనే విషయం సుస్పష్టమే. ఈ నేపథ్యంలో సుమలత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే మద్దతు ఇస్తామని బీజేపీ లీకులివ్వడంతో మాండ్యలో పోరు రసవత్తరంగా మారనుంది. (బరిలో మనవళ్లు.. ఢీ అంటే ఢీ?!) -
పవన్ కల్యాణ్‌తో కుమారస్వామి భేటీ
హైదరాబాద్ : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి గౌడ శనివారం జనసేన అధ్యక్షుడు, సినీ హీరో పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యారు. సమావేశం అనంతరం కుమారస్వామి మాట్లాడుతూ తమ సమావేశంలో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదన్నారు. చాలాకాలంగా తమ మధ్య స్నేహం ఉందని ఆయన తెలిపారు. తన కుమారుడు నిఖిల్ కుమారస్వామి చిత్రం విడుదల సందర్బంగా ఆశీర్వాదం కోసమే పవన్‌ను కలిసినట్లు చెప్పారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు అన్నదమ్ముల్లాంటివని కుమారస్వామి పేర్కొన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ కుమారస్వామి తనకు మంచి మిత్రుడన్నారు. తమ భేటీలో ఎలాంటి రాజకీయ అంశాలు చర్చకు రాలేదన్నారు. నితిన్ కుమారస్వామి గౌడ సినీ ప్రవేశంపై మాత్రమే చర్చించినట్లు పవన్ చెప్పారు. కుమారస్వామితో తనకు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. కాగా కృష్ణా పుష్కరాలకు వెళ్లడం లేదని విలేకర్లు అడిగిన ప్రశ్నకు పవన్ సమాధానం ఇచ్చారు. అలాగే ప్రత్యేక హోదాపై ఆయనను ప్రశ్నించగా, తర్వాత స్పందిస్తానని అన్నారు. కాగా కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమార్ నటించిన 'జాగ్వార్' సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. హెచ్.డి. కుమారస్వామి సమర్పణలో చన్నాంబిక ఫిలింస్ బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కింది. ఎ. మహాదేవ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీప్తి కథానాయికగా నటించారు. ఇటీవలే ఈ సినిమా టీజర్‌ను హైదరాబాద్ లో రిలీజ్ చేశారు.