జేడీఎస్ అధిపతి దేవెగౌడకు చుక్కెదురు
సాక్షి బెంగళూరు: కర్ణాటక రాష్టంలోని మూడు విధానసభ నియోజకవర్గాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో మూడు చోట్ల కాంగ్రెస్ పార్టీ విజయభేరీ మోగించింది. బీజేపీ, జేడీఎస్ ఆధ్వర్యంలోని ఎన్‌డీఏ కూటమికి ఘోర పరాజయం ఎదురైంది. అయితే ఉప ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే కుటుంబ రాజకీయాలకు కన్నడిగులు చెక్ పెట్టినట్లు అర్థం అవుతోంది. చెన్నపట్టణ, శిగ్గావి నియోజకవర్గాల్లో కుటుంబ రాజకీయాల నుంచి వచ్చిన అభ్యర్థులను ఓటర్లు తిరస్కరించారు.
ఒక్క సండూరులో మాత్రమే ఈ.తుకారాం సతీమణి అన్నపూర్ణకు గెలుపు వరించింది. బీజేపీ అభ్యర్థి బంగార హనుమంతప్పపై ఈమె గెలిచారు. చెన్నపట్టణలో కేంద్ర మంత్రి, జేడీ(ఎస్)చీఫ్ హెచ్‌డీ కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామి, శిగ్గావిలో మాజీ ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై కుమారుడు భరత్ బొమ్మై ఓటమి పాలయ్యారు.
హెచ్‌డీ కుమారస్వామి, డీసీఎం డీకే శివకుమార్‌ల ప్రతిష్టాత్మక పోటీగా నిలిచిన చెన్నపట్టణ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్థిగా బరిలో నిలిచిన నిఖిల్ కుమారస్వామి ఓడిపోవడం ద్వారా ప్రత్యక్ష ఎన్నికల్లో హ్యాట్రిక్ ఓటమిని సాధించినట్లు అయింది. ఇక్కడ బీజేపీ నుంచి ఎన్నికల ముందు టికెట్ దక్కక కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న సీనియర్ నేత సీపీ యోగేశ్వర విజయం సాధించారు.
జేడీఎస్ పార్టీ కంచుకోట అయిన రామనగర జిల్లా నాలుగు నియోజకవర్గాల్లో ఒకటైన చెన్నపట్టణను కోల్పోవడం ఎన్‌డీఏను తీవ్రంగా నిరాశ పరిచింది. 2023 విధానసభ ఎన్నికల్లోనూ రామనగర నుంచి పోటీ చేసిన నిఖిల్ ఓడిపోయారు. అలాగే 2019 లోకసభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి, సీనియర్ నటి సుమలతా అంబరీశ్ చేతిలో కూడా నిఖిల్ పరాజయం పొందారు. తాజాగా చెన్నపట్టణలో కూడా ఓటమి పలకరించింది. హేమాహేమీలు ఇక్కడ నిఖిల్ తరపున ప్రచారం చేపట్టారు. అయినప్పటికీ సత్ఫలితాన్ని పొందలేకపోయారు.
భరత్ బొమ్మైకు నిరాశే
అయితే శిగ్గావిలో తొలిసారి అదృష్టాన్ని పరీక్షించుకున్న మాజీ సీఎం బసవరాజు బొమ్మై కుమారుడు, బీజేపీ అభ్యర్థి భరత్ బొమ్మైకు నిరాశే ఎదురైంది. ఎన్నికల తొలినాళ్లలో తన కుమారుడికి టికెట్ వద్దని చెప్పిన బసవరాజు బొమ్మై ఆ తర్వాత చివరి నిమిషంలో మనసు మా ర్చుకుని టికెట్ ఇప్పించుకున్నారు. ఆలస్యంగా బరిలో దిగడం, ప్రచారానికి తక్కువ సమయం ఉండటంతో ఎక్కువమంది ఓటర్లను చేరుకోలేకపోయా రు. దీంతో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం భరత్‌కు కష్టంగా మారింది. భరత్ ఓటమికి ఇది కూడా ఒక కారణమే. కాంగ్రెస్ అభ్యర్థి యాసిర్ అహ్మద్‌ఖాన్ 13వేల ఓట్ల మెజారిటీతో భరత్‌పై గెలిచారు.
Comments
Please login to add a commentAdd a comment