dynasty politics
-
కుటుంబ రాజకీయాలకు చెక్..!
సాక్షి బెంగళూరు: కర్ణాటక రాష్టంలోని మూడు విధానసభ నియోజకవర్గాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో మూడు చోట్ల కాంగ్రెస్ పార్టీ విజయభేరీ మోగించింది. బీజేపీ, జేడీఎస్ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమికి ఘోర పరాజయం ఎదురైంది. అయితే ఉప ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే కుటుంబ రాజకీయాలకు కన్నడిగులు చెక్ పెట్టినట్లు అర్థం అవుతోంది. చెన్నపట్టణ, శిగ్గావి నియోజకవర్గాల్లో కుటుంబ రాజకీయాల నుంచి వచ్చిన అభ్యర్థులను ఓటర్లు తిరస్కరించారు. ఒక్క సండూరులో మాత్రమే ఈ.తుకారాం సతీమణి అన్నపూర్ణకు గెలుపు వరించింది. బీజేపీ అభ్యర్థి బంగార హనుమంతప్పపై ఈమె గెలిచారు. చెన్నపట్టణలో కేంద్ర మంత్రి, జేడీ(ఎస్)చీఫ్ హెచ్డీ కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామి, శిగ్గావిలో మాజీ ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై కుమారుడు భరత్ బొమ్మై ఓటమి పాలయ్యారు. హెచ్డీ కుమారస్వామి, డీసీఎం డీకే శివకుమార్‌ల ప్రతిష్టాత్మక పోటీగా నిలిచిన చెన్నపట్టణ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా బరిలో నిలిచిన నిఖిల్ కుమారస్వామి ఓడిపోవడం ద్వారా ప్రత్యక్ష ఎన్నికల్లో హ్యాట్రిక్ ఓటమిని సాధించినట్లు అయింది. ఇక్కడ బీజేపీ నుంచి ఎన్నికల ముందు టికెట్ దక్కక కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న సీనియర్ నేత సీపీ యోగేశ్వర విజయం సాధించారు. జేడీఎస్ పార్టీ కంచుకోట అయిన రామనగర జిల్లా నాలుగు నియోజకవర్గాల్లో ఒకటైన చెన్నపట్టణను కోల్పోవడం ఎన్డీఏను తీవ్రంగా నిరాశ పరిచింది. 2023 విధానసభ ఎన్నికల్లోనూ రామనగర నుంచి పోటీ చేసిన నిఖిల్ ఓడిపోయారు. అలాగే 2019 లోకసభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి, సీనియర్ నటి సుమలతా అంబరీశ్ చేతిలో కూడా నిఖిల్ పరాజయం పొందారు. తాజాగా చెన్నపట్టణలో కూడా ఓటమి పలకరించింది. హేమాహేమీలు ఇక్కడ నిఖిల్ తరపున ప్రచారం చేపట్టారు. అయినప్పటికీ సత్ఫలితాన్ని పొందలేకపోయారు.భరత్ బొమ్మైకు నిరాశేఅయితే శిగ్గావిలో తొలిసారి అదృష్టాన్ని పరీక్షించుకున్న మాజీ సీఎం బసవరాజు బొమ్మై కుమారుడు, బీజేపీ అభ్యర్థి భరత్ బొమ్మైకు నిరాశే ఎదురైంది. ఎన్నికల తొలినాళ్లలో తన కుమారుడికి టికెట్ వద్దని చెప్పిన బసవరాజు బొమ్మై ఆ తర్వాత చివరి నిమిషంలో మనసు మా ర్చుకుని టికెట్ ఇప్పించుకున్నారు. ఆలస్యంగా బరిలో దిగడం, ప్రచారానికి తక్కువ సమయం ఉండటంతో ఎక్కువమంది ఓటర్లను చేరుకోలేకపోయా రు. దీంతో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం భరత్‌కు కష్టంగా మారింది. భరత్ ఓటమికి ఇది కూడా ఒక కారణమే. కాంగ్రెస్ అభ్యర్థి యాసిర్ అహ్మద్‌ఖాన్ 13వేల ఓట్ల మెజారిటీతో భరత్‌పై గెలిచారు. -
విదేశాల్లోనూ వారసత్వ రాజకీయం
సాక్షి, న్యూఢిల్లీ : వారసత్వ రాజకీయాల బెడద ఒక్క భారత దేశానికే పరిమితం కాలేదు. ప్రపంచంలోని పలు దేశాలు ఈ బెడద బారిన పడుతున్నాయి. అమెరికా, జపాన్ దేశాల నుంచి ఫిలిప్పైన్స్, ఇండోనేసియా వరకు వారసత్వ రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఆఫ్రికా, ఆసియా, ఉత్తర అమెరికా, లాటిన్ అమెరికా దేశాల్లో 2000 సంవత్సరం నుంచి 2017 వరకు పదవిలో ఉన్న 1029 మంది దేశాధ్యక్షులు, ప్రధాన మంత్రుల కుటుంబాల నేపథ్యాన్ని ‘హిస్టారికల్ సోషల్ రీసర్చ్’ జనరల్ అధ్యయనం జరిపి 2018, డిసెంబర్లో ఓ నివేదికను వెల్లడించింది. దాదాపు ప్రతి పది మంది ప్రపంచ దేశాధినేతల్లో ఒక్కరు వారసత్వ రాజకీయాల నుంచి వచ్చిన వారే. 1029 మంది అధ్యక్షులు, ప్రధాన మంత్రుల్లో 119 మంది (12 శాతం) రాజకీయ వారసత్వం నుంచి వచ్చిన వారే. వారిలో అమెరికా మాజీ అధ్యక్షులు జార్జి డబ్లూ బుష్, కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడియూ, అర్జెంటీనా మాజీ అధ్యక్షులు క్రిస్టినా ఫెర్నాండేజ్ ప్రముఖులు. పేద, ధనిక దేశాలతో సంబంధం లేకుండా ఈ వారసత్వ రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఒకప్పుడు రాచరిక, జమీందారి వ్యవస్థలోనే ఈ వారసత్వ రాజకీయం కనిపించేది. నేటి ప్రజాస్వామ్య వ్యవస్థలో కూడా ఈ వారసత్వ రాజకీయాలు కొనసాగడం అంటే ప్రజస్వామ్య వ్యవస్థ ఎంత బలహీన పడుతుందో అర్థం చేసుకోవచ్చు. జార్జిబుష్, జస్టిన్ ట్రూడియూ ఇద్దరు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నాయకులే. వారి తండ్రులు కూడా ఇంతకుముందు ఆ పదవుల్లోనే కొనసాగారు. 2000–2017 మధ్య ఒక్క యూరప్ నుంచే వారసత్వ రాజకీయాల కారణంగా 13 శాతం మంది దేశాధ్యక్షులు, ప్రధాన మంత్రులు వచ్చారు. మొత్తం 54 మంది దేశాధినేతల్లో ఆరుగురికి మాజీ దేశాధినేతలతో రక్త సంబంధం ఉంది. లాటిన్ అమెరికా నుంచి వచ్చిన 88 దేశాధినేతల్లో 11 మంది రాజకీయ వారసత్వం ఉంది. సబ్ సహారా ఆఫ్రికాలోనే వారసత్వ రాజకీయం తక్కువగా ఉంది. అక్కడి 29 మంది దేశాధినేతల్లో కాంగో అధ్యక్షుడు జోసఫ్ కబీలా, కెన్యా ప్రధాని ఉహ్రూ కెన్యట్టాలకు మాత్రమే మాజీ అధ్యక్షులు, ప్రధాన మంత్రులతో రక్త సంబంధం ఉంది. 204 మంది ఆసియన్ నాయకుల కుబుంబ చరిత్రలను అధ్యయనం చేయగా, వారిలో 23 మందికి రాజకీయ వారసత్వ నేపథ్యం ఉంది. మహిళల్లోనూ రాజకీయ వారసత్వం వారసత్వ రాజకీయాల కారణంగా అధికారంలోకి వచ్చిన మహిళలు కూడా ఉన్నారు. మొత్తం 1029 మంది ప్రపంచ దేశాధినేతల్లో కేవలం 66 మంది మహిళలు ఉన్నారు. వారిలో వారసత్వ రాజకీయాలు కలిగిన వారిలో జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మార్కెల్, పాకిస్థాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో, బ్రెజిల్ మాజీ అధ్యక్షులు డిల్మా రౌసెఫ్‌లు సహా 19 మంది ఉన్నారు. ఈ లెక్కన వారసత్వ రాజకీయాల్లోకి పురుషులకన్నా మహిళలే ఎక్కువగా వచ్చినట్లు. అయితే వారసత్వంగా అధ్యక్ష లేదా ప్రధాని పదవులు అలంకరించిన మహిళలు, పురుషుల కారణంగానే అంటే, తండ్రి లేదా భర్త కారణంగా రాజకీయాల్లోకి వచ్చిన వారే. పాక్ మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో తన తండ్రి జుల్ఫికర్ భుట్టో హత్య కారణంగా రాజకీయాల్లోకి వచ్చిన విషయం తెల్సిందే. అలాగే ఇతరులు. అయిన ప్పటికీ రాజకీయ వారసత్వం లేకుండా అత్యున్నత అధికార పదవులు అలంకరించిన మహళలు 71 శాతం ఉండడం విశేషమే. చదవండి: అన్ని పార్టీల్లోనూ రాజకీయ వారసత్వం! రాజకీయ వారసత్వంతో ఎంత ముప్పు? -
‘దేశం తర్వాతే కుటుంబం’
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల వేడి రాజుకున్న క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం కాంగ్రెస్ పార్టీ, గాంధీ కుటుంబంపై విమర్శల దాడికి దిగారు. వారసత్వ రాజకీయాలను విస్మరించి 2014 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టిన తీరును మోదీ తన బ్లాగ్‌లో వివరించారు. యూపీఏ హయాంలో అన్ని రంగాలు కుదేలైతే ఎన్డీఏ ప్రభుత్వం వాటిని చక్కదిద్దిన వైనాన్ని ప్రస్తావించారు. గృహవసతి లేని పేదలకు గూడు కల్పించడంతో పాటు వారికి విద్య, వైద్యం అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. కాంగ్రెస్ అణిచివేత వైఖరి అనుసరించినా ప్రజలకు కనిపిస్తున్న వాస్తవాలను ఏమార్చలేరని, ప్రజల్లో కాంగ్రెస్ పట్ల నెలకొన్న ఏహ్యభావాన్ని అధిగమించలేరని ప్రధాని మోదీ ప్రధాన విపక్షానికి చురకలు వేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని, రాజ్యాంగం మనకు అందించిన వ్యవస్థల బలోపేతానికి కృషిచేయాలని ప్రధాని పిలుపు ఇచ్చారు. -
‘దాని గురించి మాట్లాడితే నవ్వొస్తుంది’
-
‘దాని గురించి మాట్లాడితే నవ్వొస్తుంది’
హైదరాబాద్: వారసత్వ రాజకీయాల గురించి కాంగ్రెస్ మాట్లాడుతుంటే నవ్వొస్తోందని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో అన్నివర్గాలు సంతోషంగా ఉన్నాయని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... వ్యక్తిగత ఆహారపు అలవాట్లపై తమ ప్రభుత్వం జోక్యం చేసుకోదని, కొన్ని నియమ నిబంధనలను మాత్రమే సవరించిందని చెప్పారు. గోవధపై విమర్శలు సరికావన్నారు. ఆవును జాతీయ జంతువుగా గుర్తించాలని రాజస్థాన్ హైకోర్టు తీర్పు చెప్పిందన్నారు. జమ్మూకశ్మీర్‌కు రూ. 62 వేల కోట్ల ప్యాకేజీ ఇచ్చామని తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. -
సీఎం అభ్యర్థిగా కేజ్రీవాల్ సతీమణి?
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీత.. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లో చేరతారని ప్రచారం జరుగుతోంది. 'ఆప్'లో ఆమె ఉన్నత పదవి చేపడతారన్న ఊహగానాలు కూడా వినవస్తున్నాయి. ఈ వార్తలను 'ఆప్' నేతలు కొట్టిపారేశారు. వారసత్వ రాజకీయాలకు తమ పార్టీ వ్యతిరేకమని, 'ఆప్'లో సునీత చేరకపోవచ్చని సీనియర్ నాయకులు పేర్కొన్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో కేజ్రీవాల్ తో కలిసి ఆమె ప్రచారం నిర్వహించే అవకాశం ఉందన్న వార్తలను తోసిపుచ్చలేదు. 'ఆప్' రాజ్యాంగం ప్రకారం ఒకే కుటుంబం నుంచి ఇద్దరు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలులేదు. పార్టీ ఉన్నత పదవుల్లోనూ ఒకే కుటుంబానికి ఇద్దరికి స్థానం ఉండదు. ఎన్నికలు జరగనున్న పంజాబ్, గోవాలో సునీతను ముఖ్యమంత్రిగా ప్రకటించే అవకాశముందని వచ్చిన వార్తలను ఆప్ నేతలు ఖండించారు. ప్రతిభ గల అభ్యర్థులను పార్టీ కార్యనిర్వాహక కమిటీ అంగీకారంతో సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగం నుంచి స్వచ్ఛంద విరమణ సునీత వ్యక్తిగత నిర్ణయమని స్పష్టం చేశారు. 1993 ఐఆర్ఎస్ బ్యాచ్‌కు చెందిన 51 ఏళ్ల సునీత ఆదాయపన్ను శాఖలో దాదాపు 22 ఏళ్ల పాటు పనిచేశారు. -
'జగమంత కుటుంబం మాది'
షహజాదా - గాంధీ నెహ్రూ కుటుంబ రాజకీయాలను ఎద్దేవా చేసేందుకు, రాహుల్ గాంధీని విమర్శించేందుకు బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పదే పదే ఉపయోగించే పదం ఇది. షహజాదా అంటే రాకుమారుడు లేదా యువరాజు అని అర్థం. కానీ తమాషా ఏమిటంటే ఆయన పార్టీ బిజెపిలోనూ బోలెడంత మంది షహజాదాలున్నారు. ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు, ముగ్గురు మాజీ ముఖ్యమంత్రుల సుపుత్రులు ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. హిమాచల్ మాజీ సీఎం ప్రేమ్ కుమార్ ధుమల్ కుమారుడు అనురాగ్ ఠాకూరు హమీర్పూర్ నుంచి బరిలో ఉన్నారు. అయితే ఆయన ఇప్పటికే సిట్టింగ్ ఎంపీ. అలాగే మాజీ కేంద్ర మంత్రి మేనకాగాంధీ కుమారుడు వరుణ్ గాంధీ కూడా రెండోసారి లోకసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ప్రమోద్ మహాజన్ కూతురు పూనమ్ మహాజన్ ముంబాయి నార్త్ సెంట్రల్ నుంచి, మాజీ కేంద్ర ఆర్ధిక మంత్రి యశ్వంత్ సిన్హా కుమారుడు జయంత్ సిన్హా బీహార్ లోని హజారీబాగ్ నుంచి పోటీ పడుతున్నారు. ఇక యూపీ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్్ సింగ్ కుమారుడు రాజ్ బీర్ సింగ్ ఎటాహ్ నుంచి, ఢిల్లీ మాజీ సీఎం సాహెబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేశ్ వర్మ వెస్ట్ ఢిల్లీ నుంచి, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే కుమారుడు దుష్యంత్ సింగ్ ఝాలావర్ నుంచి, ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ కుమారుడు అభిషేక్ రాజానందగావ్ నుంచి పోటీ పడుతున్నారు. బిజెపి మిత్ర పక్షాలు అకాలీదళ్, శివసేన, రామ్ విలాస్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీల్లోనూ కుటుంబపాలనే కొనసాగుతోంది. అకాలీదళ్ లో బాదల్ కుటుంబం, శివసేనలో ఠాక్రే కుటుంబం, ఎల్ జె పీ లో పాశ్వాన్ కుటుంబాలదే పెద్దపీట.