'జగమంత కుటుంబం మాది'
షహజాదా - గాంధీ నెహ్రూ కుటుంబ రాజకీయాలను ఎద్దేవా చేసేందుకు, రాహుల్ గాంధీని విమర్శించేందుకు బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పదే పదే ఉపయోగించే పదం ఇది. షహజాదా అంటే రాకుమారుడు లేదా యువరాజు అని అర్థం. కానీ తమాషా ఏమిటంటే ఆయన పార్టీ బిజెపిలోనూ బోలెడంత మంది షహజాదాలున్నారు. ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు, ముగ్గురు మాజీ ముఖ్యమంత్రుల సుపుత్రులు ఎన్నికల్లో పోటీ పడుతున్నారు.
హిమాచల్ మాజీ సీఎం ప్రేమ్ కుమార్ ధుమల్ కుమారుడు అనురాగ్ ఠాకూరు హమీర్పూర్ నుంచి బరిలో ఉన్నారు. అయితే ఆయన ఇప్పటికే సిట్టింగ్ ఎంపీ. అలాగే మాజీ కేంద్ర మంత్రి మేనకాగాంధీ కుమారుడు వరుణ్ గాంధీ కూడా రెండోసారి లోకసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ప్రమోద్ మహాజన్ కూతురు పూనమ్ మహాజన్ ముంబాయి నార్త్ సెంట్రల్ నుంచి, మాజీ కేంద్ర ఆర్ధిక మంత్రి యశ్వంత్ సిన్హా కుమారుడు జయంత్ సిన్హా బీహార్ లోని హజారీబాగ్ నుంచి పోటీ పడుతున్నారు.
ఇక యూపీ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్్ సింగ్ కుమారుడు రాజ్ బీర్ సింగ్ ఎటాహ్ నుంచి, ఢిల్లీ మాజీ సీఎం సాహెబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేశ్ వర్మ వెస్ట్ ఢిల్లీ నుంచి, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే కుమారుడు దుష్యంత్ సింగ్ ఝాలావర్ నుంచి, ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ కుమారుడు అభిషేక్ రాజానందగావ్ నుంచి పోటీ పడుతున్నారు.
బిజెపి మిత్ర పక్షాలు అకాలీదళ్, శివసేన, రామ్ విలాస్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీల్లోనూ కుటుంబపాలనే కొనసాగుతోంది. అకాలీదళ్ లో బాదల్ కుటుంబం, శివసేనలో ఠాక్రే కుటుంబం, ఎల్ జె పీ లో పాశ్వాన్ కుటుంబాలదే పెద్దపీట.