
సీఎం అభ్యర్థిగా కేజ్రీవాల్ సతీమణి?
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీత.. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లో చేరతారని ప్రచారం జరుగుతోంది. 'ఆప్'లో ఆమె ఉన్నత పదవి చేపడతారన్న ఊహగానాలు కూడా వినవస్తున్నాయి. ఈ వార్తలను 'ఆప్' నేతలు కొట్టిపారేశారు. వారసత్వ రాజకీయాలకు తమ పార్టీ వ్యతిరేకమని, 'ఆప్'లో సునీత చేరకపోవచ్చని సీనియర్ నాయకులు పేర్కొన్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో కేజ్రీవాల్ తో కలిసి ఆమె ప్రచారం నిర్వహించే అవకాశం ఉందన్న వార్తలను తోసిపుచ్చలేదు.
'ఆప్' రాజ్యాంగం ప్రకారం ఒకే కుటుంబం నుంచి ఇద్దరు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలులేదు. పార్టీ ఉన్నత పదవుల్లోనూ ఒకే కుటుంబానికి ఇద్దరికి స్థానం ఉండదు. ఎన్నికలు జరగనున్న పంజాబ్, గోవాలో సునీతను ముఖ్యమంత్రిగా ప్రకటించే అవకాశముందని వచ్చిన వార్తలను ఆప్ నేతలు ఖండించారు. ప్రతిభ గల అభ్యర్థులను పార్టీ కార్యనిర్వాహక కమిటీ అంగీకారంతో సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగం నుంచి స్వచ్ఛంద విరమణ సునీత వ్యక్తిగత నిర్ణయమని స్పష్టం చేశారు. 1993 ఐఆర్ఎస్ బ్యాచ్కు చెందిన 51 ఏళ్ల సునీత ఆదాయపన్ను శాఖలో దాదాపు 22 ఏళ్ల పాటు పనిచేశారు.