
న్యూఢిల్లీ: గత ఆప్ ప్రభుత్వానికి సంబంధించి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా(CAG) మరో నివేదికను విడుదల చేసింది. ఆరోగ్య భద్రత, మౌలిక వసతుల కల్పనలో గత సర్కార్ పూర్తి నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించిందని, కరోనా సమయంలోనూ నిధులను సక్రమంగా వినియోగించలేకపోయిందని సంచలన విషయాలు వెల్లడించింది.
గత ఆరేళ్లుగా ఢిల్లీ ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగాల్లో తీవ్ర అవినీతికి పాల్పడిందనేది ఆ నివేదిక సారాంశం. ఆప్ ప్రతిష్టాత్మకంగా భావించిన మొహల్లా క్లినిక్స్‌లో తగినంత మౌలిక సదుపాయాలు లేకపోవడం దగ్గరి నుంచి అత్యవసర నిధులను వినియోగించకపోవడం దాకా ఎన్నో వివరాలను కాగ్ తన నివేదికలో పొందుపరిచింది. అంతేకాదు..
ఢిల్లీ వ్యాప్తంగా చాలా ఆస్పత్రుల్లో అత్యవసర సేవలు అందట్లేదన్న విషయం గురించి ప్రముఖంగా కాగ్ ప్రస్తావించింది. ఢిల్లీలో ఉన్న 27 ఆస్పత్రుల్లో 14 హాస్పిటల్స్‌లో ఐసీయూ సదుపాయం లేదని వెల్లడించింది. 16 ఆస్పత్రుల్లో బ్లడ్ బ్యాంకులు లేవని తెలిపింది. ఎనిమిది ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సరఫరా సదుపాయం లేదని తెలిపింది. పదిహేన్నింటిలో మార్చురీ సదుపాయాల్లేవని తెలిపింది. 12 ఆస్పత్రులకు ఆంబులెన్స్ సదుపాయాలు లేవని వెల్లడించింది.
ఇక ఆప్ ప్రభుత్వం అప్పట్లో మొహల్లా క్లినిక్స్(Mohallah Clinics) ఏర్పాటును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వెయ్యికి పైగా ఏర్పాటు చేయాలని భావించినా.. అందులో 2023 నాటికి సగం మాత్రమే పూర్తి చేయగలిగిందని తెలిపింది. అయితే వాటిలోనూ సరైన సౌకర్యాలు, వైద్య సదుపాయాలు లేవని తెలిపింది. మొహల్లా క్లినిక్స్‌తో పాటు ఆయుష్ డిస్పెన్సరీల్లో మౌలిక వసతులు సరిగా లేవని పేర్కొంది.
విద్యుత్ సదుపాయం, చెకప్ టేబుల్స్, చివరికి టాయిలెట్స్ సదుపాయాలు కూడా లేవని తెలిపింది. వీటికి తోడు అదనంగా సిబ్బంది కొరత కూడా ఉందని నివేదించింది. ఇక.. అత్యవసర సేవల కోసం వినియోగించాల్సిన నిధుల్ని కూడా ఆప్ పక్కన పెట్టిందని కాగ్ తన నివేదికలో వెల్లడించింది. మరీ ముఖ్యంగా కరోనా టైంలో.. రూ.200 కోట్ల నిధులను, వైద్య సిబ్బంది కోసం కేటాయించిన మరో రూ.30 కోట్లను, అత్యవసర ఔషధాలతో పాటు పీపీఈ కిట్ల కోసం కేటాయించిన ఇంకో రూ.83 కోట్లను వినియోగించకుండా పోయిందని తెలిపింది. ఆస్పత్రులకు సంబంధించి కొత్త ప్రాజెక్టుల విషయంలో కాలయాపనతో భారం పెరిగిందని, దీనివల్ల ఢిల్లీలోని ఇతర ఆస్పత్రుల నిర్వహణపై ప్రభావం పడిందని కాగ్ తెలిపింది. ఇదిలా ఉంటే.. ఈ కాగ్ నివేదిక ఇవాళ ఢిల్లీ అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
మరోవైపు.. మద్యం విధానంపై కాగ్ రూపొందించిన నివేదిక అంశం ఎన్నికల ముందు పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే. 2021-22లో తీసుకొచ్చిన మద్యం విధానం కారణంగా ఢిల్లీ ప్రభుత్వానికి రూ.2,000 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు కాగ్ తేల్చింది. కొత్త మద్యం విధానం కారణంగా అప్పటి ప్రభుత్వం రూ.941.53 కోట్ల ఆదాయం కోల్పోయిందని, లైసెన్సు ఫీజుల కింద మరో రూ.890.15 కోట్లు నష్టపోయిందని, ఇక.. లైసెన్సుదారులకు మినహాయింపుల రూపంలో మరో రూ.144 కోట్లు కోల్పోయినట్లు వెల్లడించింది.
ఈ నివేదికను తాజాగా బీజేపీ ప్రభుత్వం(BJP Government) అసెంబ్లీలో ప్రవేశపెట్టి అందులోని అంశాలను బయటపెట్టగా, ఆప్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగింది. దీంతో ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు హాట్‌హాట్‌గా కొనసాగుతున్నాయి.