Mohalla Clinic
-
ఈ దగ్గుమందు చాలా ప్రమాదకరమైనది, పిల్లలందుకే మృతి చెందారు: డీజీహెచ్ఎస్
న్యూఢిల్లీ: నాలుగు నెలల క్రితం ఢిల్లీలోని కళావతి శరణ్ ఆసుపత్రిలో ముగ్గురు చిన్నారులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మరో 13 మంది చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారయ్యిన సంగతి తెలిసిందే. ఐతే చిన్నారుల మృతికి హానికరమైన దగ్గు మందే కారణమని విచారణలో తేలింది. డెక్స్ట్రోమెథార్ఫాన్ కాఫీ సిరప్ కారణంగానే చిన్నారులు మృతి చెందినట్లు కేంద్ర ప్రభుత్వ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్ఎస్) సోమవారం వెల్లడించింది. నాలుగు నెలల క్రితం ఢిల్లీలోని కళావతి శరణ్ ఆసుపత్రిలో కొందరు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వారికి డెక్స్ట్రోమెథార్ఫాన్ కాఫ్ సిరప్‌ను అందించారు. ఐతే ఈ దగ్గుమందు కారణంగా ముగ్గురు పిల్లలు మృతి చెందగా, మరో 13 మంది చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ తాజా దర్యాప్తు నివేదికను విడుదల చేసింది. ఢిల్లీలోని మొహల్లా క్లినిక్‌తో సహా వివిధ డిస్పెన్సరీలలో పిల్లలకు ప్రభుత్వం అందిస్తున్న డెక్స్ట్రోమెథార్ఫాన్ కాఫీ సిరప్ కారణంగానే మరణాలు సంభవించాయని డీజీహెచ్ఎస్ పేర్కొంది. ‘మా పరిశోధనలో అది హానికరమైన దగ్గు మందని తేలింది. ఇకపై ఎట్టి పరిస్థితుల్లో నాలుగేళ్లలోపు పిల్లలకు ఆ మందు ఇవ్వకూడదని, మొహల్లా క్లినిక్‌లు, డిస్పెన్సరీలలో పంపిణీ చేస్తున్న ఈ మందును వెంటనే సీజ్ చేయాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని డీజీహెచ్ఎస్ ఆదేశించింది. చదవండి: Crying Child Playing The Violin: ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్న బాలుడి ఫొటో.. ఎందుకో తెలుసా? -
మరో మొహల్లా క్లినిక్ వైద్యుడికి కరోనా
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలో మరో మొహల్లా క్లినిక్‌కు చెందిన ఓ వైద్యుడికి కరోనా వైరస్ పాజిటివ్‌గా రిపోర్ట్ వచ్చింది. వారం కిందట మౌజీపూర్ మొహల్లా క్లినిక్ వైద్యుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా, ఆయన భార్య, కుమార్తెకు సైతం నిర్వహించిన పరీక్షలో పాజిటివ్‌గా తేలింది. ఆయనతో సన్నిహితంగా మెలిగిన 900 మందిని 14 రోజులు క్వారంటైన్లో ఉంచారు. ఇక ఢిల్లీలోని మౌజీపూర్‌కు ఒక కిలోమీటర్ దూరంలోని బబార్పూర్‌లో తాజా కేసు వెలుగుచూసింది. కాగా, ఈ క్లినిక్‌ను మార్చి 12 నుంచి 20 మధ్య సందర్శించిన రోగులందరినీ రానున్న 15 రోజులు ఇళ్లలో స్వీయ నిర్భంధంలోకి వెళ్లాలని అధికారులు సూచించారు. కాగా కరోనా బారిన పడిన వైద్యుడు విదేవీ ప్రయాణం చేసి వచ్చాడా లేదా విదేశాల నుంచి వచ్చిన వారితో సన్నిహితంగా మెలిగాడా అనేది ఇంకా వెల్లడికాలేదు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటివరకూ కరోనా పాజిటివ్ కేసులు 100 దాటగా, ఇద్దరు వ్యక్తులు మరణించారు. చదవండి : కరోనా ఎఫెక్ట్: సీఎం వేతనం కట్! -
డాక్టర్‌కు కరోనా.. క్వారంటైన్లోకి 900 మంది
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ మౌజ్‌పూర్‌లోని మొహల్లా క్లినిక్‌లో పనిచేస్తున్న ఓ వైద్యుడితోపాటు అతని భార్య, కుమార్తెలకు కూడా కరోనా వైరస్ సోకిన సంగతి తెలిసిందే. దీంతో అప్రమత్తమైన ఢిల్లీ అధికార యంత్రాంగం ఇటీవలి కాలంలో ఆ క్లినిక్‌కు వెళ్లిన దాదాపు 900 మందిని క్వారంటైన్‌ను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అయితే సౌదీ అరేబియా నుంచి తిరిగివచ్చిన ఓ మహిళ కరోనా లక్షణాలతో క్లినిక్‌కు రావడంతో ఆ వైద్యునికి వైరస్ సోకినట్టుగా అధికారులు గుర్తించారు. ఇందుకు సంబంధించి ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. కరోనా పాజిటివ్‌గా తేలిన వైద్యున్ని కలిసిన వారందరినీ 14 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉంచనున్నట్టు తెలిపారు. ఢిల్లీలో ఇప్పటివరకు 36 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు చెప్పారు. మార్చి 12న సౌదీ నుంచి వచ్చిన మహిళ మౌజ్‌పూర్ మొహల్లా క్లినిక్‌లోని డాక్టర్‌ను కలవడంతో అతనికి కరోనా సోకిందని చెప్పారు. ఆ మహిళకు ఐదు రోజుల తర్వాత కరోనా పాజిటివ్‌గా తేలిందన్నారు. ఆ మహిళతో సన్నిహితంగా ఉన్న మరో ఐదుగురికి కూడా కరోనా సోకిందని వెల్లడించారు. వారిలో ఆమె తల్లి, సోదరుడు, ఇద్దరు కుమార్తెలు, ఆమెను ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి తీసుకొచ్చిన ఓ బంధువు ఉన్నారని చెప్పారు. అలాగే ఆమె బంధువులతోపాటు చుట్టుపక్కల ఉన్న 74 మందిపై నిఘా ఉంచామని తెలిపారు. మరోవైపు జిల్లా యంత్రాంగం కూడా కూడా మార్చి 12 నుంచి 18 మధ్య మొహల్లా క్లినిక్ వచ్చినవారు 15 రోజులపాటు హోం క్వారంటైన్లో ఉండాలని కోరింది. క్లినిక్స్ యథావిథిగా కొనసాగుతాయి.. : కేజ్రీవాల్ మొహల్లా క్లినిక్ వైద్యునికి కరోనా సోకడంపై ముఖ్యమంత్రి అరవింద్ క్రేజీవాల్ స్పందించారు. ఈ ఒక్క ఘటన తప్పించి క్లినిక్స్ అన్ని తెరిచి ఉంటాయని కేజ్రీవాల్ ప్రకటించారు. లేకపోతే పేదలు వైద్యం కోసం పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి వస్తుందన్నారు. క్లినిక్స్‌లో సిబ్బంది అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటారని చెప్పారు. మరోవైపు కరోనా సోకినవారి సంరక్షణ బాధ్యతలు చూస్తున్న వైద్య సిబ్బందికి కరోనా నిర్దారణ పరీక్షలు చేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా టెస్ట్‌ల కోసం అనుమానితుల నమూనాలు సేకరిస్తున్న వారికి కూడా పరీక్షలు నిర్వహిస్తామని చెప్పింది. 24 గంటలపాటు నిత్యావసర వస్తువుల దుకాణాలు ప్రస్తుతం లాక్డౌన్ కొనసాగుతున్నప్పటికీ నిత్యావసర వస్తువుల దుకాణాలన్నీ 24 గంటల పాటు తెరిచి ఉంచాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రజల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీచేసింది. అలాగే పాలు, కూరగాయలు, నిత్యావసర వస్తువులు సరఫరా చేసేవారిని పాసులు అడగవద్దని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, సీఎం కేజ్రీవాల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చదవండి : ఢిల్లీలో ఆ డాక్టర్ కుటుంబానికి కరోనా -
ఢిల్లీలో ఆ డాక్టర్ కుటుంబానికి కరోనా
న్యూఢిల్లీ : దేశావ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. నియంత్రణకు చర్యలు తీసుకుంటున్న కూడా పరిస్థితుల్లో మార్పు రావడం లేదు. తాజాగా ఈశాన్య ఢిల్లీ మౌజ్‌పూర్‌లోని మొహల్లా క్లినిక్ విధులు నిర్వర్తిస్ను వైద్యునికి కరోనా సోకినట్టు అధికారులు వెల్లడించారు. వైద్యునితో పాటు అతని భార్య, కుమార్తెకు కూడా కరోనా పాజిటివ్‌గా తేలిందని, వారిని ప్రస్తుతం ఆస్పత్రిలో చేర్పించినట్టు తెలిపారు. అలాగే మార్చి 12 నుంచి 18 మధ్య కాలంలో డాక్టర్‌ను కలవడానికి ఆ క్లినిక్‌కు వెళ్లిన వారిని క్వారంటైన్లో ఉండాల్సిందిగా అధికారులు సూచించారు. ఒకవేళ కరోనా లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రాదించాల్సిందిగా కోరారు. అయితే ఆ డాక్టర్ ఇటీవల ఏమైనా విదేశాలకు వెళ్లి వచ్చారా, లేదా అనేది తెలియాల్సి ఉంది. కాగా, ప్రాథమిక స్థాయిలో ప్రజలకు వైద్య సేవలు అందించడానికి ఢిల్లీ ప్రభుత్వం మొహల్లా పేరిట కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు బుధవారం రోజున ఢిల్లీలో కొత్తగా 5 కరోనా కేసులు నమోదయ్యాయని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 37కు చేరింది. తొలుత విదేశాల నుంచి వచ్చినవారే కరోనా బాధితుల జాబితాలో ఉండగా.. గత వారం రోజుల నుంచి కాంటాక్ట్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ క్రమంలో సమాజంలోని ఆర్థికంగా బలహీన వర్గాల వారికి కరోనా సోకితే.. అది చాలా వినాశకర పరిణామాలకు దారితీసే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 600 దాటింది. చదవండి : చైనాలో కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ ! -
ప్రతి 5 వేల జనాభాకు ఒక బస్తీ దవాఖానా: బొంతు
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబా ద్లో ప్రతి 5 వేల మంది జనాభాకు ఒక బస్తీ దవాఖా నాను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. గురువారం ఢిల్లీలో జరిగిన మేయర్ల సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన బొంతు రామ్మోహన్ ఢిల్లీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న మోహల్లా క్లినిక్‌లను సందర్శించి వాటి పనితీరును పరిశీలించారు. పీపీపీ విధానంలో చేపడుతున్న ఈ క్లీనిక్‌లను హైదరాబాద్‌లో చేపట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి త్వరలోనే సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించి ప్రతి 5 వేల మంది ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా బస్తీ దవాఖానాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. హైదరాబాద్‌లో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంటును ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఢిల్లీలో ఇప్పటికే ఏర్పాటు చేసిన 23 మెగావాట్ల సామర్థ్యం కలిగిన పవర్‌ప్లాంట్‌ను మేయర్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి, రామగుండం, కొత్తగూడెం, ఖమ్మం మేయర్ల బృందం సందర్శించింది. ఈ ప్లాంట్‌లో అవలంబిస్తున్న కొత్త విధానాలను, సాంకేతిక పద్ధతులను హైదరాబాద్ ప్లాంట్‌లో కూడా అమలు చేస్తామని ఆయన తెలిపారు.