సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల వేడి రాజుకున్న క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం కాంగ్రెస్ పార్టీ, గాంధీ కుటుంబంపై విమర్శల దాడికి దిగారు. వారసత్వ రాజకీయాలను విస్మరించి 2014 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టిన తీరును మోదీ తన బ్లాగ్‌లో వివరించారు. యూపీఏ హయాంలో అన్ని రంగాలు కుదేలైతే ఎన్‌డీఏ ప్రభుత్వం వాటిని చక్కదిద్దిన వైనాన్ని ప్రస్తావించారు.
గృహవసతి లేని పేదలకు గూడు కల్పించడంతో పాటు వారికి విద్య, వైద్యం అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. కాంగ్రెస్ అణిచివేత వైఖరి అనుసరించినా ప్రజలకు కనిపిస్తున్న వాస్తవాలను ఏమార్చలేరని, ప్రజల్లో కాంగ్రెస్ పట్ల నెలకొన్న ఏహ్యభావాన్ని అధిగమించలేరని ప్రధాని మోదీ ప్రధాన విపక్షానికి చురకలు వేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని, రాజ్యాంగం మనకు అందించిన వ్యవస్థల బలోపేతానికి కృషిచేయాలని ప్రధాని పిలుపు ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment