సాక్షి, న్యూఢిల్లీ : ప్రతిపక్ష పార్టీల మధ్య లోక్‌సభ ఎన్నికలకు ముందున్న ఆ కాస్త ఐక్యత ఫలితాల అనంతరం క్రమంగా కనుమరుగవుతోంది. ఉత్తరప్రదేశ్ లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన ఎస్పీ, బీఎస్పీలు రానున్న 11 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో విడి విడిగా పోటీ చేస్తుండడం, ఈ విషయాన్ని బీఎస్పీ నాయకురాలు మాయావతి పత్రికా ముఖ్యంగా మరీ ప్రకటించడం తెల్సిందే. కలిసికట్టుగా పోటీ చేసినా అత్యధిక సీట్లను బీజేపీ తన్నుకుపోవడం నుంచి వచ్చిన నైరాశ్యంతో మాయావతి ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చు. తెలంగాణాలో మళ్లీ బలపడే అవకాశం ఉందన్న కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోతుండడం, 18 మంది ఆ పార్టీ ఎమ్మెల్యేలకుగాను 12 మంది తమ పక్షాన్ని టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవాల్సిందిగా కోరడం ప్రతిపక్షాలకు బాధాకరమైన పరిణామమే.
బీజేపీ అధికారంకి రాకుండా ఉంచేందుకు కర్ణాటకలో ఏకమై సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ, జనతాదళ్ (సెక్యులర్) పార్టీలకు ఇప్పటికీ కంటి మీద కునుకు లేకుండా పోయింది. తమ పక్షం నుంచి ఎప్పుడు ఎవరు జారుకుంటారో, ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుందో అన్న ఆందోళన ఆ పార్టీల నాయకులను పట్టి పీడిస్తోంది. సాధారణ కేబినెట్ విస్తరణ చేయడానికే వారు భయపడి పోవడం, అప్పుడే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాల్సిందిగా పార్టీ కార్యకర్తలను స్వయాన ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామి పిలుపునివ్వడం పరిస్థితిని తెలియజేస్తోంది.
ప్రతిపక్షానికి సుదీర్ఘకాల వ్యూహం లేకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితులు దాపురిస్తున్నాయని అర్థం అవుతోంది. ఎన్నికల ముందు తాత్కాలికంగా ఒక్కటై పోటీ చేయడం వల్ల తాత్కాలిక ఫలితాలు ఉండొచ్చేమోగానీ ఆశించిన ఫలితాలు మాత్రం ఎప్పటికీ రావు. అవి రావాలంటే ముందు, ఆ తర్వాత బలమైన ఐక్యతనే ప్రదర్శించాలి. అందుకు బలమైన సాక్ష్యం కూడా మొన్నటి తమిళనాడు లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే అత్యధిక సీట్లను గెలుచుకోవడం. ఎన్నికల అనంతం కూడా డీఎంకే మిత్రపక్షాలు గట్టి ఐక్యతను చాటాయి. హిందీయేతర రాష్ట్రాలపై హిందీని రుద్దవద్దని గట్టిగా నినదించడంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ‘నేషనల్ ఎలిజబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్’ వల్ల తమ రాష్ట్రం విద్యార్థులకు అన్యాయం జరుగుతోందన్న విషయంలో కూడా వారు ఐక్యతా బలాన్ని ప్రదర్శిస్తున్నారు.
ప్రతిపక్షాల ఐక్యతకు మొదట్లో కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ అప్పుడే కాడి పడేయకుండా బీజేపీకి ఎప్పటికప్పుడు చెక్ పెట్టడానికి ప్రతిపక్షాలను ఎల్లప్పుడు ఏకతాటిపైకి తీసుకురావాలి, అందుకు ఎప్పుడూ కృషి చేయాల్సిందే. లేకపోతే ఆ పార్టీకి మనుగడే ఉండదు.
Comments
Please login to add a commentAdd a comment