సాక్షి, బెంగళూరు : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి కుమారుడు నిఖిల్ వివాహ వేడుకపై వివాదం నెలక్కొంది. కరోనా వైరస్ నేపథ్యంలో అందరూ సామాజిక దూరం పాటించాలన్న ప్రభుత్వ ఆదేశాలకు కనీసం పాటించకుండా వివాహం జరిపించారని అధికార బీజేపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో వివాహ వేడుకపై విచారణ జరిపించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఆదేశించారు. కాగా బెంగళూరు సమీపంలోని రాంనగర్‌లోని ఫాంహౌస్‌లో నిఖిల్ కుమార స్వామి-రేవతిల పెళ్లి శుక్రవారం ఉదయం జరిగిన విషయం తెలిసిందే. వధువరులతో పాటు ఎవరూ కూడా ముఖానికి మాస్క్‌లు ధరించినట్లు కనిపించట్లేదు. ఈ వివాహానికి వందలాది మంది అతిథులు వచ్చారని పలువురు సోషల్ మీడియా వేదికగా ఆరోపిస్తున్నారు. (నిరాడంబరంగా మాజీ సీఎం ఇంట పెళ్లి)
ఇక దీనిపై కేంద్రహోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి కూడా విమర్శలు గుప్పించారు. వైరస్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో ఎలాంటి భద్రతలేకుండా వివాహం వేడుకలేంటని అసహనం వ్యక్తం చేశారు. ఆదర్శంగా ఉండాల్సిన మాజీ ప్రధాని దేవెగౌడ , మాజీ సీఎం కుమారస్వామి లాక్‌డౌన్ సమయంలో పెళ్లి చేయడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. కాగా పెళ్లి వేడుకకు ముఖ్యమంత్రి యడియూరప్ప కూడా హాజరుకావడం గమనార్హం. కుమారస్వామితో కరచాలనం చూస్తూ సీఎం ఫోటోలకు పోజులిచ్చారు.
మరోవైపు రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పూర్తిగా అదుపులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 359గా నమోదైంది. శుక్రవారం తాజాగా 44 పాజిటివ్ కేసులు వెలుగుచూసినట్లు వైద్యశాఖ అధికారులు వెల్లడించారు. కరోనా కట్టడికి ప్రభుత్వ అధికారులు కఠిన చర్యలు అమలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment