ఆయనే నా భర్త అయితేబాగుండనుకున్నా! | sumalatha special interview | Sakshi
Sakshi News home page

ఆయనే నా భర్త అయితేబాగుండనుకున్నా!

Published Sat, Aug 23 2014 10:46 PM | Last Updated on Mon, Aug 20 2018 6:18 PM

sumalatha special interview

రీల్ పైనా, రియల్ గానూ
 అంబరీష్ రెబల్‌స్టార్...
 కానీ, సుమలత అలా కాదు!
 ఆన్ స్క్రీన్ ఆమె చాలా ఫాస్ట్...
 ఆఫ్ స్క్రీన్ మాత్రం చాలా చాలా సాఫ్ట్..
 అంబరీషేమో సోసోగా ఉంటారు...
 సుమలతేమో గొప్ప అందగత్తె...
 కానీ జోడీ కుదిరింది..
 ఇద్దరూ ప్రేమలో పడ్డారు...
 పెళ్లి కూడా చేసుకున్నారు...
 భిన్న మనస్తత్వాలున్న ఈ ఇద్దరి కాపురం ఇప్పుడు మూడు పువ్వులు
 ఆరు కాయలుగా సాగుతోంది...
 అసలు వీళ్ల ప్రేమకథ ఎలా మొదలైంది?
 రెబల్‌స్టార్ అంబరీష్‌ని సుమలత  ఇష్టపడటానికి కారణం ఏంటి?
 తెలుగింటి గోంగూర రుచి తెలిసిన  సుమలత, కన్నడ బిసిబేళా బాత్‌ను  ఎలా ఇష్టపడగలిగారు?
 ఒకప్పుడు కథానాయికగా దక్షిణాదిన ఓ వెలుగు వెలిగిన సుమలత ఇప్పుడేం చేస్తున్నారు? తెలుగు సినీరంగానికి దూరమైన తర్వాత ఇంటర్వ్యూలకి కూడా దూరంగా ఉంటున్న సుమలత పుట్టిన రోజు ఈ నెల 27న. ఈ సందర్భంగా ఈ తెలుగింటి సుమపరిమళాలు ‘సాక్షి’ పాఠకులకు ప్రత్యేకం...

 
తెలుగింటి ఆడపడుచైన మీరు కన్నడ ఇంటి కోడలిగా సెటిలై పోయారు... జీవితం ఎలా ఉంది?
సుమలత: చాలా బాగుందండి. కన్నడవాళ్లు నన్ను తమ అమ్మాయిగా అంగీకరించారు. నన్నెంతగా అభిమానిస్తున్నారంటే.. నా నేపథ్యం తెలియనివాళ్లు నేను కన్నడ అమ్మాయినే అనుకుంటున్నారు. ఒక రాష్ర్టంలో పుట్టి, పెరిగి మరో రాష్ట్రంలో ఇంతటి అభిమానం సంపాదించుకున్నందుకు ఆనందంగా ఉంది. మన గోంగూర ఎంత రుచిగా ఉంటుందో కన్నడ బిసిబేళా బాత్ కూడా అంతే రుచిగా ఉంటుంది.
     
కానీ, తెలుగు సినిమాలకు దూరం కావడం బాధగా లేదా?
ఎందుకుండదు? అడపా దడపా నేను కన్నడ చిత్రాల్లో నటిస్తున్నాను. అప్పుడు మన మాతృభాషలో సినిమాలు చేయలేకపోతున్నామనే బాధ కలుగుతుంటుంది. తెలుగు పరిశ్రమ నుంచి నాకు అవకాశాలు వస్తున్నాయి. కానీ, తీరిక చిక్కడం లేదు. ఒకవేళ తీరిక చేసుకుని చేస్తే, ఆ పాత్ర ఎంతో విలువైనది అయ్యుండాలి. అప్పుడే అర్థం ఉంటుంది. ఈ మధ్యకాలంలో గొప్పగా అనిపించిన పాత్రలేవీ రాలేదు. పైగా, అప్పట్లో మాతో సినిమాలు చేసిన విశ్వనాథ్ గారు, రాఘవేంద్రరావు గారి లాంటి దర్శకులు ఇప్పుడు సినిమాలు చేయడం లేదు. ఒకవేళ  చేస్తే ఆ సినిమాల్లో నటించవచ్చు.
     
అంటే.. ఇప్పుడు వస్తున్న దర్శకులతో సినిమాలు చేయాలనుకోవడం లేదా?
 అలా ఏం లేదు. ఇప్పుడొస్తున్నవారిలో రాజమౌళి, శేఖర్ కమ్ముల లాంటి ప్రతిభావంతులైన దర్శకులు చాలామంది ఉన్నారు. నిజం చెప్పాలంటే ఇప్పటి దర్శకులను చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంటుంది. కొత్త కొత్త కాన్సెప్ట్‌లతో సినిమాలు తీస్తున్నారు. టెక్నాలజీ మీద మంచి అవగాహన ఉంటోంది. కొత్త తరహా పాత్రలను సృష్టిస్తున్నారు. మా తరంలో ఇలాంటి దర్శకులు కూడా ఉండుంటే బాగుండేది కదా అనిపిస్తుంటుంది.
     
ఆ మధ్య తెలుగులో ‘బతుకు జట్కా బండి’ షో చేశారు కదా! ఆ తర్వాత మళ్లీ బుల్లితెరపై కనిపించలేదు?
బుల్లితెరపై నా మొదటి షో అది. ఆ కాన్సెప్ట్ నచ్చి చేశాను. ముందు నలభై ఎపిసోడ్స్ అనుకున్నాం.. స్పందన బాగుండటంతో 100 ఎపిసోడ్స్ చేశాం. దక్షిణాదిన అన్ని భాషల్లో కలిపి నేను రెండు వందల పైచిలుకు చిత్రాలు చేశాను. వాటి ద్వారా మంచి గుర్తింపు వచ్చినప్పటికీ ఈ షో తెచ్చిన గుర్తింపు అంతకు రెట్టింపు. ప్రపంచంలో ఏ మూలకెళ్లినా దీని గురించి మాట్లాడి, అభినందిస్తున్నారు. ఇప్పటికీ చిన్న స్థాయి ఉద్యోగుల నుంచి సాఫ్ట్‌వేర్ జాబ్ చేసేవాళ్లు, వ్యాపారస్థులు కూడా ఈ షో గురించి మాట్లాడుతున్నారు. ఓ సినిమా నటిగా ‘కామన్ మేన్’ జీవితంలో ఉండే ఒడుదొడుకుల గురించి చర్చించే వీలు నాకు దొరకలేదు. కానీ, ఈ షో ద్వారా ఎంతోమంది జీవితాలను తెలుసుకున్నాను. ‘ఇలాంటి కష్టాలు కూడా ఉంటాయా’ అనిపించింది. ఇదే షోను కన్నడంలో చేయమన్నారు. కానీ, నా భర్త రాజకీయాల్లో ఉన్నారు కదా. స్వలాభం కోసం మేమిలాంటి షో చేస్తున్నామనే రంగు పులిమేస్తారని భయంతో ఒప్పుకోలేదు.
      
మీ తరం వారిలో సీరియల్స్ నిర్మిస్తున్న, నటిస్తున్న తారలున్నారు... మరి మీరు సీరియల్స్ జోలికి వెళ్లకపోవడానికి కారణం?
 నాకంత ఓపిక, సమయం లేదు. ఇప్పుడే కాదు.. భవిష్యత్తులో కూడా సీరియల్స్‌కి దూరంగానే ఉండాలనుకుంటున్నా. మరి... ఏం జరుగుతుందో?
     
సమయం లేదంటున్నారు. అంత బిజీయా?
నేను కాకపోయినా నా భర్త చాలా బిజీ. ఆయన కర్నాటక రాష్ట్ర మంత్రి అనే విషయం తెలిసిందే. అప్పుడప్పుడు సినిమాలు కూడా చేస్తుంటారు. నిత్యం బిజీగా ఉంటారు. ఆయనకు నా సపోర్ట్ చాలా అవసరం. నేను కూడా బిజీ అయిపోతే ఎలా? ఎవరో ఒకరు ఖాళీగా ఉంటే.. ఇంకొకరికి సహాయంగా ఉండొచ్చు కదా! అందుకే నేనెక్కువ కమిట్‌మెంట్స్ పెట్టుకోవడం లేదు.
     
అంబరీష్‌కు రీల్ జీవితంలోనే కాదు.. రియల్ జీవితంలోనూ ‘రెబల్ స్టార్’ అనే ఇమేజ్ ఉంది. ఎలా నెట్టుకొస్తున్నారు?
(నవ్వుతూ...) జీవిత భాగస్వాముల్లో ఒకరు రెబల్‌గా ఉంటే ఒకరు సాఫ్ట్‌గా ఉండాలి. అంబరీష్ మొదటి రకం అయితే నేను రెండో రకం. అందుకని, మా జీవితం సాఫీగా సాగుతోంది. అంబరీష్ చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. మంచి విలువలున్న వ్యక్తి.
     
మీ ఇద్దరిదీ ప్రేమ వివాహం కదా!అసలు అంబరీష్‌పై ప్రేమ కలగడానికి కారణం?
 ఆయన మనస్తత్త్వమే. చాలా మంచి వ్యక్తి. దాన వీర శూర కర్ణ, కలియుగ కర్ణ, మానవతామూర్తి... ఇలా కన్నడ రంగంలో ఆయన మంచితనానికిబోల్డన్ని బిరుదులున్నాయి. ఇతరులకు సహాయం చేసే విషయంలో ఎప్పుడూ ఆయన వెనకడుగు వేయలేదు. అవన్నీ స్వయంగా చూశాను. అందుకే... ఆయనే నా భర్త అయితే బాగుండనుకున్నాను. నాది సున్నితమైన మనస్తత్త్వం కాబట్టి, ఆయన ఇష్టపడ్డారు.
     
మీ మధ్య ఎప్పుడు ప్రేమ మొదలైంది?
మాది తొలి చూపులో ఏర్పడ్డ ప్రేమ కాదు. ఇద్దరం కలిసి చాలా సినిమాలు చేశాం. ముందు మంచి స్నేహం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. ఆ మార్పు ఫలానా సమయంలో వచ్చిందని చెప్పలేను. మాకు తెలియకుండానే ప్రేమలో పడిపోయాం. అంబరీష్ మంచి స్నేహశీలి. ఆయనకు బోల్డంత మంది మంచి స్నేహితులున్నారు. దాంతో, ఎప్పుడూ బిజీయే. రజనీకాంత్ గారైతే.. ‘నాకు తెలిసి ఇండియాలో మీ ఆయనకు ఉన్నంత మంది స్నేహితులు వేరే ఎవరికీ ఉండరేమో’ అంటుంటారు. స్నేహితుల కోసం ఆయన ఏమైనా చేస్తుంటారు.
 
మరి.. ఆ స్నేహం కారణంగామీరెప్పుడూ ఇబ్బంది పడలేదా?
పెళ్లయిన కొత్తలో ప్రైవసీ కోరుకుంటాం కాబట్టి, కొంచెం ఇబ్బందిగా ఉండేది. స్నేహితుల గురించి మా మధ్య చిన్న చిన్న గొడవలు కూడా జరిగాయి. అయితే, అదృష్టవశాత్తూ ఆ గొడవలు ముదురు పాకాన పడి, విడిపోయేంత వరకూ రాలేదు. ఆయన పగలంతా స్నేహితులు, పనులతో బిజీగా ఉన్నా, సాయంత్రం మాత్రం పూర్తిగా కుటుంబానికే అంకితమైపోతారు.
     
సహాయం చేసే విషయంలో అంబరీష్ వెనకాడరని చెప్పారు కదా! ఆ విషయంలో ఆయన్ను వెనక్కి లాగడానికి ప్రయత్నించేవారా?
లేదు. ఎందుకంటే, నేను ఆయనను ఎక్కువ ఇష్టపడానికి కారణం అదే. పెళ్లికి ముందు ఇష్టపడిన విషయం తీరా పెళ్లి అయిపోయాక ఎందుకు కష్టంగా ఉంటుంది. కాకపోతే, అర్హత లేనివాళ్లకు సహాయం చేసినప్పుడు మాత్రం వారిస్తుంటాను. అప్పుడాయన ‘నాకు సహాయం చేయాలనిపించింది.. చేశాను. ఒకవేళ వెన్నుపోటు పొడిచారనుకో.. అది వాళ్ల కర్మ’ అంటుంటారు. ఎవరికైనా సహాయం చేస్తే, వాళ్లు తిరిగి తనకేదో చేయాలనీ, జీవితాంతం ఋణపడి ఉండాలనీ కోరుకోరు. ఆయన అంత మంచి వ్యక్తి. అందుకే, ఆయనను జీవిత భాగస్వామిగా పొందడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఈ డిసెంబర్‌కి మా పెళ్లయ్యి 23 ఏళ్లు పూర్తవుతోంది. ఇన్నేళ్ల మా వైవాహిక జీవితం బోల్డన్ని మర్చిపోలేని జ్ఞాపకాలను మిగిల్చింది. ఆ దేవుడు నాకు ఇచ్చిన మంచి బహుమతి ‘అంబరీష్’.
     
మీకు కూడా స్నేహితులున్నారా?
మా తరంలో నటించినవారిలో నాకు సుహాసిని క్లోజ్ ఫ్రెండ్. మేమిద్దరం తెలుగు, తమిళంలో ఏడెనిమిది సినిమాల్లో కలిసి నటించాం. ఆ సమయంలో మంచి స్నేహం ఏర్పడింది. ఇద్దరం తరచూ ఫోన్లో మాట్లాడుకోం కానీ, స్నేహితులమే. సుహాసిని బెంగళూరు వస్తే.. మా ఇంటికి రాకుండా వెళ్లదు. నేను చెన్నై వెళితే వాళ్లింటికి వెళ్లకుండా ఉండను.
     
తెలుగు పరిశ్రమలో కూడా మీవారికి మంచి స్నేహితులన్నారనుకుంటా?
 అవును. మోహన్‌బాబు గారు, చిరంజీవి గారు, హిందీ రంగంలో శతృఘ్న సిన్హా గారు, తమిళంలో రజనీకాంత్ గారు.. ఇలా చాలామంది స్నేహితులున్నారు. ఆ మధ్య అంబరీష్‌కి ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్ళందరూ పరామర్శించారు. మోహన్‌బాబు గారైతే బెంగళూరు వచ్చి, మా ఆయనను చూడగానే ఒక్కసారిగా కంట తడిపెట్టుకున్నారు. ఆ అభిమానం చూసి, చాలా సంతోషం అనిపించింది.
     
బహుశా మీ జీవితంలో బాగా టెన్షన్ పడిన సందర్భం అంబరీష్‌కి ఆరోగ్యం బాగా లేనప్పుడేనేమో?
వంద శాతం కరెక్ట్. ఆ సమయంలో నేను అనుభవించిన బాధ అంతా ఇంతా కాదు. ఆయనకు ఆరోగ్యం బాగాలేదని తెలియగానే... అభిమానులు పూజలు చేశారు. హోమాలు నిర్వహించారు. పొర్లుదండాలు పెట్టారు. అలాంటివన్నీ విని కదిలిపోయాను. అసలు మమ్మల్ని కలుస్తారో లేదో తెలియదు. పోనీ మా ద్వారా ఏమైనా లాభం కలుగుతుందా? అంటే అదీ లేదు. ఎక్కడో మారుమూల గ్రామాల్లో ఉన్నవాళ్లు సైతం ఆయన ఆరోగ్యం కోసం పూజలు చేశారు. అసలే సినిమా పరిశ్రమ అంటే నాకు చాలా అభిమానం. ఈ సంఘటనతో ఆ అభిమానం మరింత పెరిగిపోయింది. ‘సినిమా పరిశ్రమ మీకు ఇంతమంది అభిమానులను ఇస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెస్తోంది’ అని ఆ దేవుడు ఇలాంటి సంఘటనల ద్వారా మా సినిమా పరిశ్రమవారికి చూపిస్తాడేమో అనిపించింది.
     
ఇప్పుడు అంబరీష్ ఆరోగ్యం ఎలా ఉంది?
చాలా బాగున్నారు. అంతా ఆ దేవుడి దయ.
 
మీ పిల్లల గురించి?
మాకు ఒకే ఒక్క బాబు. పేరు - అభిషేక్ గౌడ. లండన్‌లో ఎం.ఎస్. చేస్తున్నాడు. తన చదువు కూడా పూర్తయిపోతే నాకు పెద్ద బాధ్యత తీరిపోతుంది.
 
మీ అబ్బాయిని సినిమాల్లోకి తీసుకు రావాలనుకుంటున్నారా?
అభిషేక్‌కు ఏది నచ్చితే దానికి ఓకే చెప్పడానికి నేను, అంబరీష్ సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ సినిమాల్లోకి రావాలనుకున్నాడనుకోండి.. అప్పుడు గెడైన్స్ మాత్రమే ఇస్తాం. ‘మన అబ్బాయి కోసం నేను సినిమా తియ్యను. ఆర్టిస్ట్ కావాలనుకుంటే వాడే శిక్షణ తీసుకోవాలి. అన్ని రకాలుగా తయారైన తర్వాత నేను గెడైన్స్ ఇస్తా. అంతేకానీ రికమండేషన్ చేయను’ అని అంబరీష్ అంటుంటారు. నా అభిప్రాయం కూడా అదే. కష్టం, సుఖం.. ఏదైనా స్వయంగా తెలుసుకుంటేనే జీవితం బాగుంటుందన్నది మా ఇద్దరి అభిప్రాయం. మా వాడికి రాజకీయాలంటే ఆసక్తి ఉంది. ఒకవేళ రాజకీయాల్లోకి వెళ్లాలనుకున్నాడనుకోండి... అప్పుడు కింద స్థాయి నుంచి కృషి చేసి, పైకి రమ్మని చెబుతాం. అంతేకానీ ‘మా వారసుడు వస్తున్నాడు...’ అంటూ వాడికి రహదారి వేయాలని అనుకోం.
     
ఓసారి ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళదాం.. అప్పట్లో హీరోయిన్ కావాలని మీకు ఉండేదా?
లేదు. నేను బాగా చదువుకునేదాన్ని. స్కాలర్‌షిప్ కూడా వచ్చేది. నేను మిస్ ఆంధ్రప్రదేశ్ బిరుదు సంపాదించిన తర్వాత సినిమా అవకాశాలు రావడం మొదలైంది. అప్పుడు పదో తరగతి చదువుతున్నాను. పరీక్షలు పూర్తయిన తర్వాత సెలవుల్లో సినిమా చేశాను. అది తమిళ చిత్రం. పేరు - ‘దిశై మారియ పరవైగళ్’. ఒకవేళ ఆ సినిమా వర్కవుట్ కాకపోతే, హాయిగా చదువుకోవచ్చనుకున్నాను. కానీ, మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు రావడం, బిజీ కావడం జరిగిపోయాయి. 1979లో ఆ సినిమా చేశాను. అదే ఏడాది ‘సమాజానికి సవాల్’ చిత్రం ద్వారా తెలుగు పరిశ్రమకు పరిచయమయ్యాను. ఆ చిత్రం తర్వాత తెలుగులో కూడా బిజీ అయ్యాను. దాంతో చదువుకు ఫుల్‌స్టాప్ పెట్టక తప్పలేదు. పోనీ ప్రైవేట్‌గా చదువుకుందామన్నా కుదరలేదు. అదొక్కటే బాధ.
     
సినిమా రంగం పరంగా పశ్చాత్తాపపడాల్సిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా?
 మంచి పాత్రలు చాలానే చేశాను. ఇంకా చేసి ఉంటే బాగుండేదనే ఫీలింగ్ తప్ప, వేరే రకంగా నాకెలాంటి పశ్చాత్తాపమూ లేదు. చాలామంది సినిమా రంగం గురించి తప్పుగా మాట్లాడతారు. కానీ, ఇది అద్భుతమైన పరిశ్రమ. పేరు, డబ్బుతో పాటు అభిమానులను ఇస్తుంది. ఈ అదృష్టం ఏ రంగంలో దక్కుతుంది. గత 34 ఏళ్లుగా సినిమా పరిశ్రమతో నా అనుబంధం కొనసాగుతోంది. ఈ పరిశ్రమలో ఉండడం ఆ దేవుడి ఆశీర్వాదం అనుకుంటున్నా.
     
మీకో చెల్లెలున్నారు కదా.. ఆవిడ ఏం చేస్తున్నారు?
నా చెల్లెలు ప్రియ హైదరాబాద్‌లో ఉంటోంది. ప్రసాద్ ల్యాబ్ సీజీ, త్రీడీ యానిమేషన్ శాఖకు  హెడ్‌గా వ్యవహరిస్తోంది. కెమెరామేన్ అజయన్ విన్సెంట్‌ను వివాహం చేసుకుంది.
     
{పతి ఏడాదీ ‘సౌత్ సూపర్ స్టార్స్ 1980 రీ యూనియన్’ పేరుతో మీ తరం నటీనటులు కలుసుకుంటున్నారు కదా! దాని గురించి చెబుతారా?
 నాకు తెలిసి మన భారతదేశంలో ఉత్తరాదిన ఇలాంటి రీ యూనియన్ లేదు. ఏడాదికోసారి కలుసుకోవాలని మేం ఐదేళ్ల క్రితం అనుకున్నాం. దానిని ఆచరిస్తున్నాం. పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవడం, హాయిగా కబుర్లు చెప్పుకోవడం, ఆటపాటలతో మా రీ-యూనియన్ పార్టీ చాలా జోరుగా ఉంటుంది. గత ఐదేళ్లుగా కలుసుకుంటున్నాం.. రానున్న సంవత్సరాల్లో కూడా కలవాలనే అనుకుంటున్నాం.
     
ఫైనల్‌గా వృత్తి జీవితం, వ్యక్తిగత జీవితం గురించి ఏం చెబుతారు?
రెండూ సంతృప్తికరంగానే ఉన్నాయి. సినిమాలు చేసినా చేయకపోయినా అభిమానులు మాత్రం అలానే ఉంటారు. ఎక్కడైనా కనిపిస్తే.. ‘సినిమాలు చేయడం లేదేంటి’ అంటూ ఆప్యాయంగా పలకరిస్తారు. అంతకన్నా ఏం కావాలి? (నవ్వుతూ..) ఇక, అంబరీష్ లాంటి భర్తను పొందిన ఏ భార్య జీవితం అయినా హాయిగా ఉంటుంది.
 
- డి.జి. భవాని
 
మా ఆయన కోసం నేను ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నాను కానీ, రాజకీయాలపై పెద్దగా ఆసక్తి లేదు. ఎంపీగా పోటీ చేయమని కొంతమంది ఒత్తిడి చేశారు. కానీ, ఆయనా రాజకీయాల్లో ఉండీ, నేను అక్కడే ఉంటే ఇక ఇంటిని చూసుకునేదెవరు? 100 శాతం కాకపోయినా 99 శాతం న్యాయం చేయగలం అనేంత తీరిక చిక్కితే అప్పుడు రాజకీయాల గురించి ఆలోచిస్తా.
 
దర్శకత్వం అనేది అంత సులువైన పని కాదు. సినిమా మీద చాలా పట్టు ఉండాలి. అన్ని శాఖల మీద అవగాహన ఉండాలి. చాలా ఓపిక ఉండాలి. నాకు తెలిసి దర్శకత్వం నాకు సరిపడదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement