సాక్షి, బెంగళూరు: విధానసభ ఎన్నికల్లో మాజీ మంత్రి, నటుడు అంబరీశ్‌తో పాటు పలు నియోజకవర్గాలకు చెందిన ప్రముఖ నేతలకు కాంగ్రెస్ టికెట్ దక్కే సూచనలు కనిపించడం లేదు. ముఖ్యంగా మండ్య ఎమ్మెల్యే అంబరీశ్ గతకొద్ది కాలంగా కాంగ్రెస్ పార్టీతో అంటీముట్టనట్లుగా ఉంటుండడం, టికెట్‌కు సైతం దరఖాస్తు చేయకపోవడంతో కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు టికెట్ ఇవ్వడానికి సుముఖంగా లేదని సమాచారం. ఈ నేపథ్యంలో తనకు బదులుగా అర్ధాంగి సుమలతకు టికెట్ ఇవ్వాలని అంబి కోరుతున్నట్లు వినికిడి. రాష్ట్రంలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వడానికి కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు తెలుసుకున్న అంబరీశ్ మండ్య నుంచి టికెట్ తమకే వస్తుందన్న ధీమాతో అర్జీ వేయలేదని సమాచారం. దీంతో కాంగ్రెస్ పెద్దలు కూడా రెబెల్‌స్టార్‌ను కరుణించేలా లేరు.
అంబరీశ్‌కు టికెట్ వద్దా?
అయితే నేరుగా టికెట్ ఇవ్వడం కుదరదనే ప్రకటన చేస్తే అంబరీశ్ తిరుగుబాటు బావుటా ఎగురవేసే ప్రమాదం ఉందని గ్రహించిన కాంగ్రెస్ అధిష్టానం అంబరీశ్ అనారోగ్యాన్ని సాకుగా చూపి టికెట్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నట్లు సమాచారం. సీఎం సిద్ధరామయ్య మాత్రం మండ్య నుంచి అంబరీశ్‌కే టికెట్ ఇప్పించడానికి తీవ్రంగా శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది. మండ్య నుంచి ఆయన కాకుండా ఇంకెవరు పోటీ చేసినా ఓటమి తప్పదనే అనుమానం సిద్ధరామయ్యను పీడిస్తున్నట్లు తెలుస్తోంది.
సుమలతకు అవకాశానికి వినతి
అయితే అంబరీశ్ ఆలోచన మరోలా ఉన్నట్లు సమాచారం. మండ్యలో తనకు బదులు సతీమణి సుమలతకు టికెట్ ఇవ్వాలంటూ కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరినట్లు సమాచారం. తనకు అనారోగ్య సమస్యలు ఉన్నందువల్ల పోటీ చేయాలనుకోవడం లేదని, కాబట్టి భార్యకు అవకాశం కల్పించాలని అంబి కోరినట్లు సమాచారం. ఈ విషయంపై అంబరీశ్, సుమలతలు ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. కాగా, అంబరీశ్‌తో పాటు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవలందిస్తున్న బాదామి ఎమ్మెల్యే చిమ్మనకట్టి, హానగల్‌కు చెందిన నేత మనోహర్ తదితరులకు కూడా ఈసారి టికెట్ దక్కే అవకాశాలు దాదాపు లేనట్లేనన్న వార్తలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment