గృహహింస, లైంగిక వేధింపుల నియంత్రణపై ముఖ్యమంత్రి
Published Fri, Sep 13 2013 2:56 AM | Last Updated on Fri, Sep 1 2017 10:39 PM
న్యూఢిల్లీ: నాలుగు గోడల మధ్య జరిగే దారుణాలను ఆపడం కష్టమేనని ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ అభిప్రాయపడ్డారు. బయట జరిగే దారుణాలను అరికట్టే అవకాశమున్నా ఇళ్లల్లో జరిగేవాటిని నియంత్రించడం పోలీసులకు అగ్నిపరీక్షేనన్నారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అసోసియేషన్ ఇన్ ఆసియా అండ్ ఓషినియా(సీఎంఏఏఓ) 28వ సదస్సు సందర్భంగా గురువారం నగరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె ప్రసంగిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. మహిళలు, చిన్నపిల్లల పట్ల జరుగుతున్న దారుణాల విషయంలో పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందన్నారు.
నిర్భయ ఘటన తర్వాత పోలీసులు అప్రమత్తంగానే ఉంటున్నారని, వారి పనితీరు సంతృప్తికరంగానే ఉందన్నారు. కేసుల పరిష్కారం కోసం పోలీసులు ఎలక్ట్రానిక్ పరికరాల సాయాన్ని తీసుకోవాలని, నేరం జరిగినట్లు సమాచారం అందినవెంటనే స్పందించాలని సూచించారు. అయితే ఇళ్లల్లో జరుగుతున్న నేరాల సమాచారం పోలీసుల వద్దకు చేరడంలో ఆలస్యమవుతోందని, చాలా సందర్భాల్లో పోలీసుల వరకు కూడా రావడంలేదన్నారు. ఇటువంటి నేరాల ను, లైంగిక వేధింపులను నియంత్రించడం కష్టంగా మారిందని షీలాదీక్షిత్ అభిప్రాయపడ్డారు. రహదారులు, మాల్స్, బస్సులు, సినిమా థియేటర్ల వంటి జనసంచారమున్న బహిరంగ ప్రదేశాల్లో జరుగుతున్న నేరాలను నియంత్రించడం సాధ్యమేనని, అయితే నాలుగు గోడల మధ్య జరుగుతున్న దారుణాలను ఎలా నియంత్రించగలమని ప్రశ్నించారు.
విద్యాబుద్ధులతోనే మార్పు...
విద్యాస్థాయిని పెంచడం ద్వారానే సమాజంలో ఈ పరిస్థితి నుంచి మార్పును ఆశించవచ్చని షీలా అభిప్రాయపడ్డారు. స్త్రీలు, పిల్లల పట్ల వ్యవహరిస్తున్న తీరులో మార్పు వచ్చినప్పుడే ఈ దురాగతాలకు స్వస్తిపలికినట్లవుతుందని, విద్యా, సంస్కృతులు మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరముందన్నారు. దేశ విదేశాల్లో మహిళలు, పిల్లల పట్ల జరుగుతున్న నేరాల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతోనే వాటి నియంత్రణ కోసం ఏం చేయాలనే విషయమై ఇక్కడ సమావేశమైనట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నరేందర్ సైని చెప్పారు. మహిళలకు అన్ని రకాల దాడుల నుంచి రక్షణ కల్పించాల్సిన అవసరముందన్నారు.
డిసెంబర్ 16 తర్వాత పరిస్థితి మారింది..
డిసెంబర్ 16న చోటుచేసుకున్న సామూహిక అత్యాచారం ఘటన తర్వాత మహిళల భద్రత విషయంలో నగరంలో కొంత పురోగతి కనిపిస్తోందని ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ పేర్కొన్నారు. అయితే ఆశించినమేర భద్రత కల్పించాలంటే మరింతగా శ్రమించాల్సి ఉందన్నారు. ఇది రాత్రికి రాత్రే సాధ్యమయ్యే పనికాదని, ముఖ్యంగా ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరముందన్నారు.
Advertisement