న్యూఢిల్లీ: ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ తమ కీలకమైన ప్రచారకురాలిగా ఉంటారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ ఢిల్లీ ఇన్‌ఛార్జి పీసీ చాకో చెప్పారు. ఎన్నికల సమయంలో కీలక పాత్ర పోషించకుండా ఆమెను పక్కన పెట్టారని, షీలా సైతం కినుక వహించారని వచ్చిన పుకార్లకు దీంతో తెరపడింది. తాను ఆమెను కలుసుకున్నానని, ఈ ఎన్నికల్లో పార్టీ కోసం షీలాదీక్షిత్ చురుకుగా ప్రచారం చేస్తారని చాకో చెప్పారు. ఎటువంటి భేదాభిప్రాయాలు లేవని, తమ ప్రధాన ప్రచారకరురాలు షీలాయేనని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ ఎన్నికల్లో దీక్షిత్ పోటీ చేస్తారా లేదా అన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.
ఎన్నికల ప్రణాళికను రూపొందించేందుకు ఈ నెల 3న జరిగిన సమావేశానికి మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ఇతర పార్టీ నేతలు హాజరు కాగా, షీలాదీక్షిత్‌తో పాటు ఆమె కుమారుడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్ గైర్హాజరయ్యారు. అది అనధికార సమావేశమని, ముందస్తు నిర్ణయించుకున్న కార్యక్రమాలుండటం వల్లనే షీలా ఆ సమావేశానికి హాజరుకాలేకపోయారని చాకో వివరించారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదని షీలాదీక్షిత్ ఇదివరకే స్పష్టం చేశారు.
షీలా మా కీలక ప్రచారకురాలు: చాకో
Published Sun, Dec 7 2014 11:15 PM | Last Updated on Sat, Sep 2 2017 5:47 PM
Advertisement