దేశానికే మేం ఆదర్శం
Published Fri, Aug 16 2013 3:39 AM | Last Updated on Fri, Sep 1 2017 9:51 PM
దశాబ్దం క్రితం దాకా అధ్వానస్థితిలో ఉన్న ఢిల్లీ నగరాన్ని తమ ప్రభుత్వం సర్వతోముఖంగా అభివృద్ధి చేసిందని ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ప్రకటించారు. కరెంటు చార్జీలను 30 శాతం తగ్గిస్తామంటూ విపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ఆహార భద్రత పథకం ద్వారా 73 లక్షల మంది పేదలకు అతి తక్కువ ధరలకే ఆహారధాన్యాలు సరఫరా చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.
సాక్షి, న్యూఢిల్లీ: ప్రజాహిత కార్యక్రమాలు, పథకాల అమలుకు దేశంలో మొట్టమొదట శ్రీకారం చుట్టే రాష్ట్రంగా ఢిల్లీని చూస్తున్నారని ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ అన్నారు. మొత్తం 73 లక్షల మంది పేదలను మరో రెండు నెలల్లో ఆహార భద్రత పథకం కిందకు తేవాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ఆగస్టు 20న భారీ ఎత్తున నిర్వహించే సభ ద్వారా ఆహార భద్రత పథకాన్ని దేశంలో మొట్టమొదట ప్రారంభిస్తామని షీలాదీక్షిత్ చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా తొలుత 32 లక్షల మందికి భారీ సబ్సీడీతో ఆహార ధాన్యాలను సరఫరా చేస్తారు. ఢిల్లీని ఆకలిరహిత నగరంగా మార్చడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె తెలిపారు. 73 ల క్షల మందిని వీలైనంత త్వరగా ఈ పథకం పరిధిలోకి తేవడానికి కృషి చేయాలని అధికారులు, సిబ్బందిని ఆదేశించామన్నారు. మహిళలను శక్తిమంతులుగా చేయడానికి కూడా ఈ పథకం ఉపకరిస్తుందన్నారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, యూపీయే చైర్‌పర్సన్ సోనియాగాంధీ ఆకాంక్ష మేరకు రూపొందించిన ఆహార భద్రత పథకం వల్ల ఢిల్లీలోని 1.32 లక్షల కుటుంబాలకు మేలు జరుగుతుందని షీలాదీక్షిత్ విశదీకరించారు.
ఛత్రసాల్ స్టేడియంలో గురువారం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవంలో ప్రసంగిస్తూ షీలాదీక్షిత్ పైవిషయాలు చెప్పారు. ముఖ్యమంత్రి హోదాలో వరుసగా 15 సార్లు స్వాతంత్య్ర దినోత్సవాల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ఖ్యాతిని కూడా ఆమె దక్కించుకున్నా. ఏసీపీ పవన్‌కుమార్ నేతృత్వంలో ఢిల్లీ పోలీసులు, హోంగార్డులు, సివిల్ డిఫెన్స్ సిబ్బంది, ఎన్సీసీ, రాష్ట్ర అగ్నిమాపకశాఖ, విద్యార్థులు నిర్వహించిన పరేడ్‌ను ఆమె తిలకించారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి ఢిల్లీకి రావాల్సిన నిధుల వాటా పెరగకపోయినా, ఢిల్లీ ఆర్థికంగా పురోగమిస్తోందని షీలాదీక్షిత్ వెల్లడించారు. రూ.రెండు లక్షల చొప్పున ఢిల్లీవాసి తలసరి ఆదాయం దేశంలోనే అత్యధికమని ఆమె చెప్పారు. గడిచిన 15 సంవత్సరాలలో ఢిల్లీ అనూహ్యంగా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. 1998లో తాము అధికారంలోకి వచ్చినప్పటి పరిస్థితులను ఆమె గుర్తుచేశారు. ‘అప్పట్లో రోజుకు 11 గంటలకు పైగా విద్యుత్ కోతలు ఉండేవి. కరెంటు కోసం వీధుల్లో ఘర్షణలు జరిగేవి . విద్యుత్ సంస్కరణలను విజయవంతంగా అమలు చేయడం వల్ల సరఫరా స్థితి మెరుగుపడింది’ అని చెబుతూ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ‘1998లో అధికారంలో ఉన్న ప్రభుత్వం (బీజేపీ) కేవలం 1,900 మెగావాట్ల డిమాండ్‌ను తీర్చలేకపోయింది.
అదే ఇప్పుడున్న ప్రభుత్వానికి ఆరు వేల మెగావాట్ల డిమాండ్‌ను తీర్చగల సామర్థ్యం ఉంది’ అని ఆమె చెప్పారు. కరెంటు సరఫరా, పంపిణీ నష్టాలను 55 శాతం నుంచి 15 శాతానికి తగ్గించగలిగామని తెలిపారు. గ్రిడ్ వైఫల్యం నుంచి రక్షించడానికి ఢిల్లీలో పవర్ ఐలాండింగ్‌ను అమలు చేశామన్నారు. ఢిల్లీలో విద్యుత్ చార్జీలు ఎన్సీఆర్ పట్టణాలు, మెట్రో పట్టణాల కన్నా తక్కువగా ఉన్నాయని ముఖ్యమంత్రి చెప్పారు. షీలా ప్రభుత్వం 200 యూనిట్ల వరకు ఇచ్చే సబ్సీడీని పెంచడమే కాక 201 నుంచి 400 యూనిట్ల వినియోగదారులకు కూడా కొత్తగా సబ్సిడీని ప్రకటించింది. రాజకీయ ప్రయోజనాల కోసం విద్యుత్ చార్జీలను 30 శాతం తగ్గిస్తామంటూ విపక్షాలు ఇస్తున్న బూటకపు హామీలను ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారని షీలాదీక్షిత్ తెలిపారు. అంతభారీ స్థాయిలో విద్యుత్ చార్జీలను తగ్గించే మంత్రదండమేదీ లేదని ఆమె చెప్పారు.
నీటిని రక్షించుకుందాం..
అన్ని ప్రాంతాలకూ నీటి సరఫరా అయ్యేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అదనపు నీటి సరరా కోసం ఢిల్లీ ఇతర రాష్ట్రాలపై ఆధారపడి ఉన్నందున, కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయని ఆమె చెప్పారు. మునాక్ కెనాల్‌పై పెట్టిన ఖర్చు వృథా అయిందని విచారం వ్యక్తం చేశారు. ‘ప్రతి నీటి చుక్కా అమూల్యమైనది. దానిని వృథా చేయవద్దు. నీటి బిల్లుల బకాయిలు, సర్‌చార్జీలను కూడా మా ప్రభుత్వం తగ్గించింది’ అని చెప్పారు.
రవాణారంగానికి పెద్దపీట
మౌలిక సదుపాయాలు, రవాణారంగంలో తమ ప్రభుత్వం తెస్తున్న పెనుమార్పుల వల్ల ఢిల్లీ అత్యుత్తమ నగరం కాగలగుతుందని ఆశాభావం ప్రకటించారు. ఏసీ, నాన్‌ఏసీ లోఫ్లోర్ బస్సులతో ప్రపంచస్థాయి రవాణా సదుపాయం కల్పించిన విషయాన్ని కూడా ప్రస్తావించారు.
అంతర్జాతీయ విమానాశ్రయాలకు దీటైన సదుపాయాలతో కశ్మీరీగేట్ ఐఎస్‌బీటీని అభివృద్ధి చేశామన్నారు. నాలుగోదశ మెట్రోపనులు పూర్తయితే, వాటి సేవల పరిధి మరో 400 కిలోమీటర్ల మేర పెరుగుతుందన్నారు. అనేక ప్రభుత్వ విభాగాల్లో ఈ-గవర్నెన్స్ ప్రాంభించడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని షీలాదీక్షిత్ చెప్పారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు, కోర్టుల్లో ఈ-పాలను తీసుకొస్తామని హామీ ఇచ్చారు. దేశంలో ఐదు అక్రెడిడేటెడ్ ఆసుపత్రులున్న నగరం ఢిల్లీ ఒక్కటేనని షీలాదీక్షిత్ చెప్పారు. ఇతర రాష్ట్రాలనుంచి వచ్చే 35 శాతం రోగులకు ఢిల్లీ ఆసుపత్రులు వైద్య సేవలను అందిస్తున్నాయన్నారు.
విద్యతోనే వ్యక్తిత్వ వికాసం
ఇక్కడి విద్యావ్యవస్థ విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడేలా ఉంటుందని చెప్పారు. బోర్డు పరీక్షలలో ఉత్తీర్ణులయ్యేవారి శాతం గణనీయంగా పెరిగిందన్నారు. 10వ తరగతి పరీక్షలలో ఉత్తీర్ణతశాతం 99.4 శాతానికి పెరిగిన విషయాన్ని గుర్తు చేశారు. విద్యాహక్కు చట్టం అమల్లో భాగంగా మరిన్ని పాఠశాలలు తెరుస్తున్నట్లు వెల్లడించారు. బాలల కోసం అకాడమీ ప్రాంభించిన తొలిరాష్ట్రం ఢిల్లీయేనన్నారు. ‘ప్రపంచంలోని హరిత రాజధానుల్లో ఢిల్లీ ఒకటి. నగర విస్తీర్ణంలో 20.2 శాతం హరితప్రదేశం. కామన్వెల్త్ క్రీడల కోసం అభివృద్ధి చేసిన సదుపాయాలు నగరంలో భాగంగా మారాయి’ అని ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ వివరించారు.
Advertisement