రాజస్తాన్‌ లైవ్‌ అప్‌డేట్స్‌: రికార్డు స్థాయిలో పోలింగ్‌ | Rajasthan Elections 2018 Assembly Elections 2018 Polling Live Updates | Sakshi
Sakshi News home page

రాజస్తాన్‌ ఎన్నికల పోలింగ్‌ లైవ్‌అప్‌డేట్స్‌

Published Fri, Dec 7 2018 7:28 AM | Last Updated on Fri, Dec 7 2018 5:14 PM

Rajasthan Elections 2018 Assembly Elections 2018 Polling Live Updates - Sakshi

సాయంత్రం 5 : రాజస్థాన్‌లో పోలింగ్‌ ముగిసింది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు రాష్ట్రం మొత్తంలో రికార్డు స్థాయిలో 72.7 శాతం పోలింగ్‌ నమోదైంది.

మధ్యాహ్నం 3.30 : రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణతో ఫతేపూర్‌లోని సుభాష్‌ స్కూల్‌ పోలింగ్‌ బూత్‌ వద్ద అలజడి రేగింది. ఇరు వర్గాల వారు ఒకర్నొకరు నిందించుకుంటూ వాహనాలకు నిప్పుబెట్టారు.దీంతో 30 నిముషాలపాటు ఓటింగ్‌ ప్రక్రియ నిలిచిపోయింది. పోలీసులు స్పందించి ఆందోళనకారులను అక్కడి నుంచి పంపించి వేయడంతో పోలింగ్‌ తిరిగి ప్రాంభమైంది. రాజస్థాన్‌లో ఇప్పటివరకు 60 శాతం పోలింగ్‌ జరిగినట్టు సమాచారం.

మధ్యాహ్నం 2.30 : మహిళా ఓటర్లకు తిప్పలు తప్పటం లేదు. గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సిన పరిస్ధితి ఏర్పడింది. గంటల పాటు వేచి ఉన్నప్పటికి ఓటు వేసే అవకాశం వస్తుందో రాదో అన్న అనుమానాలతో మహిళా ఓటర్లు కొట్టుమిట్టాడుతున్నారు. దుంగర్‌పూర్‌ జిల్లా దమ్‌బోలాలో అధికారులు మోడల్‌ పోలింగ్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. అందంగా పోలింగ్‌ స్టేషన్‌ను తీర్చిదిద్దారు.

మధ్యాహ్నం 2.00 : రాజస్తాన్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలు చోట్ల పోలింగ్‌ కేంద్రాలను అందంగా ముస్తాబు చేశారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు 49.15 శాతం ఓటింగ్‌ నమోదైంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్‌ జరుగుతోంది. కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి.

మధ్యాహ్నం 1.30 : రాజస్తాన్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 5నెలల చంటిబిడ్డను ఒడిలో ఎత్తుకుని విధులు నిర్వహిస్తోంది ఓ మహిళా పోలీస్‌ కానిస్టేబుల్‌. క్యూలైన్‌లో నిలుచుని ఉన్న ఓటర్లు వారిని ఆసక్తిగా చూడటం పరిపాటిగా మారింది. మధ్యాహ్నం 1 గంట వరకు 41.53 శాతం ఓటింగ్‌ నమోదైంది.

మధ్యాహ్నం 1.00 : డీజీపీ ఒపి. గల్‌హోత్రా, స్పెషల్‌ డీజీ ఎన్‌ఆర్‌కే రెడ్డిలు పోలీస్‌ హెడ్‌ క్వాటర్స్‌లోని కంట్రోల్‌ రూం వద్దనుంచి ఓటింగ్‌ జరుగుతున్న ప్రాంతాలలోని పరిస్థితులను సమీక్షిస్తున్నారు. 

మధ్యాహ్నం 12.30 : జోధ్‌పూర్‌ రాజవంశీకులు గజ్‌ సింగ్‌ అతని భార్య.. సర్థార్‌పుర నియోజకవర్గంలోని పోలింగ్‌ బూత్‌ నెం: 194లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అజ్మెర్‌ సౌత్‌లోని నాధ్‌ద్వారా, అల్వార్‌ అర్బన్‌ ప్రాంతాలలో 100 శాతం ఓటింగ్‌ నమోదైంది. 80 ఏళ్లు పైబడ్డ వృద్ధులు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకోవటానికి ఉత్సాహం చూపిస్తున్నారు.

ఉదయం 12.00 : అత్యంత వయస్కురాలు 105 ఏళ్ల షాజ్‌హా అనే వృద్ధురాలు జైపూర్‌లోని కిషన్‌పురలో తన ఓటు హక్కును వినియోగించుకుంది. వీల్‌ ఛైర్ల సదుపాయం లేకపోవటంతో పోలింగ్‌ బూత్‌ వరకు చేతులపై మోసుకుంటూ తేవాల్సివచ్చింది. కొన్ని చోట్ల వృద్ధులకు, దివ్యాంగులకు భద్రతా సిబ్బంది సహాయపడుతున్నారు. ఉదయం 11 గంటల వరకు 21.89 శాతం ఓటింగ్‌ నమోదైంది.

ఉదయం 11.30 : రాజస్తాన్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జొతలి అనే గ్రామంలో పోలింగ్‌ ప్రారంభమైనప్పటి నుంచి కేవలం ఒక ఓటరు మాత్రమే తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. జొతలి గ్రామస్తులు గ్రామంలోని నీటి సమస్యను పరిష్కరించే వరకు ఓటు వెయ్యబోమని తేల్చిచెప్పారు. దీంతో పోలింగ్‌ కేంద్రం వెలవెలబోయింది. అధికారులు మాత్రం వారిని ఒప్పించి ఓటు వేయించటానికి ప్రయత్నిస్తున్నారు. యూనియన్‌ మినిష్టర్‌ అర్జున్‌ రామ్‌ మెగ్వాల్‌.. బికనెర్‌లోని పోలింగ్‌ బూత్‌ నెం: 172లో ఓటు హక్కును వినియోగించుకోవటానికి క్యూలైన్‌లో నిల్చున్నారు. 

ఉదయం 11.00 : రాజస్తాన్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ నాయకురాలు పూనమ్‌ జి. గోయల్‌ పోల్‌ బూత్‌లో సెల్ఫీ తీసుకున్నారు. అంతటితో ఆగకుండా ఆ ఫోటోను ట్విటర్‌ ఖాతాలో ఉంచి, కాంగ్రెస్‌కు ఓటేశానంటూ చెప్పుకొచ్చారు. ఈ సంఘటనపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
జలోర్‌ : అహోర్‌ నియోజకవర్గంలోని పోలింగ్‌ బూత్‌ నెం: 253, 254లలో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈవీఎంలు మొరాయించటంతో పోలింగ్‌ నిలిచిపోయింది. దీంతో ఓటర్లు అసహనానికి గురయ్యారు. 

ఉదయం 10.30 :  కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అశోక్‌ గెహ్‌లాట్‌ జోధ్‌పూర్‌లోని బూత్‌ నెం:106లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 9.30 గంటల వరకు 10.15 శాతం ఓటింగ్‌ నమోదైంది.
బికనెర్‌ : కిసమిదెసర్‌లోని బూత్‌ నెం: 172లో ఈవీఎం సాంకేతిక సమస్యల వల్ల కొత్త ఈవీఎంను ఏర్పాటు చేశారు.

ఉదయం 10.00 : కేంద్ర సహాయ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ జోధ్‌పూర్‌లోని పోలింగ్‌ బూత్‌ నెం: 128లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జోధ్‌పూర్‌ జిల్లాలో 90 ఏళ్ల వృద్ధుడు ఓటు హక్కును వినియోగించుకోవటానికి పోలింగ్‌ బూత్‌ వద్దకు చేరుకున్నాడు. నడవలేని స్థితిలో ఉన్న ఆ వృద్ధుడిని సర్థార్‌పుర నియోజకవర్గంలోని బూత్‌ నెం: 104 వద్దకు ఓ వ్యక్తి మోసుకువచ్చాడు. ఉదయం 9 గంటల వరకు 6.11 శాతం ఓటింగ్‌ నమోదైంది.

ఉదయం 9.30 : యూనియన్‌ మినిష్టర్‌ రాజ్యవర్థన్‌ సింగ్‌ రాథోర్‌ జైపూర్‌లోని వైశాలి నగర్‌ బూత్‌ నెం: 252లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజస్తాన్‌ హోం మినిష్టర్‌ గులాబ్‌ చంద్‌ కటారియా ఉదయ్‌పుర్‌లోని ఓ పోలింగ్‌ బూత్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్‌ నేత సచిన్‌ పైలట్‌ జైపూర్‌లోని జలుపుర.. గౌర్‌ విప్ర్‌ సీనియర్‌ సెకండరీ స్కూల్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
జలోర్‌ : అహోర్‌లోని పోలింగ్‌ బూత్‌ నెం: 253, 254లలో ఈవీఎంలు సరిగా పనిచేయకపోవటం కారణంగా పోలింగ్‌ ఇంకా ప్రారంభం కాలేదు.

ఉదయం 9.00 : రాజస్తాన్‌ ముఖ్యమంత్రి వసుంధర రాజే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జల్‌వార్‌లోని జల్‌రపతాన్‌ నియోజవర్గం బూత్‌ నెం:31ఎ పింక్‌ పోలింగ్‌ బూత్‌లో ఓటు వేశారామె. ఎన్నికల అధికారులు.. మహిళలు ఓటు వేయటానికి అనువుగా పింక్‌ పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేశారు. రాష్ట్రం మొత్తంలో దాదాపు 200 పింక్ పోలింగ్‌ బూత్‌లు ఉన్నాయి.

అజ్మెర్‌ సౌత్‌లోని బూత్‌ నెం:71లో పోలింగ్‌ ఆలస్యమైంది. పోలింగ్‌ అధికారులు బూత్‌ వద్దకు ఆలస్యంగా చేరుకోవటంతో భారీ సంఖ్యలో జనం క్యూలైన్‌లో నిలిచిపోయారు. రాష్ట్రంలోని అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. సీసీటీవీ పర్యవేక్షణతో పాటు భద్రతా సిబ్బంది ప్రతి వాహనాన్ని నిశితంగా పరీక్షిస్తున్నారు.

ఉదయం 8.30 : రాజస్తాన్‌ హోం మినిష్టర్‌ గులాబ్‌ చంద్‌ కటారియా తన ఓటు హక్కును వినియోగించుకునే ముందు ఉదయ్‌పూర్‌లోని శివాలయంలో పూజలు నిర్వహించారు. జైపూర్‌లోని పలు పోలింగ్‌ బూత్‌లలో ఈవీఎంలు మొరాయించటంతో పోలింగ్‌కు ఆటంకం ఏర్పడింది.

ఉదయం 8.00: రాజస్తాన్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. ఓట్లు వేసేందుకు ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల ముందు బారులు తీరారు. ప్రముఖులు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వరుసలో నిలబడ్డారు.

ఉదయం 7.00: రాజస్తాన్‌లోని సర్థార్‌పుర నియోజకవర్గం బూత్‌ నెం:106లో మాక్‌పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. రాజస్తాన్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. పోలింగ్‌ కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 1.44 లక్షల మంది పోలీసు సిబ్బందిని బందోబస్తు కోసం వినియోగిస్తున్నారు. 200 స్థానాలకు గాను 199  సీట్లకు నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. సుమారు 2వేల మంది అభ్యర్థులు బరిలో ఉండగా 51,687 పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement